aasra scheme
-
'ప్రజల ప్రాణాలు తీసిన సర్కారు నిబంధనలు'
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పెన్షన్లనే ఆసరా పథకంగా తెలంగాణ ప్రభుత్వం పేరు మార్చిందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలొ 32 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని ఆమె తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే తప్పులతడకగా సాగిందని విమర్శించారు. పెన్షన్లు ఇవ్వడానికి సర్కారు పెట్టిన నిబంధనలు ప్రజలు ప్రాణాలు తీశాయని మండిపడ్డారు. పెన్షన్లు రానివారు ఇంకా చాలా మంది ఉన్నారని అరుణ అన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ‘ఆసరా’
మంత్రి మహేందర్‌రెడ్డి ఆదిబట్ల : ఆసరా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని , అర్హులందరకీ పింఛన్లు అందించటంమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోందని రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎంపీ పటేల్‌గూడలో జిల్లా సంయుక్త పాలనాధికారి చంపాలాల్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ జిల్లాలో గతంలో రూ.7 కోట్ల రూపాయలు మేరకు పింఛన్లు అందించేవారని, ఇప్పుడు ఆసరా పథకంలో భాగంగా రూ.27 కోట్ల పింఛన్లు ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం రైతుల రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా ఐదు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. బడ్జెట్లో ఆర్‌అండ్‌బీకి రూ.10 వేల కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్లకు రూ. 5 వేల కోట్లను కేటాయించామని తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణకు బడ్జెట్‌ను కేటాయించటం జరిగిందన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు మూడు ల క్షల మూపై వేల రూపాయలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని, దళిత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అమ్మాయిలకు 51 వేల రూపాయలు ఇచ్చి వివాహలు జరిపిస్తామని తెలిపారు. జంట నగరాలలో కోటీ 20 ల క్షల జనాభాకు మంచి నీరుకు 4000 నుంచి 5000 కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నాయన్నారు. మల్కాజ్‌గిరిలో రూ,240 కోట్లతో మంచి నీటి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రూ.150 కోట్లతో 540 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే నిరుద్యోగ సమస్యపై మాట్లాడుతూ.. జిల్లాపై అత్యధిక కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. వాటితో చర్చలు జరిపి నిరుద్యోగులకు ఉపాధిని చూపిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఐలయ్య, ఎంపీపీ, వైస్ ఎంపీపీ వెంకట్రారాంరెడ్డి, కొత్త అశోక్‌గౌడ్, సర్పంచ్ పొట్టి రాములు, ఎంపీటీ సీ సభ్యులు గౌని అండాలు బాలరాజ్గౌ డ్, ఆర్డీవో యాదగిరి రెడ్డి, తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీవో అనిల్‌కుమార్, నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, లచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
పింఛన్ల తొలగింపుపై ఆందోళన
లోకేశ్వరం : అర్హులకు ఆసరా పథకంలో పింఛన్లు మంజూరుకాకపోవడంతో ఆందోళన బాటపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పింఛన్లను తొలగించడంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. మండలంలోని రాయపూర్‌కాండ్లీ గ్రామానికి చెందిన వితంతులు, వృద్ధులు, వికలాంగులు శనివారం లోకేశ్వరం పాత బస్టాండ్ ఏరియాలో మూడు గంటల పాటు రోడ్డుపై బైటాయించి, ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్‌డౌన్ నినాదాలు చేస్తూ ధర్నా కొనసాగించారు. దీంతో లోకేశ్వరం నుంచి నిర్మల్, భైంసా పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అర్హులందరికీ పింఛన్లు ఇప్పించేలా కృషి చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆందోళనకారులు డెప్యూటీ తహశీల్దార్ శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాయపూర్‌కాండ్లీ సర్పంచ్ రాధిక సుదర్శన్‌రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, నాయకులు భీంరావు, నాలం గంగయ్య, ఆనందం, సాయి, నందకేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. మందమర్రిలో మండలంలో.. మందమర్రి : అర్హుల పింఛన్లను తొలగించడాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు శనివారం మందమర్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల నాయకులు మాట్లాడుతూ వివిధ సర్వేల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం అర్హుల పింఛన్లలో కోత పెట్టిందన్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 4,800 మందికి పింఛన్లు వస్తుండగా ప్రస్తుతం వాటిని 2100 కుదించారని తెలిపారు. గతంలో పింఛన్లు పొందిన వికలాంగుల పేర్లు సైతం జాబితా నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన పాలకులు ఆచరణలో చిత్తశుద్ధి కనబరచడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు. గంట పాటు రాస్తారోకో.. పింఛన్ల తొలగింపుపై భగ్గుమన్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై సైతం రాస్తారోకో చేపట్టారు. దాదాపు గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఒక దశలో ఆయా పార్టీల నాయకులు, పింఛన్లు రాని బాధితులు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి యత్నించారు. పోలీసుల రాకతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరంలోనికి వెళ్లిన నాయకులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సొత్కు సుదర్శన్, సట్ల రవీందర్, సంగి సంతోష్, తుమ్మ శ్రీశైలం, నోముల ఉపేందర్‌గౌడ్, టీడీపీ నాయకులు పైడిమల్ల నర్సింగ్, హన్మంతు, సది తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఆసరా పథకం ప్రారంభం
ఖమ్మం జెడ్పీసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఆసరా పథకం శనివారం ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి టి.పద్మారావు చేతుల మీదుగా ఉదయం 10 గంటలకు స్థానిక పెవిలియన్ గ్రౌండ్లో ఖమ్మం నియోజకవర్గ లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. అనంతరం కూసుమంచి మండలం కేంద్రంలో ఉదయం 11 గంటలకు పాలేరు నియోజకవర్గంలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. మొదటిగా నియోజకవర్గానికి వెయ్యిమందికి పింఛన్లు అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆయా ప్రజాప్రతినిధులు పింఛన్లను అందజేయనున్నారు. 9న మండల కేంద్రాల్లో సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. 10న గ్రామస్థాయిలో ప్రారంభించి దశల వారీగా 30 వరకు పూర్తి చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వికలాంగ, వితంతు, కల్లుగీత, చేనేత పింఛన్లకు 3.13 లక్షల దరఖాస్తులు రాగా అధికారులు 3 లక్షల దరఖాస్తులను పరిశీలించి 2.40 లక్షల మందిని అర్హులుగా నిర్ధారించారు. వీటిలో 1.12 లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో వృద్ధాప్య పింఛన్లకు 51 వేలు, వితంతు 46 వేలు, వికలాంగులు 12వేలు, చేనేత కార్మికులకు 553, గీత కార్మికులవి 850 దరఖాస్తులను పూర్తి చేశారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 2,44,730 మందికి పింఛన్లు అందేవి. అయితే ప్రభుత్వం అనర్హులను తొలగించేందుకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించి, వాటిని ప్రత్యేక బృందాలతో తనిఖీ చేయించి అనర్హులను తొలగించనుంది.