చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తున్నారు!
హోమియో కౌన్సెలింగ్
నా భర్త వయసు 35 ఏళ్లు. ఈమధ్య.. చేసిన పనే మళ్లీ చేస్తున్నారు. చేతులు మళ్లీ మళ్లీ కడుక్కోవడం, రాత్రిపూట గ్యాస్ స్టౌను మళ్లీ మళ్లీ చెక్ చేయడం, స్విచ్‌బోర్డు ఆఫ్ చేశారా లేదా అని చూడటం వంటివి చేస్తున్నారు. హోమియోలో పరిష్కారం ఉందా? - నివేదిత, వరంగల్
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ భర్త అబ్బెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) సమస్యతో భాపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక మానసిక రుగ్మత. అనవసరమైన ఆలోచనలు, మానసిక ఒత్తిడి వల్ల ఇది వస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 1.2 శాతం మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. దాంతో ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం మంది ప్రభావితమవుతున్నారు. కొంతమందిలో ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయినా ఈ వ్యాధి వస్తుంది.
ఓసీడీ వ్యాధి ఉన్నవాళ్లు మాటిమాటికీ వాళ్ల వస్తువులను చెక్ చేసుకోవడం, వాళ్లు చేసే పనిమీద అనుమానంతో మాటిమాటికీ పరీక్షించుకుంటూ ఉండటం మీరు చెప్పినట్లుగా గ్యాస్ స్టౌ ఆపేశారా లేదా అని చూడటం, తాళాలు వేశామా లేదా అని పరిశీలించుకోవడం వంటి పనులు పదే పదే చేస్తుంటారు. చేతులు శుభ్రంగా లేవనే భావనతో మాటిమాటికీ చేతులు కడుక్కుంటూ ఉంటారు. దీనివల్ల మానసికంగానూ, శారీరకంగానూ అలసిపోతూ ఉంటారు. ఏదైనా ఆలోచన వచ్చిందంటే అది పదేపదే వారి మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఏదో జరుగుతోందని మాటిమాటికీ అనుకుంటూ ఉంటారు.
కారణాలు : జన్యుకారణాలు, పర్యావరణ పరిస్థితులు మానసిక ఒత్తిడి ఇన్ఫెక్షన్స్ అధికంగా ఆలోచించడం.
లక్షణాలు : మాటిమాటికీ డోర్ లాక్ చేశారా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండటం తమ అనుమానాలతో ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టడం చాలాసార్లు అంకెలను లెక్కించడం.
చికిత్స : ఓసీడీని హోమియో పద్ధతిలో ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో మూల కారణాన్ని గుర్తించి, దానికి చికిత్స చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ రాకుండా వ్యాధిని నయం చేయవచ్చు. ఓసీడీకి హోమియోలో ఆర్సినికమ్ ఆల్బమ్, అర్జెంటమ్ నైట్రికమ్, నక్స్‌వామికా, మెరిడోనమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో తగిన మోతాదులో వాడితే తప్పక మంచి ఫలితాలు కనిపిస్తాయి.
బాబులో తగినంత ఎదుగుదల లేదా?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా బాబుకు 14 నెలలు. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. ఏదైనా ఆసరా తీసుకొని కొద్దిగా నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకటి రెండు శబ్దాలు తప్ప... వాడికి ఇంకా ముద్దుమాటలు రావడం లేదు. వాడి వయసు వారిని చూస్తే వాడి ఎదుగుదలలో ఏవైనా లోపాలున్నాయేమోనని అనిపిస్తోంది. ఇతర పిల్లలను చూసినప్పుడు వాణ్ణి చూస్తే చాలా బాధకలుగుతోంది. పిల్లల వికాసం ఏయే వయసుల్లో ఎలా ఉంటుందో తెలియజేయండి. మాకు తగిన సలహా ఇవ్వగలరు. - రాజేశ్వరి, నకిరెకల్
మీ బాబు ఎదుగుదల విషయంలో కాస్త నిదానంగా ఉన్నాడంటూ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే... మీరలా అనుకోవడానికి నిర్దిష్టంగా కారణలేమీ కనిపించడం లేదు. ప్రతి పిల్లవాడి ఎదుగుదల, వికాసం వేర్వేరుగా ఉంటుంది. పిల్లల డెవలప్మెంట్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఫలానా పిల్లలు ఫలానా సమయంలోనే ఫలానా నైపుణ్యాలను నేర్చుకుంటారని చెప్పడం కుదరదు. కొంతమంది చాలా త్వరగా నడుస్తారు, మాట్లాడతారు. మరికొందరు కాస్త ఆలస్యంగా. అయితే ఎవరు ఎప్పుడు ఆ నైపుణ్యాలు నేర్చుకుంటారన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు... నెలలు నిండకముందే పుట్టడం, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి ఏవైనా సమస్యలు రావడం, పుట్టాక జాండీస్, ఇన్ఫెక్షన్స్ వంటివి రావడం, కొన్ని జన్యుపరమైన కారణాలు, పిలల్లను పెంచే ప్రక్రియలో తల్లిదండ్రులు ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉండటం, కవల పిల్లలు కావడం వంటి అనేక అంశాలు వాళ్ల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
నడక: సాధారణంగా పిల్లలు 11 నుంచి 16 నెలల మధ్య నడవడం ప్రారంభిస్తారు. కొందరు ఆలస్యంగా నడవడం మొదలుపెట్టవచ్చు. 18 నెలల పిల్లలు నడవడంతో పాటు ఏదైనా వస్తువులు పట్టుకుని లాగడం, వస్తువులను దూరంగా నెట్టడం, బుక్ చేతికి ఇచ్చినప్పుడు పేజీలు తిప్పడం, క్రేయాన్స్ వంటివి ఇస్తే వాటితో నేలమీద, గోడలపై రాయడం, నేల మీదే దృష్టిపెట్టి పరుగెత్తడం వంటివి సులభంగా చేస్తుంటారు. రెండేళ్లు వచ్చే సరికి తలుపులు తెరవడం, సొరుగులు లాగడం, చేతులు కడుక్కోవడం, మెట్లు ఎక్కడం లాంటివి చేస్తుంటారు. అయితే ఈ పనులు చేయడంలోనూ పిల్లవాడికీ, పిల్లవాడికీ మధ్య తేడాలుంటాయి.
మాటలు: ఇక మాటల విషయానికి వస్తే 15 నెలలు నిండిన చిన్నారులు ముద్దుమాటలతో పాటు, ఒకటి రెండు నిజశబ్దాలు పలకడం చేస్తుంటారు. 18 నుంచి 24 నెలల వయసుకు వాళ్లు 15-20 పదాలు పలకడంతోపాటు తల్లిదండ్రుల సూచనలకు రెస్పాండ్ అవుతుంటారు.
18-20 నెలల వయసు వచ్చేటప్పటికి కొద్దిగా కూడా మాటలు రాకపోతే, చుట్టుపక్కల శబ్దాలకు ఏమాత్రం రెస్పాండ్ కాకపోతే... అప్పుడు అలాంటి పిల్లలకు డెవలప్మెంట్ డిలే ఉన్నట్లుగా పరిగణిస్తాం. అలాంటి పిల్లల్లో వినికిడి లోపాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇక మీ బాబు విషయానికి వస్తే... అతడు కొన్ని శబ్దాలను పలకడం, కొన్ని వస్తువుల ఆసరాతో నిలబడటం వంటివి చేస్తున్నాడు. ఇతరత్రా సమస్యలేమీ లేవు. డెవలప్మెంట్ డిలేని సూచించే లక్షణాలేమీ కనిపించడం లేదు. అయితే ఇలా డెవలప్మెంట్ డిలే ఉన్నట్లు అనుమానించే పిల్లల విషయంలో క్రమం తప్పకుండా ఫాలో అప్స్‌తో పాటు క్లోజ్ అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. ఒకవేళ నిజంగానే గ్రాస్ డెవలప్మెంట్ డిలే ఉంటే త్వరగా కనుక్కుని అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవడం (అర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్) ద్వారా వాళ్లను సరిచేయడానికి అవకాశం ఉంది. మీరు మీ పీడియాట్రీషియన్ ఆధ్వర్యంలో మీ బాబుకు ఫాలోఅప్స్ చేయించండి.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్