abdul ajij
-
కార్పొరేషన్‌కు రూ.995 కోట్లు మంజూరు
నెల్లూరు, సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా పథకాల కింద రూ.995 కోట్లు మంజూరైనట్లు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఇన్చార్జ్ కమిషనర్ ఇంతియాజ్‌తో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీకి రూ.520 కోట్లు, తాగునీటి పథకం కింద రూ.475 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరుకు కీలకపాత్ర వహించిన సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రి నారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో నెల్లూరు నగరం స్మార్ట్‌సిటీని తలదన్నే విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు అబ్దుల్ జలీల్, బాలకోటేశ్వరరావు, వహిద, మామిడాల మధు, జహీర్, షంషుద్దీన్ ఉన్నారు. -
సొత్తు కోసమే చంపేశారు..
విజయవాడ సిటీ : నగరంలోని గుణదల ఈఎస్ఐ ఆస్పత్రి వెనుక వైపు, జియోన్ పాఠశాల సమీపంలో జరిగిన వల్లభనేని మాధురీ దేవి(65) హత్య కేసు మిస్టరీ వీడింది. గతంలో వారింట్లో కార్పెంటరీ పనులు చేసిన తోట్లవల్లూరు కనకదుర్గానగర్ కాలనీకి చెందిన అబ్దుల్ అజీజ్, తన స్నేహితుడు వాహిద్‌తో కలిసి నగల కోసమే ఆమెను హతమార్చినట్లు పోలీసులు నిర్థారించారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇద్దరినీ వేర్వేరుగా ఉంచి విచారణ జరుపుతున్నారని సమాచారం. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ‘సేఫ్ సిటీ’ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్న తరుణంలో సొత్తు కోసం హత్య చేయడాన్ని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితులను వారి ఇళ్ల వద్దనే అదుపులోకి తీసుకున్నారు. ఇతర కేసుల్లో వారి ప్రమేయంపై ఆరా తీస్తున్నట్టు చెపుతున్నారు. ముందస్తు పథకంతోనే నిందితులు ముందస్తు పథకంలో భాగంగానే సొత్తు కోసం మాధురీదేవిని హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గతంలో ఇక్కడ కార్పెంటరీ పనులు చేసిన సమయంలో పెద్ద మొత్తంలో నగలు, నగదు ఉండటాన్ని అజీజ్ గుర్తించాడు. అప్పటి నుంచి అవకాశం చూసుకొని దోపిడీకి పథకం రూపొందించుకున్నట్టు తెలిసింది. ఇందుకోసం తన స్నేహితుడైన వాహిద్ సహకారం తీసుకున్నట్టు చెపుతున్నారు. నగలు ఇచ్చేం దుకు ఆమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడిన నిందితులు..తాళాలు దొరక్క బీరువాలోని నగలు వదిలేసి వంటిపై నగలతోనే ఉడాయించారు. హత్య జరిగిందెప్పుడు? హత్య జరిగిన సమయంపై పోలీసులు తగిన నిర్థారణకు రాలేకపోతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిందితుడు వచ్చినట్టు కోడలు సరిత ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు గుర్తించారు. అదే సమయంలో పిల్లలను తీసుకొని సరిత బయటకు వెళ్తున్నప్పుడు లోపల మాధురీదేవి ఉయ్యాలలో కూర్చొని ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెపుతున్నారు. మరి ఆ గంట పాటు నింది తులు ఎక్కడ ఉన్నారనే దానిపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది తెలిస్తే హత్య వెనుకున్న ఇతర కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందనేది పోలీసు అధికారుల అభిప్రాయం. కోడలు సరిత సహా ఇంట్లోని వాళ్లందరూ బయటకు వెళ్లిన తర్వాతనే నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. అజీజ్ లోనికి వెళితే.. రెండో నిందితునిగా భావిస్తున్న వాహిద్ ఇతరులను గమనించేందుకు బయట ఉండొచ్చనే అభిప్రాయం పోలీసు అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. ఏం జరిగిందంటే.. జీయోన్ పాఠశాల సమీపంలోని సొంత ఇంటి కింది పోర్షన్లో మాధురీదేవి నివసిస్తున్నారు. పై పోర్షన్లో ఆమె కొడుకు సుజన్, కోడలు సరిత ఉంటున్నారు. మాధురీదేవి వద్దకు ఆదివారం మధ్యాహ్నం కార్పెంటరీ పనులు చేసే అబ్దుల్ అజీజ్ వచ్చాడు. ఎందుకొచ్చావని మాధురీదేవి ప్రశ్నించడంతో ‘మేకులు కొట్టేందుకు మీ కోడలు రమ్మంది’ అని అతడు బదులి చ్చాడు. ఇంటర్ కమ్ ఫోన్లో కోడలిని సంప్రదించిన మాధురీదేవి నిందితుడు అబద్దం చెబుతున్నట్లు నిర్ధారించుకొని వెనుదిరిగింది. సొత్తు కోసం అబ్దుల్ అజీజ్ బెదిరించగా ఆమె ప్రతిఘటించింది. అయితే అజీజ్, అతని స్నేహితుడు వాహిద్ సమీపంలోని వైరుతో ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఆమె కిందపడటంతో గాయపడి రక్తం స్రవించడంతో అనుమానం రాకుండా ఉండేందుకు సమీపంలోని దిండుతో శుభ్రపరిచారు. అనంతరం ఆమె వంటిపై ఉన్న బంగారు గాజులు, అందుబాటులోని నగదుతో ఉడాయించారు. అదే ఇంట్లోని పైభాగంలో ఉండే కోడలు పిల్లలతో కలిసి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చూడగా మాధురీదేవి కిందపడిపోయి కని పించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె మృతి చెందినట్టు నిర్థారించుకున్న తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలి కోడలు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. -
నెల్లూరు టీడీపీలో అజీజ్ ముసలం
సాక్షి విజయవాడ బ్యూరో: నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో అబ్దుల్ అజీజ్ ముసలం పుట్టింది. నిన్న మొన్నటి వరకు కత్తులు దూసుకున్న వ్యక్తులను మంత్రి నారాయణ తమకు మాట మాత్రం కూడా చెప్పకుండా పార్టీలోకి తీసుకు రావడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లు గుర్రుమంటున్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని సైతం సైకిలెక్కించేందుకు నారాయణ నడుపుతున్న మంత్రాం గాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. రెండు దశాబ్దాలుగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అంటే సోమిరెడ్డి అనేలా చక్రం తిప్పుతూ వచ్చారు. జిల్లాలో ఎవరికి పార్టీలోకి తీసుకోవాలన్నా, ఎవరికి పొగపెట్టాలన్నా, ఎవరికి పదవులు ఇవ్వాలన్నా సోమిరెడ్డికి తెలియకుండా జరిగేవి కావు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి అండ్ కోను పార్టీలోకి తీసుకోవడంతోనే సోమిరెడ్డి ఆధిపత్యానికి చెక్‌పడింది. చివరకు సోమిరెడ్డి తనకు అత్యంత సన్నిహితుడైన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి కోవూరు టికెట్ ఇప్పించుకోలేకపోయారు. తాను కోరుకున్న నెల్లూరు రూరల్ నియోజక వర్గాన్ని కూడా దక్కించుకోలేక పోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవి మీద కన్నేస్తే విద్యాసంస్థల అధినేత నారాయణ దాన్ని తన్నుకు పోవడానికి సిద్ధమయ్యారు. పోతే పోనీ అని సముదాయించుకున్న సోమిరెడ్డికి జిల్లాలో అటుపార్టీలోను, ఇటు అధికారయంత్రాగంలోను నారాయణ చక్రం తిరుగుతుండటం సహించలేకపోతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థిగా తమతో తలపడిన అబ్దుల్ అజీజ్‌ను తమకు మాటమాత్రమైనా చెప్పకుండా నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లి పార్టీలో చేర్పించడంపై సోమిరెడ్డితో పాటు ఆయన మద్దతు దారులు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ పడి కోట్లు కుమ్మరించిన సోమిరెడ్డి మనిషి జెడ్.శివప్రసాద్ దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. నారాయణ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలోకి తేవడానికి పావులు కదుపుతున్నారనే సమాచారం అటు సోమిరెడ్డితోపాటు ఇటు మాజీ ఎంపీ ఆదాలప్రభాకర్రెడ్డి వర్గానికి కూడా మింగుడుపడటం లేదని వినికిడి. వీరితోపాటు మరికొందరు నాయకులను పార్టీలోకి తెచ్చేందుకు నారాయణ చేస్తున్న మంతనాలు వీరికి ఏ మాత్రం రుచించడంలేదని తెలిసింది. అయితే ఇప్పుడు నారాయణ శకం నడుస్తున్నందువల్ల బహిరంగంగానే ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడిందని ఆ జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు నిస్సహాయత వ్యక్తం చేశారు.