విజయవాడ సిటీ : నగరంలోని గుణదల ఈఎస్‌ఐ ఆస్పత్రి వెనుక వైపు, జియోన్ పాఠశాల సమీపంలో జరిగిన వల్లభనేని మాధురీ దేవి(65) హత్య కేసు మిస్టరీ వీడింది. గతంలో వారింట్లో కార్పెంటరీ పనులు చేసిన తోట్లవల్లూరు కనకదుర్గానగర్ కాలనీకి చెందిన అబ్దుల్ అజీజ్, తన స్నేహితుడు వాహిద్‌తో కలిసి నగల కోసమే ఆమెను హతమార్చినట్లు పోలీసులు నిర్థారించారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇద్దరినీ వేర్వేరుగా ఉంచి విచారణ జరుపుతున్నారని సమాచారం.
నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ‘సేఫ్ సిటీ’ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్న తరుణంలో సొత్తు కోసం హత్య చేయడాన్ని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితులను వారి ఇళ్ల వద్దనే అదుపులోకి తీసుకున్నారు. ఇతర కేసుల్లో వారి ప్రమేయంపై ఆరా తీస్తున్నట్టు చెపుతున్నారు.
ముందస్తు పథకంతోనే
నిందితులు ముందస్తు పథకంలో భాగంగానే సొత్తు కోసం మాధురీదేవిని హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గతంలో ఇక్కడ కార్పెంటరీ పనులు చేసిన సమయంలో పెద్ద మొత్తంలో నగలు, నగదు ఉండటాన్ని అజీజ్ గుర్తించాడు. అప్పటి నుంచి అవకాశం చూసుకొని దోపిడీకి పథకం రూపొందించుకున్నట్టు తెలిసింది. ఇందుకోసం తన స్నేహితుడైన వాహిద్ సహకారం తీసుకున్నట్టు చెపుతున్నారు. నగలు ఇచ్చేం దుకు ఆమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడిన నిందితులు..తాళాలు దొరక్క బీరువాలోని నగలు వదిలేసి వంటిపై నగలతోనే ఉడాయించారు.
హత్య జరిగిందెప్పుడు?
హత్య జరిగిన సమయంపై పోలీసులు తగిన నిర్థారణకు రాలేకపోతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిందితుడు వచ్చినట్టు కోడలు సరిత ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు గుర్తించారు. అదే సమయంలో పిల్లలను తీసుకొని సరిత బయటకు వెళ్తున్నప్పుడు లోపల మాధురీదేవి ఉయ్యాలలో కూర్చొని ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెపుతున్నారు. మరి ఆ గంట పాటు నింది తులు ఎక్కడ ఉన్నారనే దానిపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇది తెలిస్తే హత్య వెనుకున్న ఇతర కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందనేది పోలీసు అధికారుల అభిప్రాయం. కోడలు సరిత సహా ఇంట్లోని వాళ్లందరూ బయటకు వెళ్లిన తర్వాతనే నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. అజీజ్ లోనికి వెళితే.. రెండో నిందితునిగా భావిస్తున్న వాహిద్ ఇతరులను గమనించేందుకు బయట ఉండొచ్చనే అభిప్రాయం పోలీసు అధికారుల నుంచి వ్యక్తమవుతోంది.
ఏం జరిగిందంటే..
జీయోన్ పాఠశాల సమీపంలోని సొంత ఇంటి కింది పోర్షన్‌లో మాధురీదేవి నివసిస్తున్నారు. పై పోర్షన్‌లో ఆమె కొడుకు సుజన్, కోడలు సరిత ఉంటున్నారు. మాధురీదేవి వద్దకు ఆదివారం మధ్యాహ్నం కార్పెంటరీ పనులు చేసే అబ్దుల్ అజీజ్ వచ్చాడు. ఎందుకొచ్చావని మాధురీదేవి ప్రశ్నించడంతో ‘మేకులు కొట్టేందుకు మీ కోడలు రమ్మంది’ అని అతడు బదులి చ్చాడు. ఇంటర్ కమ్ ఫోన్‌లో కోడలిని సంప్రదించిన మాధురీదేవి నిందితుడు అబద్దం చెబుతున్నట్లు నిర్ధారించుకొని వెనుదిరిగింది.
సొత్తు కోసం అబ్దుల్ అజీజ్ బెదిరించగా ఆమె ప్రతిఘటించింది. అయితే అజీజ్, అతని స్నేహితుడు వాహిద్ సమీపంలోని వైరుతో ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఆమె కిందపడటంతో గాయపడి రక్తం స్రవించడంతో అనుమానం రాకుండా ఉండేందుకు సమీపంలోని దిండుతో శుభ్రపరిచారు. అనంతరం ఆమె వంటిపై ఉన్న బంగారు గాజులు, అందుబాటులోని నగదుతో ఉడాయించారు.
అదే ఇంట్లోని పైభాగంలో ఉండే కోడలు పిల్లలతో కలిసి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చూడగా మాధురీదేవి కిందపడిపోయి కని పించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె మృతి చెందినట్టు నిర్థారించుకున్న తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలి కోడలు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
సొత్తు కోసమే చంపేశారు..
Published Tue, Dec 2 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM
Advertisement
Advertisement