సాక్షి విజయవాడ బ్యూరో: నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో అబ్దుల్ అజీజ్ ముసలం పుట్టింది. నిన్న మొన్నటి వరకు కత్తులు దూసుకున్న వ్యక్తులను మంత్రి నారాయణ తమకు మాట మాత్రం కూడా చెప్పకుండా పార్టీలోకి తీసుకు రావడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లు గుర్రుమంటున్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని సైతం సైకిలెక్కించేందుకు నారాయణ నడుపుతున్న మంత్రాం గాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. రెండు దశాబ్దాలుగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అంటే సోమిరెడ్డి అనేలా చక్రం తిప్పుతూ వచ్చారు.
జిల్లాలో ఎవరికి పార్టీలోకి తీసుకోవాలన్నా, ఎవరికి పొగపెట్టాలన్నా, ఎవరికి పదవులు ఇవ్వాలన్నా సోమిరెడ్డికి తెలియకుండా జరిగేవి కావు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి అండ్ కోను పార్టీలోకి తీసుకోవడంతోనే సోమిరెడ్డి ఆధిపత్యానికి చెక్‌పడింది. చివరకు సోమిరెడ్డి తనకు అత్యంత సన్నిహితుడైన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి కోవూరు టికెట్ ఇప్పించుకోలేకపోయారు. తాను కోరుకున్న నెల్లూరు రూరల్ నియోజక వర్గాన్ని కూడా దక్కించుకోలేక పోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవి మీద కన్నేస్తే విద్యాసంస్థల అధినేత నారాయణ దాన్ని తన్నుకు పోవడానికి సిద్ధమయ్యారు.
పోతే పోనీ అని సముదాయించుకున్న సోమిరెడ్డికి జిల్లాలో అటుపార్టీలోను, ఇటు అధికారయంత్రాగంలోను నారాయణ చక్రం తిరుగుతుండటం సహించలేకపోతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా తమతో తలపడిన అబ్దుల్ అజీజ్‌ను తమకు మాటమాత్రమైనా చెప్పకుండా నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లి పార్టీలో చేర్పించడంపై సోమిరెడ్డితో పాటు ఆయన మద్దతు దారులు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ పడి కోట్లు కుమ్మరించిన సోమిరెడ్డి మనిషి జెడ్.శివప్రసాద్ దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
నారాయణ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలోకి తేవడానికి పావులు కదుపుతున్నారనే సమాచారం అటు సోమిరెడ్డితోపాటు ఇటు మాజీ ఎంపీ ఆదాలప్రభాకర్‌రెడ్డి వర్గానికి కూడా మింగుడుపడటం లేదని వినికిడి. వీరితోపాటు మరికొందరు నాయకులను పార్టీలోకి తెచ్చేందుకు నారాయణ చేస్తున్న మంతనాలు వీరికి ఏ మాత్రం రుచించడంలేదని తెలిసింది. అయితే ఇప్పుడు నారాయణ శకం నడుస్తున్నందువల్ల బహిరంగంగానే ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడిందని ఆ జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు నిస్సహాయత వ్యక్తం చేశారు.
నెల్లూరు టీడీపీలో అజీజ్ ముసలం
Published Sat, Aug 9 2014 3:36 AM | Last Updated on Mon, Oct 22 2018 8:50 PM
Advertisement
Advertisement