ఎఫ్‌వైయూపీపై ప్రొఫెసర్ విశ్లేషణ ఎందుకిలా జరిగిందంటే...
డీయూ వైస్చాన్స్లర్లు దీపక్ పెంటల్, దినేశ్ సింగ్ నిరంకుశత్వం, అస్తవ్యస్త విధానం వల్లే ఎఫ్‌వైయూపీ, సెమిస్టర్ విధానం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని డీయూ భౌతికశాస్త్ర అధ్యాపకురాలు అభాదేవ్ హబీబ్ చెబుతున్నారు. ప్రజాస్వామిక వాతావరణంలో చర్చలు నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఆమె విశ్లేషించారు.
న్యూఢిల్లీ:నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఎఫ్‌వైయూపీ) ప్రవేశపెట్టినప్పటి నుంచి ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థులు, వీరి తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తల ఆందోళనలు, కోర్టు కేసులు, యూజీసీ జోక్యం.. ఈ సమస్యలన్నింటితో డీయూ తలపట్టుకుంది. చివరికి యూజీసీ జోక్యం తో కోర్సు రద్దయింది. ఎఫ్‌వైయూపీ ప్రవేశపెట్టేముందు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని డీయూ భౌతికశాస్త్ర అధ్యాపకురా లు అభాదేవ్ హబీబ్ అంటున్నారు.
ఈ వివాదంపై విశ్లేషణ ఆమె మాటల్లోనే...
ఎఫ్‌వైయూపీపై డీయూలో నెలకొన్న ఆందోళన, ప్రతిష్టంభన మన ముందు ఎన్నో ప్రశ్నలను ఉంచింది. ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకొనే సమయంలో విద్యావేత్తలు, విధానకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీయూ ఉదంతం సూచిస్తోంది. ఈ ఘటన మనకు రెండు విషయాలను నేర్పుతోంది. 1. అన్ని మార్పులనూ సంస్కరణలుగా భావించలేం 2. సంస్కరణల అమలుకు విధానాలు, కాలపరిమితి చాలా ముఖ్యం.
‘డీయూలో ఎఫ్‌వైయూపీ వివాదాన్ని అడ్డుకోవడం సాధ్యమయ్యేదా ?’ అనే ప్రశ్నకు క్యాంపస్‌లో ఇటీవలి పరిణామాల ను అధ్యయనం చేయడం ద్వారానే తగిన జవాబు వస్తుంది. డీయూలో సెమిస్టర్ విధానం ప్రవేశంపై 2010లో ఆందోళనలు కొనసాగుతున్న సమయం లో దినేశ్ సింగ్ వైస్ చాన్స్‌లర్ అయ్యారు. సెమిస్టర్ విధానాన్ని దినేశ్‌కు ముందున్న వీసీ దీపక్ పెంటల్ హ డావుడిగా విద్యార్థులపై రుద్దారు. కొత్త వీసీ అన్ని విషయాలపై తమతో చర్చిస్తారని ప్రొఫెసర్లు, విద్యార్థులు భావించారు. సెమిస్టర్ విధానంలో బోధించేందుకు తిరస్కరించే ప్రొఫెసర్ల జీతాలు నిలి పివేస్తామని బాధ్యతలు చేపట్టిన రెండోరోజే సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
ఆయన సమస్యలను పరి ష్కరించే విధానం ఏమిటో అదేరోజు అర్థమయిం ది. సింగ్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందని అప్పటి మంత్రి కపిల్ సిబాల్ ఆయనను సన్మానించినప్పుడే తేలింది. సెమిస్టర్ విధానాన్ని వ్యతిరేకించిన ప్రొఫెసర్లు, అధ్యాపక సంఘాలను యాజమాన్యం ఇబ్బందిపెట్టింది. అంటే చర్చలపై ఆయనకు కొంచెం కూడా నమ్మకం లేదని భావిం చాల్సి ఉంటుంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏది చెబితే దానిని అమలు చేశారు.
సులువుగా పరిష్కరించగలిగే చిన్న విషయాలను కూడా పెద్దవి చేశా రు. ఉదాహరణకు 2012లో సెమిస్టర్ విధానం లో పరీక్షలు రాసిన వారికి ఊహించనంత భారీగా మార్కులు వచ్చాయి. ఈ విషయాన్ని అధ్యాపకులు ప్రశ్నించినా వీసీ పట్టించుకోలేదు. పరీక్షల మూ ల్యాంకన విధానాన్ని సమీక్షించేందుకు ఆయన ససేమిరా అన్నారు. ఆయన పరిష్కార విధానం చాలా ‘సులువు’గా ఉంటుంది. విద్యార్థుల మార్కుల సమాచారం ఎవరికీ దొరక్కుండా చేశారు. విద్యార్థులు, ప్రొఫెసర్ల నిజమైన సమస్యలపై ఎన్నడూ స్పందించలేదు.
కేంద్ర ప్రభుత్వమే చేయించింది..
సెమిస్టర్, ఎఫ్‌వైయూపీ విధానాలను విద్యాసంస్కరణల్లో భాగంగా ప్రవేశపెట్టారని అనుకోవడం సాధ్యం కాదు. వీటి ప్రవేశం ద్వారా కొత్త పాలనా విధానం అమలయింది. ఎలాంటి చర్చా లేకుండా వీసీ నిర్ణయం తీసుకునే పద్ధతి వచ్చింది. విధివిధానాలు, నియమాల గురించి ఎవరితోనూ మాట్లాడకుండానే మీడియాను పిలిచి అధికారికంగా ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య హక్కులు, భావజాలంపై దాడి జరిగింది. డీయూ అధ్యాపక సంఘం (డూటా) వంటివి సమావేశాలకు రాకుండా అడ్డుకున్నారు. వీసీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించలేదు.
యూజీసీ, ఇతర విభాగాలను లెక్క చేయకుండా వీసీ తనకు వ్యతిరేకంగా వ్యవహరిం చిన వారందరిపైనా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా ఏమైనా అంటే ‘నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ?’ అంటూ హెచ్చరించారు. అప్పటి మంత్రి కపిల్ సిబాల్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, అశోక్ ఠాకూర్.. వీసీ వెనక ఉండి ఇదంతా నడిపించారు.
ఓబీసీ విద్యార్థులకు కేటాయించిన నిధులను దారి మళ్లించి ఎఫ్‌వైయూపీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు కొనిచ్చారు. దీంతో డీయూలో అక్రమాలు, కుంభకోణాలు రాజ్యమేలాయి. దేనికైనా వీసీ సింగ్‌పై ఆధారపడే దుస్థితి వచ్చింది. కోర్సుల్లో ఇష్టమొచ్చినట్టు మార్పులు చేశారు. ఎఫ్‌వైయూపీ విధానం సక్రమంగా లేదంటూ మొదటి ఏడాది విద్యార్థులు ఎంత మొత్తుకున్నా, వీసీ వినలేదు. అయితే ప్రజాస్వామ్యవాదుల ఒత్తిడి ఫలితంగా వీసీ నిరంకుశత్వానికి తెరపడింది.