విఘ్నేశ్వరునికి క్షీరాభిషేకం
ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు
కాణిపాకం (ఐరాల) : స్వయంభువు కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేకోత్సవాలలో సోమవారం రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవ సందర్భంగా ఆలయంలో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేశారు. ఉభయదారులు మణికంఠేశ్వర ఆలయం నుంచి పాలబిందెలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. తొలుత స్థానిక మరగదాంబికా సమేత మనికంఠేశ్వరస్వామి ఆలయంలో క్షీర కలశాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్ ఆర్సీపీకి చెందిన నగరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఆర్కే.రోజా, డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆలయంలోని అలంకార మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
పట్టు వస్త్రాల సమర్పణ
చంద్రప్రభ వాహనసేవకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ విశ్రాంత అదనపు కమిషనర్ అగరంపల్లెకు చెందిన జీ.కేశవులు సోమవారం ఉదయం తమ గ్రామం నుంచి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందజేశారు.వీటిని స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లిఖార్జున పాల్గొన్నారు.