ప్రధాన ప్రత్యర్థిని కొనేసిన మింత్ర
ఆన్ లైన్ ఫ్యాషన్ దిగ్గజం మింత్ర తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీ ,గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్ జబాంగ్ ను హస్తగతం చేసుకుంది. భారతదేశం లో అతిపెద్ద ఫ్యాషన్ షాపింగ్ డెస్టినేషన్ గా అవతరించడానికే ఈ కొనుగోలుచేసినట్టు మింత్ర మంగళవారం వెల్లడించింది. నమ్మకమైన కస్టమర్ బేస్ ఉన్న జబాంగ్ కొనుగోలుతో ప్రత్యేక ప్రపంచ బ్రాండ్లను అందించే ఏకైక సంస్థగా నిలవనున్నామని తెలిపింది. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ విభాగంలోఇండియా లో తిరుగులేని నాయకుడిగా పేరెంట్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ , మింత్రా అవతరించిందనీ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్వాధీనం ద్వారా అతిపెద్ద ఫ్యాషన్ వేదిక ఏర్పాటు దిశగా తమ ప్రయాణం లో మరో అడుగు పడిందన్నారు. మిలియన్ల వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లను అందుబాటులోకి తేనున్నామన్నారు. భారత ఈ కామర్స్ వ్యాపార అభివృద్ధిలో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ దే కీలకభూమిక అని ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్న బన్సాల్ వ్యాఖ్యానించారు. వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచుకోవడంలో ఈ స్వాధీనం ఉపయోగపడతుందన్నారు. ముఖ్యంగా బ్రాండ్ సంబంధాలు, వినియోగదారు అనుభవంలో తమ రెండు సంస్థల మధ్య సమన్వయంతో రాబోయే నెలల్లోఈ కామర్స్ మార్కెట్ ను షేక్ చేయనున్నామని ఆయన వివరించారు
మింత్రా ద్వారా జబాంగ్ ను చేజిక్కించుకోవడం ఆన్లైన్ వ్యాపారంలో మరింత పోటీ పెరుగనుందని నిపుణుల అభిప్రాయం. టాటాక్లిక్, అబోఫ్, రిలయన్స్ తదితరకంపెనీల వస్తున్న తీవ్ర పోటీ నేపథ్యంలోనే ఈ కొనుగోలు జరిగిందని భావిస్తున్నారు