రోహిత్ ఆత్మహత్యపై రాజకీయాలు
హెచ్‌సీయూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ ఆరోపణ
సాక్షి, న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్యపై పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని హెచ్‌సీయూలో ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య ఘటనలో వాస్తవాలు చెప్పడానికి విద్యార్థి పరిషత్ నాయకులతో పాటు తాను కూడా విశ్వవిద్యాలయాలకు వెళ్లి వివరించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. సుశీల్ కుమార్ గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రోహిత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని, వాస్తవాలు అందరికీ తెలియాలని చెప్పారు. ఇప్పటి వరకూ విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఘటనలన్నింటిపైనా పారదర్శక విచారణ చేపట్టి వాస్తవాలను బహిరంగపర్చాలన్నారు.
వర్సిటీల్లో సామాజిక వివక్ష ఉందా లేదా అనేదానిపై కూడా విచారణ జరగాలని చెప్పారు. యాకూబ్ మెమెన్ ఉరికి వ్యతిరేకంగా జరిగిన ఘటనలను దళితులు, దళితేతరుల అంశంగా మార్చారని, రోహిత్ ఆత్మహత్య తర్వాత హెచ్సీయూకు వచ్చేవారందరికీ వాస్తవాలు తెలియవని పేర్కొన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకోబోమని, విద్యార్థి జెఏసీకి ఆ హక్కు ఉందని ఆయన చెప్పారు. అంబేడ్కర్ అందరివాడని, ఆయన పేరు చెప్పకుని ఏది చేసినా చెల్లుతుందంటే కుదరదని స్పష్టం చేశారు.