ఆంధ్ర చేతిలో హైదరాబాద్ ఓటమి
గుంటూరు స్పోర్ట్స్, న్యూస్‌లైన్: సౌత్‌జోన్ అండర్-19 మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర చేతిలో హైదరాబాద్‌కు పరాజయం ఎదురైంది. గుంటూరులోని ఏసీఏ మహిళా అకాడమీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 49.1 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. హిమాని యాదవ్ (80 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, అరుంధతి రెడ్డి (24) ఫర్వాలేదనిపించింది. ఆంధ్ర బౌలర్లలో అంజలి శర్వాణి, నవ్య దుర్గ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆంధ్ర 49.1 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఝాన్సీ లక్ష్మి (108 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, అనూష (106 బంతుల్లో 45; 3 ఫోర్లు), మేఘన (26 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో ఆంధ్ర కు 4 పాయింట్లు దక్కాయి. హైదరా బాద్ బౌలర్లలో పీవీ గోరెంట్ల, శర్వాణిలకు ఒక్కో వికెట్ దక్కింది.