17 ఏళ్ల కనిష్ట స్థాయికి పెట్రోల్ ధరలు
కాన్ బెర్రా: ఇండియా పెట్రోల్ ధరలు ఎగబాకుతుంటే ఆస్ట్రేలియాలో మాత్రం రికార్డు స్థాయిలో తగ్గుతున్నాయి. ఆసీస్ లో పెట్రోల్ ధరలు 17 ఏళ్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఆస్ట్రేలియా వ్యాప్తంగా పెట్రోల్ ధర 1999 నాటి స్థాయికి పతనమైందని ఆస్ట్రేలియన్ కాంపిటిషన్ అండ్ కన్జుమర్ కమిషన్(ఏసీసీసీ) తెలిపింది. 2016, మార్చితో ముగిసిన క్వార్టర్ లో పెట్రోల్ ధర దాదాపు 10 శాతం తగ్గింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 54 రూపాయలకు(81.4 అమెరికా సెంట్ల)కు దిగొచ్చింది.
ముడి చమురు ధరల పతనం, ధరల నియంత్రణను ఎప్పటికప్పడు కనిపెట్టి చూస్తుండడంతో పాటు పెట్రోల్ ధర తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని ఏసీసీసీ చైర్మన్ రొడ్ సిమ్స్ తెలిపారు. పెట్రోల్ ధర 17 ఏళ్ల కనిష్టస్థాయికి దిగిరావడంతో ఆ మేరకు వాహనదారులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. సిడ్నీలో అతి తక్కువగా లీటర్ పెట్రోల్ ధర రూ. 53గా ఉంది. కాన్ బెర్రా, టస్మానియా రాజధాని హొబర్ట్ లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 59గా ఉంది.