ఏపీ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి.. మధ్యలో స్పీకర్
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభను వైఎస్సార్సీపీ బహిష్కరించినప్పటికీ.. ‘ప్రతిపక్షం లేదే!’ అనే లోటును కూటమి నేతలే భర్తీ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా.. శాసనమండలి వాయిదాతో శనివారం ఐదో రోజు శాసనసభ మాత్రమే నడుస్తోంది. అయితే జీరో అవర్లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన.‘‘ఎమ్మెల్యేలు జీరో అవర్ లో ప్రశ్నలు వేస్తున్నారు. కానీ మంత్రులు ఎవ్వరు లేచి నోట్ చేసుకున్నాం అని చెప్పడం లేదు. మరి ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పి ఏం లాభం?. జీరో అవర్ లో చెప్పిన సమస్య పై వచ్చే సభ లోగా మంత్రులు సభ్యులకు పురోగతి పై స్పష్టత ఇవ్వాలి’’ అని కాస్త ఆవేశపూరితంగానే అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. కూన రవి వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అంటూ గట్టిగానే బదులిచ్చారు. అయితే అచ్చెన్న మాట్లాడుతున్నంత సేపు.. కూన మాత్రం సీరియస్గా ముఖం పెట్టుకుని కనిపించారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైననాటి నుంచే.. సభలో మునుపెన్నడూ చోటు చేసుకోని పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే కూటమి నేతలపై, మంత్రులపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. నిన్నటి బడ్జెట్ చర్చలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కొత్తగా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజుపై అసహనం వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో.. తానేమీ ప్రతిపక్షం కాదని, మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానని, అసెంబ్లీకి రావద్దంటే రానంటూ జ్యోతుల నెహ్రూ ఎమోషనల్ అయ్యారు.ఇదీ చదవండి: ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!ఇదీ చదవండి: బాబుగారి మాటలకు అర్థాలే వేరులే..!