
'మీ భద్రత మాకొద్దు.. మేమే చూసుకుంటాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంటోంది. హైదరాబాద్లో తమ భద్రతను తామే ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పోలీసుల భద్రత తమకు అవసరం లేదని, సొంతంగా ఏపీ పోలీసులతో భధ్రత ఏర్పాటు చేసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేతుల్లో ఉంటే తమకు అక్కర్లేదని చెప్పారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న పదేళ్లకాలంలో శాంతిభద్రతలు గవర్నర్ నరసింహన్ చేతిలో ఉంటే ఫర్వాలేదని అన్నారు. సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద, మంత్రుల నివాసాల వద్ద ఏపీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా శాంతిభద్రతలను తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇరు రాష్ట్రాల మధ్య శాంతి భద్రతల వివాదం ఏర్పడింది.