జన్‌ధన్‌లోకి 58 లక్షల పెన్షనర్ల అకౌంట్లు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై)లోకి 58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు వెళ్లనున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి సబ్సిడీలు, సంక్షేమ పథకాలన్నింటినీ ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) పథకం కిందకు తీసుకు రావాలన్నది కేంద్రం లక్ష్యం. దీనిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెన్షనర్ల ఖాతాలను జన్‌ధన్‌లోకి తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖను కేబినెట్ సెక్రటేరియట్ కోరింది.
ఈ బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకునేలా చేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు వెళ్లాయి. ఆధార్ తో అనుసంధానం చేసిన జన్‌ధన్ అకౌంట్లను ప్రధాన అకౌంట్ (సింగిల్ అకౌంట్)గా ఉపయోగించుకునేలా చూడాలని కేబినెట్ సెక్రటేరియట్ కింద పనిచేసే డీబీటీ మిషన్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్)ను కోరింది. ప్రభుత్వ పరంగా లభించే ప్రయోజనాలన్నింటినీ ఈ అకౌంట్‌కు అందించేందుకు కేబినెట్ సెక్రటేరియట్ ప్రయత్నిస్తోంది.
దీంతోపాటు జన్‌ధన్ యోజన లబ్ధిదారులకు రూ. లక్ష ప్రమాద బీమాగల రూపే డెబిట్ కార్డులను అందిస్తారు. ఈ అకౌంట్ల నుంచే అన్ని ప్రభుత్వ (కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల) ప్రయోజనాలు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద అందించడానికి ఇది దోహదపడుతుంది. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశంలో 22.65 కోట్ల జన్‌ధన్ ఖాతాలున్నాయి. ఇవి రూ. 40,750 కోట్ల నిల్వను కలిగి ఉన్నాయి.