Accounts Section
-
ఇదే చాన్స్
సాక్షి, సిటీబ్యూరో: అక్రమార్కుల చూపు మళ్లీ జీహెచ్ఎంసీ వైపు మళ్లింది. అవకతవకలకు... ఆమ్యామ్యాలకు అలవాటు పడిన వారు జీహెచ్ఎంసీకి క్యూ కడుతున్నారు. గతంలో ఇక్కడ పని చేస్తుండగా వచ్చిన అవినీతి ఆరోపణలు, పనుల్లో నిర్లక్ష్యం వంటి కారణాలతో వెళ్లిపోయిన వారు తిరిగి జీహెచ్ఎంసీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు కోరుకున్న స్థానాల్లో చేరగా... మరికొందరు అతి త్వరలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవలే బదిలీపై వెళ్లిన కమిషనర్ సోమేశ్ కుమార్ హయాంలోనే కాక... అంతకు ముందు కమిషనర్‌గా పని చేసిన కృష్ణబాబు హయాంలో మాతృ సంస్థలకు వెళ్లిన వారు కూడా తిరిగి జీహెచ్ఎంసీలో తిష్ట వేసేందుకు పెద్ద మొత్తాల్లోనే ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జీహెచ్ఎంసీలోనే ఉంటున్నప్పటికీ తాము కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు పావులు కదుపుతున్న వారు గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులే కాక, ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న అటెండర్లు, డ్రైవర్లు వంటి వారు కూడా కోరుకున్న స్థానాల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ఇతర ప్రభుత్వ విభాగాలతో పోలిస్తే జీహెచ్ఎంసీలో పనులు ఎక్కువగా ఉండటం.. బడ్జెట్ కూడా భారీగానే ఉండటం.. డబ్బులు చేతులు మారడం కూడా అదే దామాషాలో ఉండటంతో ఇక్కడ పని చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. ఇటీవల బదిలీ అయిన సోమేశ్‌కుమార్ కచ్చితత్వంతో ఒక దశలో జీహెచ్ఎంసీలో పని చేసేందుకే భయపడిన పరిస్థితి ఏర్పడగా... ఆయన వెళ్లగానే మళ్లీ ఇటువైపు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారు భారీగా పెరుగుతున్నారు. ఇదీ వరుస * గతంలో ఒక ఉన్నతాధికారి ద్వారం వద్ద ఉంటూ.. సందర్శకులను గదిలోకి పంపించే ఓ ఔట్సోర్సింగ్ అటెండర్ పనితీరు అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అక్కడి నుంచి తప్పించారు. సోమేశ్ కుమార్‌కు బదిలీ అయిన మరుసటి రోజే పాత స్థానంలో ఆ అటెండర్ విధులు నిర్వహించడం విస్మయానికి గురి చేసింది. * అకౌంట్స్ విభాగంలో పనిచేసే ఒక అధికారిని దాదాపు మూడేళ్ల క్రితం కృష్ణబాబు కమిషనర్‌గా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలో అవసరం లేదని రిలీవ్ చేశారు. గృహ నిర్మాణ పనులకు సంబంధించి మంజూరు లేకుండానే బిల్లులు పాస్ చేయడం వంటి అంశాలు దృష్టికొచ్చి కృష్ణబాబు ఆయనను జీహెచ్ఎంసీ నుంచి పంపించినట్లు సమాచారం. ఆ అధికారి కొద్దికాలం క్రితం తిరిగి జీహెచ్ఎంసీకి బదిలీ అయినప్పటికీ విధుల్లో చేరలేకపోయారు. సోమేశ్ కుమార్ కమిషనర్‌గా ఉన్నప్పుడు విధుల్లో చేరలేకపోయిన ఆయన గతంలో కంటే పైస్థానంలో నేడో రేపో జీహెచ్ఎంసీలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. * చాలా ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన వారిలో కొందరిని సోమేశ్ కుమార్ హయాంలో ఇతర స్థానాలకు పంపించారు. అలాంటి వారంతా తిరిగి పాత స్థానాల్లోకి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దిశగా ఒకరిద్దరు సఫలీకృతులైనట్లు సమాచారం. * వీరి చర్యలతో గతంలో ఏ కారణం లేకుండా జీహెచ్ఎంసీ నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
లెక్కలేనితనం
టీడీఎస్‌లో గోల్మాల్ తాకీదులిచ్చిన ఆదాయ పన్ను శాఖ ఆందోళనలో కార్పొరేషన్ కార్మికులు కొంపముంచిన అకౌంట్స్ కన్సల్టెంట్ పనితీరు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అకౌంట్స్ విభాగం లెక్కతప్పుతోంది. డ్వాక్వా, సీఎంఈవై గ్రూపు కార్మికుల జీతాలు, కాంట్రాక్టర్ల బిల్లులు నుంచి మినహాయించిన టీడీఎస్ (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) చెల్లింపుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. సెక్షన్ 245 ప్రకారం టీడీఎస్ రికవరీకి ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వయం సహాయక సంఘాలు, కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశారు. సకాలంలో స్పందించకుంటే ఖాతాలు సీజ్ చేస్తామని లెక్కలేనితనంహెచ్చరించారు. దీంతో కార్మికులు లబోదిబోమంటున్నారు. పారిశుద్ధ్య విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో 441 డ్వాక్వా, సీఎంఈవై గ్రూపులకు చెందిన 2984 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వీరికి నెలకు రూ.2.50 కోట్ల మేర జీతాలను చెల్లిస్తున్నారు. ప్రతినెలా వీరి జీతాల నుంచి టీడీఎస్‌ను మినహాయిస్తున్నారు. ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన రిటర్న్స్‌లో భారీ వ్యత్యాసం చోటుచేసుకుంది. శ్రీహరి పొదుపు సంఘం నుంచి రూ.15,230 టీడీఎస్‌గా మినహాయించి రూ. 8,583 చెల్లించారు. పూర్ణ మహిళా గ్రూపు నుంచి రూ. 13,067 మినహాయించి ఒక్క రూపాయి కూడా జమచేయలేదు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. 155 గ్రూపులకు సంబంధించిన ఐటీ రిటర్న్స్‌లో తేడాలున్నట్లు సమాచారం. 28 మంది కాంట్రాక్టర్లకు సంబంధించి టీడీఎస్ రిటర్న్స్‌లో కూడా అవకతవకలు జరిగాయి. అధికార పార్టీ సి‘ఫార్సు’ అకౌంట్స్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిపై ట్యాక్స్ కన్సల్టెంట్‌గా రెండేళ్ల కిందట దేవీమంగను నియమించారు. ఆమె పనితీరు ఏమాత్రం బాగోలేదని అకౌంట్స్ అధికారులే నేరుగా నాటి కమిషనర్ హరికిరణ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పది నెలల జీతాన్ని నిలుపుదల చేశారు. విధుల నుంచి తొలగించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఓ టీడీపీ ఎమ్మెల్సీ సిఫార్సుచేయడంతో ఆమెను యథావిధిగా కొనసాగించమంటూ మేయర్ కోనేరు శ్రీధర్ ఒత్తిడి తేవడంతో హరికిరణ్ బదిలీపై వెళుతూ ఆమె కాంట్రాక్ట్‌ను 2016 వరకు పొడిగిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. అంతా గప్‌చుప్ టీడీఎస్ రిటర్న్స్ ఫైలింగ్ మొత్తం అకౌంట్స్ కన్సల్టెంట్ చేయాల్సి ఉంది. పనిభారం ఎక్కువైందంటూ పంజాబ్‌కు చెందిన ఆడిటింగ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. దీనికోసం రూ.1.50 లక్షలు చెల్లించారు. దీనిపై అకౌంట్స్ ఎగ్జామినర్ తొలుత అభ్యంతరాన్ని లేవనెత్తినప్పటికీ గప్‌చుప్‌గా పంజాబ్ కంపెనీకి బిల్లులు చెల్లించేశారు. ఇంతా చేసి టీడీఎస్ రిటర్న్స్ సక్రమంగా ఫైల్ చేశారా అంటే అదీలేదు. ఆదాయ పన్నుశాఖ నుంచి తాకీదులు రావడంతో ఇప్పుడు భుజాలు తడుముకుంటున్నారు. లోపాలు నిజమే టీడీఎస్ రిటర్న్స్‌లో లోపాలున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని కమిషనర్ జి.వీరపాండియన్ దృష్టికి తీసుకెళ్లా. దీనిపై విచారణ నిర్వహించాల్సిన బాధ్యతను అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) గోపాలకృష్ణారెడ్డికి అప్పగించారు. త్వరలోనే సరిచేస్తాం. -కె. అంబేద్కర్ నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్