టీడీఎస్‌లో గోల్‌మాల్
తాకీదులిచ్చిన ఆదాయ పన్ను శాఖ
ఆందోళనలో కార్పొరేషన్ కార్మికులు
కొంపముంచిన అకౌంట్స్ కన్సల్టెంట్ పనితీరు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అకౌంట్స్ విభాగం లెక్కతప్పుతోంది. డ్వాక్వా, సీఎంఈవై గ్రూపు కార్మికుల జీతాలు, కాంట్రాక్టర్ల బిల్లులు నుంచి మినహాయించిన టీడీఎస్ (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) చెల్లింపుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. సెక్షన్ 245 ప్రకారం టీడీఎస్ రికవరీకి ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వయం సహాయక సంఘాలు, కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశారు. సకాలంలో స్పందించకుంటే ఖాతాలు సీజ్ చేస్తామని లెక్కలేనితనంహెచ్చరించారు. దీంతో కార్మికులు లబోదిబోమంటున్నారు.
పారిశుద్ధ్య విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో 441 డ్వాక్వా, సీఎంఈవై గ్రూపులకు చెందిన 2984 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వీరికి నెలకు రూ.2.50 కోట్ల మేర జీతాలను చెల్లిస్తున్నారు. ప్రతినెలా వీరి జీతాల నుంచి టీడీఎస్‌ను మినహాయిస్తున్నారు. ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన రిటర్న్స్‌లో భారీ వ్యత్యాసం చోటుచేసుకుంది. శ్రీహరి పొదుపు సంఘం నుంచి రూ.15,230 టీడీఎస్‌గా మినహాయించి రూ. 8,583 చెల్లించారు. పూర్ణ మహిళా గ్రూపు నుంచి రూ. 13,067 మినహాయించి ఒక్క రూపాయి కూడా జమచేయలేదు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. 155 గ్రూపులకు సంబంధించిన ఐటీ రిటర్న్స్‌లో తేడాలున్నట్లు సమాచారం. 28 మంది కాంట్రాక్టర్లకు సంబంధించి టీడీఎస్ రిటర్న్స్‌లో కూడా అవకతవకలు జరిగాయి.
అధికార పార్టీ సి‘ఫార్సు’
అకౌంట్స్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిపై ట్యాక్స్ కన్సల్టెంట్‌గా రెండేళ్ల కిందట దేవీమంగను నియమించారు. ఆమె పనితీరు ఏమాత్రం బాగోలేదని అకౌంట్స్ అధికారులే నేరుగా నాటి కమిషనర్ హరికిరణ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పది నెలల జీతాన్ని నిలుపుదల చేశారు. విధుల నుంచి తొలగించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఓ టీడీపీ ఎమ్మెల్సీ సిఫార్సుచేయడంతో ఆమెను యథావిధిగా కొనసాగించమంటూ మేయర్ కోనేరు శ్రీధర్ ఒత్తిడి తేవడంతో హరికిరణ్ బదిలీపై వెళుతూ ఆమె కాంట్రాక్ట్‌ను 2016 వరకు పొడిగిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు.
అంతా గప్‌చుప్
టీడీఎస్ రిటర్న్స్ ఫైలింగ్ మొత్తం అకౌంట్స్ కన్సల్టెంట్ చేయాల్సి ఉంది. పనిభారం ఎక్కువైందంటూ పంజాబ్‌కు చెందిన ఆడిటింగ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. దీనికోసం రూ.1.50 లక్షలు చెల్లించారు. దీనిపై అకౌంట్స్ ఎగ్జామినర్ తొలుత అభ్యంతరాన్ని లేవనెత్తినప్పటికీ గప్‌చుప్‌గా పంజాబ్ కంపెనీకి బిల్లులు చెల్లించేశారు. ఇంతా చేసి టీడీఎస్ రిటర్న్స్ సక్రమంగా ఫైల్ చేశారా అంటే అదీలేదు. ఆదాయ పన్నుశాఖ నుంచి తాకీదులు రావడంతో ఇప్పుడు భుజాలు తడుముకుంటున్నారు.
లోపాలు నిజమే
టీడీఎస్ రిటర్న్స్‌లో లోపాలున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని కమిషనర్ జి.వీరపాండియన్ దృష్టికి తీసుకెళ్లా. దీనిపై విచారణ నిర్వహించాల్సిన బాధ్యతను అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) గోపాలకృష్ణారెడ్డికి అప్పగించారు. త్వరలోనే సరిచేస్తాం.
-కె. అంబేద్కర్ నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్
లెక్కలేనితనం
Published Thu, Oct 29 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM
Advertisement