ఇళ్లు కూల్చేస్తాం..!
మారణాయుధాలతో తిరుగుతున్న రౌడీలు
ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న ఆచారమ్మ కొట్టాల వాసులు
వైఎస్సార్సీపీ సమన్వయకర్త వెంకటరామిరెడ్డి ఎదుట ఆవేదన
ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటామని సమన్వయకర్త భరోసా
గుంతకల్లు టౌన్ : గుంతకల్లు పట్టణంలోని ఆచారమ్మ కొట్టాలలో నివాసముంటున్న పేదలను ఇళ్లు ఖాళీ చేయాలని, తమవద్దకు వచ్చి సెటిల్మెంట్ చేసుకోకుంటే ఇళ్లు కూల్చేస్తామంటూ కొందరు రౌడీలు బెదిరిస్తున్నారు. మారణాయుధాలు చేత పట్టుకుని తిరుగుతుండటంతో కాలనీవాసులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తమను మీరే కాపాడాలయ్యా అంటూ కాలనీవాసులు బుధవారం వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి వద్ద కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి సమన్వయకర్త ఆచారమ్మ కొట్టాలలో పర్యటించారు. పలువురు మహిళలు మాట్లాడుతూ ఓ వ్యక్తి 4.42 ఎకరాల స్థలం తమకు వారసత్వంగా దక్కిందని, తాను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నానని తమను భయపెడుతున్నారన్నారు.
ఈ విషయమై ఎమ్మెల్యే, పోలీసు అధికారుల వద్దకు వెళ్లినా వారు న్యాయం చేయలేదని చెప్పారు. ఖాళీగా ఉన్న స్థలాలన్నింటికీ కొందరు గూండాలు పచ్చరంగులు వేసిపోయారని వాపోయారు. ఈ స్థలమంతా తమకు చెందిన వ్యక్తిదని, మీరందరూ వచ్చి ఎంతోకొంత చెల్లించి సెటిల్మెంట్ చేసుకోకపోతే బుల్డోజర్లు తెచ్చి మీ ఇళ్లన్నీ పడగొడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖాలకు మాస్క్‌లు ధరించి..మారణాయుధాలతో తిరుగుతూ భయభ్రాంతులకి గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తాము నాలుగైదు రోజులుగా దిగులుతో తిండీ తిప్పలు మానేశామని, ఎలాగైనా తమ ఇళ్లను తమకు దక్కేలా చూడాలని వైవీఆర్‌ను వేడుకున్నారు.
ఎవరికీ భయపడవద్దు
ఈ స్థలాలన్నీ ఫలానా వ్యక్తికి చెందినవని కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నట్లయితే కోర్టు ఉత్తర్వులను గౌరవిద్దామని, ఉత్తర్వులను పరిశీలించిన తరువాత న్యాయపోరాటం చేద్దామని వై.వెంకటరామిరెడ్డి కాలనీవాసులకు సూచించారు. అప్పటివరకు ఏ వ్యక్తికీ చిల్లీగవ్వ ఇవ్వనక్కర్లేదన్నారు. ఎవరైనా రౌడీలు మిమ్మల్ని బెదిరిస్తే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎవరికీ భయపడవద్దని, పంచాయితీలకు పిలిచినా వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీఎస్పీ సి.హెచ్.రవికుమార్‌ను వెంకటరామిరెడ్డి కలిసి ఆచారమ్మకొట్టాలలో నివాసముంటున్న 700 కుటుంబాల వారికి రౌడీల నుంచి ప్రాణరక్షణ కల్పించాలని కోరారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాము చర్యలు చేపడతామని డీఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలింగప్ప, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజనేయులు, కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ ఫ్లయింగ్ మాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకప్ప, కౌన్సిలర్ రంగన్న, గోపి, అహ్మద్‌బాషా, ఆ వార్డు ఇన్చార్జ్ చాముండేశ్వరి, అధికార ప్రతినిధి దశరథరెడ్డి, మాజీ టౌన్ కన్వీనర్ ఎద్దుల శంకర్, వార్డు ఇన్‌చార్జ్‌లు వెంకటేష్, రవి, సుమో బాషా తదితరులు పాల్గొన్నారు.