Achyuta Samanta
-
కేబీసీ కరమ్‌వీర్‌లో అచ్యుత సామంత
సాక్షి, న్యూఢిల్లీ : సోని టెలివిజన్ ఛానెల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు ‘కరమ్‌వీర్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఇందులో వివిధ రంగాల్లో దిగువ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రముఖలను పరిచయం చేస్తారు. ఈసారి అతిథిగా కలింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్), కలింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటి) పేరిట సంస్థలను ఏర్పాటు చేసి అత్యున్నత విద్యా ప్రమాణాలను అందిస్తూ ఆదర్శంగా నిలవడంతోపాటు, ఒడిశాలోని కందమహల్ నుంచి బీజేడీ ఎంపీగా విజయం సాధించి ప్రజల ప్రశంసలు అందుకుంటున్న అచ్యుత సామంత్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనకు ప్రముఖ సినీ నటి తాప్సీ పన్ను సహకరిస్తున్నారు. యథావిధిగా ఈ కార్యక్రమాన్ని అతిథేయిగా అమితాబ్ బచ్చన్ నిర్వహించారు. బాల్యం నుంచి తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఉన్నత విద్యా సంస్థలు స్థాపించే వరకు తాను ఎదిగిన తీరు, దాతృత్వం, దయాగుణం తనకు అబ్బిన విధంతోపాటు ఇప్పుడు పాలనాదక్షుడిగా ఎదిగిన తీరును అచ్యుత సామంత ఇందులో వివరిస్తారు. చిన్నప్పటి నుంచి ఆయన ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసిన ఆయన సోదరి ఇతి రాజ సామంత కూడా కార్యక్రమానికి వస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కోసం అచ్యుత సామంత, ఒడిశాలో ప్రసిద్ధి చెందిన ‘చెన్న పొడ’ తిను పదార్థాన్ని, తన కిస్ సంస్థ విద్యార్థులు వేసిన పెయింటింగ్‌ను బహమతిగా తీసుకెళ్తున్నారు. ఆయన ఇంతకుముందు ఎన్డీటీవీలో అమితాబ్ నిర్వహించిన ‘బనేగా స్వచ్ఛ్ ఇండియా’ కార్యక్రమంలోనూ అతిథిగా పాల్గొన్నారు. -
‘హైట్ గురించి మాట్లాడితే ఇంటికి వెళ్లలేను’
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) రీయాలిటీ షో’కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం 11వ సీజన్ నడుస్తోంది. రియాలిటీ షో బుధవారం 11వ ఎపిసోడ్ జరిగింది. ఇందులో భాగంగా బిగ్ బీ కంటెస్టెంట్ చందన్‌తో మాట్లాడుతూ.. అతడి వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకున్నారు. అతడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న అమితాబ్.. తనకు తగిన వధువు వెదుక్కున్నాడని చెప్పారు. ఈ క్రమంలో తన భార్య జయా బచ్చన్ ఎత్తు గురించి ప్రస్తావించారు. ‘చందన్ తన ఎత్తుకు తగ్గ వధువును ఎంచుకున్నాడు. అయితే ఎత్తు విషయంలో నేను ఎలాంటి సలహా ఇవ్వలేను. అలా చేసి ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేను’ అంటూ తామిద్దరి హైట్లలో ఉన్న వ్యత్యాసం గురించి చమత్కరించారు. దీంతో బిగ్ బీ మాటలకు అక్కడి వారంత తెగ నవ్వుకున్నారు. కాగా నేటి(గురువారం) ‘కర్మవీర్ స్పేషల్’ ఎపిసోడ్ సందర్భంగా కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (కీస్) ప్రొఫెసర్, ఒడిశా ఎంపీ అయిన అచ్యుత సమంతా బిగ్ బీ తో కలిసి హాట్ సీట్‌ను పంచుకోనున్నారు. అలాగే ఆయనతో పాటు స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను కూడా పాల్గొననున్నారు. కాగా ఈ ఎపిసోడ్ నవంబర్ 15వ తేదీ(శుక్రవారం) ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఎంపీ సమంతా ఫిలాసఫర్‌గా ఉన్న ప్రారంభంలో తను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో, విద్యావేత్తగా ఎలా ఎదిగారో ఈ ఎపిసోడ్లో చూడవచ్చు. అలాగే కీస్ విద్యార్థులు అమితాబ్ కోసం ప్రత్యేకంగా వేయించిన ప్రముఖ ఒడిశా డీజర్ట్ ‘చెన్నా పొడా’ పేయింటింగ్ అమితాబ్‌కు బహుకరిస్తారు. కాగా సమంతా ఒడిశా కందమహాల్ నుంచి బీజేపీ తరపున లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. -
లోక్‌సభ బరిలోకి విద్యావేత్త సామంత
సాక్షి, భువనేశ్వర్ : సమాజంలో వెనకబడిన బడుగు వర్గాల విద్యావృద్ధిని కాంక్షించి ‘కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ), కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోసల్ సైన్సెస్ (కేఐఎస్ఎస్)’ ఉన్నత విద్యా సంస్థల స్థాపన ద్వారా విద్యారంగంలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆధునిక విద్యావేత్త డాక్టర్ అచ్యుత సామంతకు తగిన గుర్తింపు లభించింది. స్నేహశీలిగా, మృదుభాషిగా, ఎస్సీ, ఎస్టీల విధాతగా ప్రశంసలు అందుకుంటున్న అచ్యుత సామంత సామాజిక సేవలకు గుర్తింపుగా ఆయనకు పార్టీ తరఫున కంధమాల్ లోక్‌సభ సీటును బీజూ జనతా దళ్ (బీజేడీ), ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేటాయించారు. ఇంతకుముందు ఆయన బీజేడీ తరఫునే రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. గతంలో సామాజిక రంగానికే పరిమితమై ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేసిన సామంత మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. దళితులు ఎక్కువగా ఉన్న కంధమాల్ లోక్‌సభ సీటును తనకు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానీయకుండా దళితులు, క్రైస్తవుల సామాజికాభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఆయన ఆరు నెలల క్రితం క్రిస్టియన్ బాల బాలికల కోసం ‘కిస్’ బ్రాంచ్‌ను ఈ నియోజక వర్గంలో ప్రారంభించారు. కంధమాల్‌లో దళితులు ఎక్కువగా ఉన్నప్పటికీ రిజర్వ్డ్ సీటుకాదు. దళితులు, క్రైస్తవులకు పెన్నిదిగా, హిందువులకు స్నేహశీలిగా అన్నివర్గాల ప్రజలను ఆకర్షిస్తున్న అచ్యుత సామంతే అన్ని విధాల పోటీకి అర్హుడని భావించి ఆయన్ని లోక్‌సభ బరిలోకి పట్నాయక్ దించారు. విద్యావేత్తగా, సామాజిక విశిష్ట సేవకుడిగా సామంతకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. -
రాజ్యసభకు ‘కళింగ’ సామంత
భువనేశ్వర్: విద్యాసంస్థలు స్థాపించి వేలాది మందికి ఉచితంగా విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్న ఒడిశాకు చెందిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త అచ్యుత సామంత ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులందరిలోకి పేద ఎంపీగా నిలిచారు. గురువారం బీజేడీ తరఫున ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. సామంత సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన పేరు మీద సొంత ఆస్తిపాస్తులు లేవు. బ్యాంకు ఖాతాలోరూ. 3.6 లక్షల నగదు, ఊరిలో 84 వేల విలువైన వారసత్వ ఆస్తే ఉంది. ఒడిశాలో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ), కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(కేఐఎస్ఎస్) విద్యాసంస్థల ద్వారా ఒకటో తరగతి నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తున్నారు. ఉచిత వసతి, భోజనం, వైద్యసేవలందిస్తున్నారు. -
ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న అచ్యుత సామంత
-
విజయం: గెలవడమూ, గెలిపించడమూ తెలుసు!
ప్రకాష్ చంద్ర ముర్ము.. ఈ కుర్రాడికి స్కూలుకెళ్లి చదువుకోవడమే ఓ కల. అలాంటిది అతనికి చదువుతో పాటు.. లండన్‌కు వెళ్లి రగ్బీ ఆడే అవకాశం కూడా దక్కింది. స్కూలు చదువైనా పూర్తి చేస్తానా అని అనుమానమున్న సీమా హన్స్డా ఎంబీబీఎస్ చదువుతోంది. సౌదాగర్ హన్స్డా లా చేస్తున్నాడు. సంజుక్త రాణి హెంబ్రమ్ ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేయబోతోంది. వీళ్ల పేర్లు గమనిస్తే.. అందరూ గిరిజనులే అని అర్థమైపోతోంది. వీళ్లందరికీ సుదూర స్వప్నంలా కనిపించిన ‘ఉన్నత చదువు’ను చేరువ చేసిన ఉన్నతుడు డాక్టర్ అచ్యుత సమంత. పేద కుటుంబంలో పుట్టి, చదువుకోవడానికి అష్టకష్టాలు పడిన ఈ సామాన్యుడు.. దేశంలోనే ఒకానొక డీమ్డ్ యూనివర్శిటీకి అధిపతి అయ్యే స్థితికి చేరిన వైనం స్ఫూర్తిదాయకం! ఒడిషాలో ‘కిస్’ అంటే తెలియని వారుండరు. ఇందులో దురర్థమేమీ లేదు. కిస్ అనేది గిరిజనుల కోసం వెలసిన యూనివర్శిటీ. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌కు సంక్షిప్త రూపమే కిస్. ఒక సక్సెస్ నుంచి మరెన్నో సక్సెస్‌లకు వేదికైన గొప్ప విద్యాలయం ఇది. దేశంలో అతి పెద్ద డీమ్డ్ యూనివర్శిటీల్లో ఇదొకటి. 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ యూనివర్శిటీ ఇప్పటిదాకా 20 వేల మందికి పైగా గిరిజన విద్యార్థులకు గూడునిచ్చి, కడుపు నింపి, విద్యాబుద్ధులు చెప్పి వారికి జీవితాన్నిచ్చింది. దీని వ్యవస్థాపకుడు అచ్యుత సమంత. గిరిజనుల కోసం ఇంత చేస్తున్నాడు కాబట్టి.. సమంత కూడా గిరిజనుడే అనుకుంటే పొరబాటే. ఆయన కులం, మతం గురించి ప్రస్తావన అనవసరం. కానీ ఆయన గిరిజనుడు మాత్రం కాదు. కానీ పేదరికం గురించి మాత్రం బాగా తెలిసిన, అనుభవించిన వ్యక్తి. చిన్నప్పుడే తండ్రి చనిపోతే.. తల్లి చిన్నచిన్న పనులు చేసి అచ్యుతను చదివించింది. అతను కూడా చదువుకుంటూనే రకరకాల పనులు చేశాడు. కానీ ఏనాడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. పట్టుదలతో చదివి రసాయన శాస్త్రంలో పీజీ చేశాడు. అనంతరం పదేళ్ల పాటు వివిధ కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఐతే జీవితంలో స్థిరపడినా సమంత మనసు మాత్రం స్థిమితంగా లేదు. ఇంకా ఏదో సాధించాలని 1992లో తన దగ్గరున్న రూ.5 వేల పెట్టుబడితో రెండు గదులు అద్దెకు తీసుకుని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ మొదలు పెట్టాడు. గిరిజన పిల్లల్ని అందులో చేర్చుకుని వారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అదే తర్వాత కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ (కేఐఐటీ)గా మారింది. తర్వాత ‘కిస్’ కూడా శ్రీకారం చుట్టుకుంది. ఐతే ఈ క్రమంలో సమంత పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తన విద్యా సంస్థల్ని తీర్చిదిద్దే క్రమంలో ఆయన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. మొదట్లోనే ఆయన వడ్డీ వ్యాపారులకు రూ.15 లక్షలు బాకీ పడ్డారు. ఐతే ఓ జాతీయ బ్యాంకు ఆయనకు లోన్ ఇచ్చి ఆదుకుంది. ఈ డబ్బులతో తన విద్యా సంస్థను అభివృద్ధి చేసి తన కష్టాలన్నింటికీ చెక్ పెట్టేశారు సమంత. ప్రస్తుతం ‘కిస్’లో లేని కోర్సంటూ లేదు. కేజీ నుంచి పీజీ వరకు ఏ చదువైనా దొరుకుతుందిక్కడ. ఐతే ప్రవేశం గిరిజనులకు మాత్రమే. యూనివర్శిటీకి వెళ్లో.. లేక ఆన్లైన్లోనే అప్లికేషన్ సమర్పిస్తే చాలు.. వారి పరిస్థితిని బట్టి ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజులతో భోజనం, వసతి కల్పించి చదువు చెప్పిస్తారు. గత పదేళ్లుగా ‘కిస్’లో డ్రాపౌట్ ఒక్కరూ లేరు. వంద శాతం ఫలితాలతో దూసుకెళ్తోంది కిస్. ఈ యూనివర్శిటీ కోసం సమంత చేసిన త్యాగాలు అసామాన్యమైనవి. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ‘కిస్’కు స్వయంగా విచ్చేసి సమంతను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు జవహర్లాల్ నెహ్రూ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆయన నిస్వార్థ కృషికి జాతీయంగా, అంతర్జాతీయంగా మరెన్నో అవార్డులు దక్కాయి. - ప్రకాష్ చిమ్మల