విజేతలైతేనే మీవాళ్లా?!
సందర్భం
దివంగత నేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూళ్లను నెలకొల్పి వందలాదిమంది క్రీడాకారులకు సదుపాయాలు కల్పించారు. ఇప్పుడలాంటి శ్రద్ధ తీసుకునేవారేరీ?
సింధూ ఒలింపిక్స్‌లో రజతం గెలిచింది. యావత్ భారతదేశం పరువు నిలిపిన ఆ ఆణిముత్యాన్ని ఘనంగా సన్మానించుకున్నాం. ఈ ఘనతని తమదిగా చెప్పుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలు పోటీపడ్డారు. ఆ క్రీడాకారిణిని తన ప్రభుత్వంలో ఉద్యో గిగా మారుద్దామనుకున్నారు. చిత్రంగా ఒలింపిక్స్ క్రీడలు ఎలా జరుగుతాయి, తరువాతి ఒలింపిక్స్‌కు ఎంతకాలం ముందు వేదికను నిర్ణయిస్తారో అవగాహన లేకుండా అమరావతిలో త్వరలో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్నారు ఒక నేత. ఇదీ, ఏలికలకు క్రీడలపై ఉన్న అవగాహన!
మన క్రీడారంగం ఒక్క పతకంతోనో, ఒక్క పరుగుతోనో చంకలు గుద్దుకోవడం రేపటి క్రీడాకారుల పట్ల చేస్తున్న నేరం. నేదురమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్పోర్ట్స్ స్కూల్‌ని హకీంపేట్‌లో నిర్మిస్తే, వైఎస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక జిల్లాకి ఒక స్పోర్ట్స్ స్కూల్ విధానంతో తొలుత వైజాగ్, కడప, కరీంనగర్, మెదక్, విజయవాడలలో స్పోర్ట్స్ స్కూళ్లను నెలకొల్పి ఒక్కొక్కటీ 400 నుండి 450 మంది క్రీడాకారులకు వసతి, సౌకర్యాలు, కోచ్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కానీ, వైఎస్ ఆకస్మిక మరణంతో ఆ స్కూళ్లు నామమాత్రంగా మిగిలాయి. అవినీతి కూపాలుగా మారిపోయాయి.
కొన్ని నిధులు పెంచినా, క్రీడాకా రుల భోజనానికి మాత్రం పదేళ్ల క్రితం నిర్ణయించిన భత్యం రూ. 100–150 ఇస్తున్నారు. దీనితో వాళ్లు పౌష్టికాహారానికి దూరమైనారు. నాలుగోlతరగతి మొదలు ఇంటర్ చదివే వారిని స్పోర్ట్స్ స్కూళ్లలో చేర్చుకునే అవకాశం ఉన్నా, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సిఫార్సు మేరకు ప్రవేశాలు పొందాలనే నిబంధన ఉండటంతో దొడ్డిదారి ప్రవేశాలు పెరిగి, నిజమైన క్రీడాకారులు బయటే ఉండిపోతున్నారు.
దివంగత రాజశేఖర రెడ్డిగారి హయాంలో కరణం మల్లీశ్వరి, మెదక్ జిల్లాకు చెందిన గీతా, శంకర్లు అత్యంత ప్రతిభ చూపారు. ఈ తారలు అధికారుల అవినీతి వ్యవహార శైలితో ఇప్పుడు కనుమరుగైపోయారు. మనకు కేవలం ఒక్కరో, ఇద్దరో స్పోర్ట్స్ తారలు దొరికినా, ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నుంచి కనబడుతున్నారు. ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్స్ నుంచి అలాంటి తారలు రాకపోవడానికి కారణం ప్రైవేట్ స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్లకు స్థలాలు, తాయిలాలు ఇస్తున్న ప్రభుత్వాలు తాము నడిపే స్పోర్ట్స్ స్కూల్స్ కోచ్‌లకు కేవలం 20 నుండి 25 వేల రూపాయలు వేతనం ఇస్తూ వారిని నిరుత్సాహపరుస్తున్నాయి. అలాంటి ప్రభుత్వాలు ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎలా తయారుచేస్తాయి?
ఈ స్పోర్ట్స్ స్కూళ్లకి కొత్త నియామకాలు ఏవీ చేపట్టకుండా రిటైర్ అయిన వారినే కొన సాగిస్తూ మేమూ స్పోర్ట్స్ స్కూల్స్ నడిపిస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి తప్ప, అందులో నిజాయితీ లేదు. పాఠశాలల్లో స్పోర్ట్స్ గురించి పాఠ్యాంశాలుగానీ, క్రీడా మైదానం గానీ, శిక్షితులైన పీఈటీలు కానీ లేరు. ప్రైవేట్ పాఠశాలలైతే ఎంత ఉత్సాహం ఉన్న విద్యార్థినైనా ఆటలు, కళలవైపు వెళ్లనీయకుండా మార్కులూ, ర్యాంకుల బందిఖానాలకు పరిమితం చేస్తుంటే విద్యాశాఖ అడిగిన పాపాన పోలేదు.
పాఠశాలల్లో ఎక్కడా ఆటస్థలం కనిపించక పోయినా అధికారులకు కాసులు కన్పిస్తే చాలు ప్రైవేటు పాఠశాలలు నడుపుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇలా ఆటలను నిర్వీర్య పరుస్తున్న విద్యా వ్యవస్థ కలిగి ఉన్న ప్రభుత్వాలు స్వంతంగా కృషి చేసి పతకాలను దక్కిం చుకున్న వారికి నజరానాలు గుప్పించి వారిని తామే తయారు చేశా మన్నట్లు పోజులివ్వడం ఎంతవరకు సబబు?
ఈ అధినేతలు నిజంగా క్రీడాకారులను ప్రోత్సహించాలనుకుంటే ఒలింపిక్స్ నిర్వహిం చడం కాదు, కనీసం ఒలింపిక్స్ దాకా వెళ్లే స్థాయిలోనైనా క్రీడాకారులని తయారుచేసుకోవాలి. కానీ, నేలవిడచి సాము చేస్తామంటే చరిత్రహీనులౌతారు. వచ్చేసారి జపాన్ ఒలింపిక్స్‌కైనా పదిమంది క్రీడాకారులను పంపే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు కృషిచేయాలి. అంతేగానీ గెలిచినవారు మావారంటే మావారని గొప్పలు చెప్పుకోవడం మానాలి.
అచ్యుతరావు
వ్యాసకర్త రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు-93910 24242