Act of God
-
టైర్ పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..
ముంబై: కారు టైర్ పేలిపోయి ఒక వ్యక్తి మరణానికి దారితీసిన ఘటనలో ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం ఎగ్గొట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టైర్ పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ తప్ప, డ్రైవర్ నిర్లక్ష్యం కాదంటూ చేసిన వాదనని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కారు ప్రమాదంలో మరణించిన మకరంద్ పట్వర్థన్ కుటుంబానికి రూ.1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2010 అక్టోబర్ 25న పట్వర్ధన్ (38) తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి కారులో పుణె నుంచి ముంబై వెళుతున్నారు. వారిలో కారుని తెచ్చిన ఒక కొలీగ్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేయడంతో కారు ముందు టైర్ పేలిపోయి పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పట్వర్థన్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ఆయన ఒక్కరే సంపాదనపరుడు కావడంతో ట్రబ్యునల్ అతని కుటుంబానికి న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ 1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కారు పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఎగ్గొట్టడానికి ప్రయత్నించింది. బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిని విచారించిన కోర్టు టైర్ పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని, ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. -
'యాక్ట్ ఆఫ్ గాడ్ వల్లే ఫ్లై ఓవర్ కూలింది..'
కోల్కతా: కోల్కతాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను చేస్తున్న ఐవీఆర్సీఎల్ కంపెనీ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. హిందీలోని 'ఓ మై గాడ్', తెలుగులో వచ్చిన 'గోపాల గోపాల' చిత్రంలో ఉపయోగించిన 'యాక్ట్ ఆఫ్ గాడ్' పదాన్ని ఐవీఆర్సీఎల్ యాజమాన్యం కూడా ఉపయోగించుకుంది. ప్రమాదానికి తమ తప్పేంలేదని... దానికి కారణం 'యాక్ట్ ఆఫ్ గాడ్' అంటూ కొత్త భాష్యం చెప్పింది. హైదరాబాద్ కు చెందిన ఐవీఆర్సీఎల్ సంస్థ పై మూడు, మరో నలుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం 2010లోనే పూర్తి కావాల్సి ఉండగా, ఆ సంస్థ గడువును పొడిగిస్తూ వచ్చింది. అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావటంతో.. ఐవీఆర్సీఎల్ సంస్థ హడావుడిగా ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేసేందుకు సన్నద్ధమైందని విమర్శలు వెల్లువెత్తాయి. కాగా కోల్కతాలో నిత్యం రద్దీగా ఉండే వివేకానంద రోడ్డులో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ అకస్మాత్తుగా కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 21 మంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
'అదంతా దేవుడి లీల'
మక్కా: సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో జరిగిన ప్రమాదం 'దేవుడి లీల' అని నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ ఒకరు వ్యాఖ్యానించారు. సాంకేతిక లోపంతో ఈ దుర్ఘటన జరగలేదని పేర్కొన్నారు. 'తామే అత్యంత శక్తివంతుమని మనుషులు అతిగా ఊహించుకోవడం వల్లే ప్రమాదం జరిగింది. ఇదంతా దేవుడి లీల. నాకు తెలిసినంతవరకు మానవ తప్పిందం వల్ల ఈ దుర్ఘటన జరగలేద' ని సౌదీ బిన్ లాడెన్ నిర్మాణ సంస్థకు చెందిన ఇంజనీర్ వ్యాఖ్యానించారు. అయితే అతడి పేరు వెల్లడించలేదు. ప్రమాదానికి కారణమైన భారీ క్రేన్ ను నాలుగేళ్లుగా ఇతర ప్రాజెక్టుల్లో వినియోగించినా ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలి 107 మంది మృతి చెందగా, 238 మంది గాయపడ్డారు.