'యాక్ట్ ఆఫ్ గాడ్ వల్లే ఫ్లై ఓవర్ కూలింది..'
కోల్కతా: కోల్‌కతాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను చేస్తున్న ఐవీఆర్‌సీఎల్ కంపెనీ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. హిందీలోని 'ఓ మై గాడ్', తెలుగులో వచ్చిన 'గోపాల గోపాల' చిత్రంలో ఉపయోగించిన 'యాక్ట్ ఆఫ్ గాడ్' పదాన్ని ఐవీఆర్‌సీఎల్ యాజమాన్యం కూడా ఉపయోగించుకుంది. ప్రమాదానికి తమ తప్పేంలేదని... దానికి కారణం 'యాక్ట్ ఆఫ్ గాడ్' అంటూ కొత్త భాష్యం చెప్పింది.
హైదరాబాద్ కు చెందిన ఐవీఆర్‌సీఎల్ సంస్థ పై మూడు, మరో నలుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం 2010లోనే పూర్తి కావాల్సి ఉండగా, ఆ సంస్థ గడువును పొడిగిస్తూ వచ్చింది. అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావటంతో.. ఐవీఆర్‌సీఎల్ సంస్థ హడావుడిగా ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేసేందుకు సన్నద్ధమైందని విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా కోల్కతాలో నిత్యం రద్దీగా ఉండే వివేకానంద రోడ్డులో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ అకస్మాత్తుగా కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 21 మంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.