డిజైన్, నాణ్యతలో లోపం లేదు: ఐవీఆర్‌సీఎల్
తమ డిజైనులో గానీ, నాణ్యత ప్రమాణాలలో గానీ ఎలాంటి లోపం లేదని ఐవీఆర్‌సీఎల్ వర్గాలు తెలిపాయి. కోల్‌కతాలో గురువారం కుప్పకూలిన ఫ్లైఓవర్ నిర్మాణసంస్థ హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్‌సీఎల్ అన్న విషయం తెలిసిందే. దీని గురించి ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఫ్లై ఓవర్ కూలిన విషయం తెలిసి తమకే షాకింగ్‌గా ఉందని, ఇప్పటికే తమ సాంకేతిక నిపుణులు, న్యాయ ప్రతినిధులను కోల్‌కతా పంపామని చెప్పారు. వాళ్లు ఈరోజు పొద్దున్నే విమానంలో వెళ్లారని, అక్కడి ప్రభుత్వంతో పాటు పోలీసులు, అధికారులకు కూడా సహకరించాలని చెప్పామని అన్నారు. ఇక్కడ ఏమీ జరగలేదని, అంతా ఇక్కడే ఉన్నామని తెలిపారు. అవసరమైన వాళ్లను మాత్రం అక్కడకు పంపి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పామన్నారు. ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన 59 పిల్లర్లు, శ్లాబులకు ఎలాంటి సామగ్రి వాడామో దీనికి కూడా అదే వాడామని, కానీ ఇది ఎందుకు కూలిందో అర్థం కావట్లేదని చెప్పారు. దురదృష్టవశాత్తు అది పడిపోయిందని అన్నారు. ఇందులో నాణ్యత లోపం ఏమాత్రం లేదని, ఎందుకు కూలిందన్న విషయాన్ని దర్యాప్తు పూర్తిచేసేవరకు ఎవరూ చెప్పలేమని అన్నారు. తమవైపునుంచి ఎలాంటి లోపం లేదని, ఇప్పటికే 70-80 శాతం పని పూర్తయిందని, మిగిలినది చాలా కొంచెం మాత్రమేనని వివరించారు.
కాగా, ఫ్లైఓవర్ కూలిన దుర్ఘటనపై విచారించేందుకు కోల్‌కతా నుంచి విచారణ బృందాలు గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నాయి. వారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులను దర్యాప్తులో సాయం చేయాలని కోరారు. దీంతో వారికి రెండు సీసీఎల్ బృందాలను అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఐవీఆర్సీఎల్ కోల్‌కతా ఫ్లైఓవర్ ప్రాజెక్టు నిర్మాణ టెండర్‌ను 2009లో దక్కించుకుంది. పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఘటనా స్థలంలో శుక్రవారం కూడా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.