Kolkata flyover
-
ఐవీఆర్సీఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ భట్టాచార్జినీ కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలో గురువారం కుప్పకూలిన ఫ్లైఓవర్ నిర్మాణసంస్థ హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్సీఎల్ అన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 27మంది మృతి చెందగా, గాయపడ్డ అనేకమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఎనిమిదిమంది ఐవీఆర్సీఎల్ అధికారులను అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నారు. కాగా ఐవీఆర్సీఎల్ కోల్‌కతా ఫ్లైఓవర్ ప్రాజెక్టు నిర్మాణ టెండర్‌ను 2009లో దక్కించుకుంది. అయితే గడువు పూర్తయినా ఫ్లైఓవర్ పనులు మాత్రం పూర్తి కాలేదు. అయితే ఫ్లైఓవర్ పనుల విషయంలో ఎలాంటి లోపం లేదని ఆ సంస్థ చెబుతోంది. -
ఫ్లైఓవర్ కూలిన ఘటనలో 26 కి పెరిగిన మృతులు
కోల్‌కతా: కోల్‌కతా మహానగరంలో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య శనివారం 26కు చేరింది. మూడో రోజు సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు 300 మంది సైన్యంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. వెంటనే సహాయచర్యలు ప్రారంభించారు. అయితే సదరు ఫ్లైఓవర్ నిర్మిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్సీఎల్ కంపెనీ కార్యాలయాన్ని కోల్‌కతాలో ఉన్నతాధికారులు సీజ్ చేశారు. అలాగే హైదరాబాద్‌లోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయానికి కోల్‌కతా పోలీసులు బృందాలు చేరుకుని విచారణ చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫ్లైఓవర్ కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే బాధిత కుటుంబాలను పరామర్శించారు. నగరంలోని ఠాగూర్ కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ గురువారం కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా... 88 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి... చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురు శుక్రవారం మరణించగా... మరో ఇద్దరు శనివారం కన్నుమూశారు. ఈ ఘటనలో గాయపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు వెల్లడించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన వారికి, గాయపడిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
డిజైన్, నాణ్యతలో లోపం లేదు: ఐవీఆర్సీఎల్
తమ డిజైనులో గానీ, నాణ్యత ప్రమాణాలలో గానీ ఎలాంటి లోపం లేదని ఐవీఆర్సీఎల్ వర్గాలు తెలిపాయి. కోల్‌కతాలో గురువారం కుప్పకూలిన ఫ్లైఓవర్ నిర్మాణసంస్థ హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్సీఎల్ అన్న విషయం తెలిసిందే. దీని గురించి ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఫ్లై ఓవర్ కూలిన విషయం తెలిసి తమకే షాకింగ్‌గా ఉందని, ఇప్పటికే తమ సాంకేతిక నిపుణులు, న్యాయ ప్రతినిధులను కోల్‌కతా పంపామని చెప్పారు. వాళ్లు ఈరోజు పొద్దున్నే విమానంలో వెళ్లారని, అక్కడి ప్రభుత్వంతో పాటు పోలీసులు, అధికారులకు కూడా సహకరించాలని చెప్పామని అన్నారు. ఇక్కడ ఏమీ జరగలేదని, అంతా ఇక్కడే ఉన్నామని తెలిపారు. అవసరమైన వాళ్లను మాత్రం అక్కడకు పంపి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పామన్నారు. ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన 59 పిల్లర్లు, శ్లాబులకు ఎలాంటి సామగ్రి వాడామో దీనికి కూడా అదే వాడామని, కానీ ఇది ఎందుకు కూలిందో అర్థం కావట్లేదని చెప్పారు. దురదృష్టవశాత్తు అది పడిపోయిందని అన్నారు. ఇందులో నాణ్యత లోపం ఏమాత్రం లేదని, ఎందుకు కూలిందన్న విషయాన్ని దర్యాప్తు పూర్తిచేసేవరకు ఎవరూ చెప్పలేమని అన్నారు. తమవైపునుంచి ఎలాంటి లోపం లేదని, ఇప్పటికే 70-80 శాతం పని పూర్తయిందని, మిగిలినది చాలా కొంచెం మాత్రమేనని వివరించారు. కాగా, ఫ్లైఓవర్ కూలిన దుర్ఘటనపై విచారించేందుకు కోల్‌కతా నుంచి విచారణ బృందాలు గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నాయి. వారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులను దర్యాప్తులో సాయం చేయాలని కోరారు. దీంతో వారికి రెండు సీసీఎల్ బృందాలను అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఐవీఆర్సీఎల్ కోల్‌కతా ఫ్లైఓవర్ ప్రాజెక్టు నిర్మాణ టెండర్‌ను 2009లో దక్కించుకుంది. పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఘటనా స్థలంలో శుక్రవారం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. -
ఫ్లైఓవర్ కూలిన ఘటనలో 24 కి పెరిగిన మృతులు
కోల్‌కతా: కోల్‌కతా మహానగరంలో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం 24కు చేరింది. రెండో రోజు కూడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు 300 మంది సైన్యంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. వెంటనే సహాయచర్యలు ప్రారంభించారు. అయితే సదరు ఫ్లైఓవర్ నిర్మిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్సీఎల్ కంపెనీ కార్యాలయాన్ని కోల్‌కతాలో ఉన్నతాధికారులు సీజ్ చేశారు. నగరంలోని ఠాగూర్ కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ గురువారం కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా... 88 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి... చికిత్స అందిస్తున్నారు. వారిలో మరో ముగ్గురు శుక్రవారం మరణించారు. ఈ ఘటనలో గాయపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు వెల్లడించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన వారికి, గాయపడిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మమతపై హత్య కేసు నమోదు చేయాలి
కోలకతా: కోలకతా లో ఫ్లై ఓవర్ కూలిన ఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ తన దాడిని ఎక్కుపెట్టింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలనకు ఈ ఘటనే తార్కాణమని బీజేపీ మండిపడింది పశ్చిమ బెంగాల్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కైలాష్ విజయ వార్గీయ ఫ్లై ఓవర్ కూలిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మమత ప్రభుత్వం అవినీతి పాలనకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన ట్విట్ చేశారు. కైలాష్ విజయ వార్గీయ.. తన వరుస ట్విట్లలో మమత పై విరుచుకుపడ్డారు. ఈ సంఘటనపై మమతపై హత్యకేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె అవినీతి వల్ల అమాయక ప్రజలను బలి తీసుకుందన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. మృతులకు సంతాపం తెలిపిన కైలాష్ విజయ వార్గీయ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోవడం బాధ గలిగించిందని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్విట్ చేశారు. సహాయక చర్యల్లో సహకరించాల్సిందిగా పార్టీ రాష్ట శాఖ పార్టీకి ఆదేశాలు జారీచేసినట్టు ఆయన తెలిపారు.కాగా ఉత్తర కోల్‌కతాలోని గణేశ్ థియేటర్ గిరీశ్ పార్క్ ఏరియా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా, మరో 100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.