చైనా మాంజా తయారీ నిషేధం
అమ్మినా,కొన్నా శిక్షార్హులు: అడిషనల్ పీసీసీఎఫ్ భాంజా
సాక్షి, హైదరాబాద్: పతంగులను ఎగురవేసేందుకు ఉపయోగించే చైనా మాంజా (నైలాన్ దారం, గాజుముక్కల పొడితో తయారు చేసిన దారం)ను నిషేధించినందున, దీనిని తయారు చేసినా, విక్రయించినా, కొనుక్కున్నా కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు అటవీ ముఖ్య సంరక్షణాధికారి (అడిషనల్ పీసీసీఎఫ్) మనోరంజన్ భాంజా హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 ప్రకారం చైనా మాంజాను ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా నిషేధించినట్లు చెప్పారు దీనిలో భాగంగా ఈ మాంజా తయారీ, విక్రయం, కొనుగోలు చేసేవారికి అయిదేళ్ల జైలుశిక్ష లేదా రూ.లక్ష జరిమానాతో పాటు ఈ రెండింటినీ విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బుధవారంఅరణ్యభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చైనా మాంజా వల్ల పశు పక్ష్యాదులు, మనుషులకే కాక పర్యావరణానికి కూడా హాని కలుగుతున్నందున దీనిని ఉపయోగించకుండా అటవీ శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. నిషేధాన్ని ఈ సంక్రాంతి పండగ సందర్భంగా 2017లో దీనిని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. ప్రజలు ఎక్కడైనా చైనా మాంజా ఉపయోగాన్ని గమనిస్తే టోల్‌ఫ్రీ నెంబర్ 1800–4255364కు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు.