డీపీవో కార్యాలయంలో ప్రమోషన్ల సందడి
- 80 మంది పంచాయతీ కార్యదర్శులకు అడ్హాక్ ప్రమోషన్లు
- 4వ గ్రేడ్ నుంచి 3వ గ్రేడ్‌కు పెంపు
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : జిల్లా పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శుల ప్రమోషన్ల సందడి నెలకొంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రకాశం భవనంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో హడావిడి నెలకొంది. జిల్లాలోని 80 మంది పంచాయతీ కార్యదర్శులకు అడ్హాక్ ప్రమోషన్లు ఇచ్చారు. నాల్గో గ్రేడ్ నుంచి మూడో గ్రేడ్‌కు మార్చారు.
జిల్లాలోని 56 మండలాల్లో 1,028 పంచాయతీలున్నాయి. 398 మంది కార్యదర్శులు ఉన్నారు. రెండు, మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. సుమారుగా 530కి పైగా క్లస్టర్లు ఉన్నాయి. కార్యదర్శుల కొరతను తీర్చేందుకు ఒక్కొక్క క్లస్టర్ ఒక్కొక్క కార్యదర్శిని నియమించి నెట్టుకొస్తున్నారు. వచ్చే నిధులను బట్టి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించారు. వీటిలో పనిచేస్తున్న కార్యదర్శులను 80 మందిని గుర్తించి అడ్హాక్ ప్రమోషన్లు కల్పించారు.
ప్రమోషన్లు ఇచ్చినా వీరంతా ప్రస్తుతం పనిచేస్తున్న చోటే పనిచేస్తారు తప్పితే.. బదిలీలు జరగవు. ఇదే విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారిణి కె. శ్రీదేవి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ ప్రమోషన్ల వ్యవహారం గతంలోనే జరిగిందన్నారు. అయితే మధ్యలో ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుమతితోనే అడ్హాక్ ఇచ్చామన్నారు.