adikesavulu Naidu
-
టీడీపీ నేత ఇంట్లో చోరీ.. ఘరానా దొంగలు అరెస్టు
చిత్తూరు అర్బన్: చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు తమ్ముడు బద్రినారాయణ ఇంట్లో పది రోజుల క్రితం జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీకి పాల్పడ్డ విశాఖకు చెందిన కర్రి సతీష్‌రెడ్డి(37), తెలంగాణ దేవరకొండకు చెందిన ఎన్.నరేంద్రనాయక్(26)తో పాటు వైఎస్సార్ కడపకు చెందిన కుదువ వ్యాపారి అనిమల కుమార్ ఆచారి (45)ను అరెస్టు చేశారు. చిత్తూరు నగరంలోని పోలీసు అతిథిగృహంలో వివరాలను ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్, డీఎస్పీ ఎన్.సుధాకర్‌రెడ్డి శుక్రవారం మీడియాకు వివరించారు. గతనెల 28వ తేదీ తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మీనగర్ కాలనీలోని బద్రినారాయణ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కేసును ఛేదించడానికి డీఎస్పీ సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో క్రైమ్ సీఐ రమేష్, టూటౌన్ సీఐ యుగంధర్‌ను ఎస్పీ రంగంలోకి దింపారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లెలో రెండేళ్లుగా నివాసం ఉంటున్న విశాఖజిల్లా కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్‌రెడ్డిని, ఇతనితో పాటు చోరీలో పాల్గొన్న తెలంగాణ నల్గొండకు చెందిన ఎన్.నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ విచారించిన పోలీసులు రూ.3.04 కోట్ల విలువచేసే 2.03 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు పొదిగిన గాజులు, బ్రాస్లెట్లు, వాచీలు, చెవికమ్మలు, హారాలు, నక్లెస్‌లు, బంగారు మొలతాడు, డాలర్లతో పాటు రూ.10 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, ఓ బుల్లెట్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు గతేడాది ఆగస్టులో చిత్తూరులో జరిగిన మరోచోరీ కేసులో కూడా సతీష్‌రెడ్డి, నరేంద్ర పాల్గొన్నట్లు గుర్తించి అక్కడ చోరీకి గురైన 80 గ్రాముల బంగారు వడ్డాణం సీజ్ చేశారు. చోరీ సొత్తు అని తెలిసినప్పటికీ బంగారు చైను కుదువపెట్టుకున్న నేరానికి కుమార్ ఆచారిని అరెస్టు చేశారు. కాగా, చోరీ జరిగినపుడు టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదులో రూ.2.57 కోట్ల విలువచేసే వస్తువులు మాత్రమే పోయినట్లు పేర్కొన్నాడు. కానీ పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నపుడు కేజీకి పైగా బరువున్న బంగారు, వజ్రాభరణాలు బద్రి ఇంట్లో చోరీ చేసినట్లు చెప్పడంతో వాటిని కూడా రికవరీలో చూపించారు. దీంతో వారికి ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. -
సీఎం జగన్‌ను కలిసిన శ్రీనివాస్
-
సీఎం జగన్‌ను కలిసిన శ్రీనివాస్
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్ కలిశారు. గురువారం ఉదయం శ్రీ పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన తండ్రి హయాంలో ప్రారంభించిన ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మధ్యలో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. నాన్నగారు టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రారంభించారు. అయితే కోర్టు కారణాలు, రాజకీయాల వల్ల ఆగిపోయింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్‌కు వివిధ ప్రాంతాల నుంచి దాతలు 150 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నాన్నగారి చివరి కోరికను నెరవేర్చాలని ముఖ్యమంత్రిని కోరారు’ అని తెలిపారు. (సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు) కాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు ఆనంద నిలయం అనంత స్వర్ణ మయం ప్రాజెక్టును ప్రారంభించారు. శ్రీవారి ఆలయం మొత్తం పూర్తిగా బంగారు రేకులతో తాపడం చేయించాలని ఆదికేశవులు నాయుడు నిర్ణయించిన విషయం విదితమే. -
మాజీ ఎంపీ మనవడు విష్ణు కోసం ముమ్మర గాలింపు
సాక్షి, జయనగర: పోలీసుల కళ్లుగప్పి పరారైన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడి మనవడు విష్ణు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విష్ణు తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని ఆచూకీ కోసం మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్నారు. అక్క చేతన, గన్‌మెన్‌తో కలిసి విష్ణు కారులో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాళహస్తికి చెందిన విష్ణు బావ రాజేశ్‌నాయుడు కూడా వాహనంలో ఉన్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా కనిపెట్టారు. దీంతో రాజేష్‌నాయుడును అరెస్ట్‌చేసి విష్ణు ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మితిమీరిన వేగంతో కారును నడుపుతూ.. మరో కారును ఢీకొని ముగ్గురు వ్యక్తులు గాయపడేందుకు విష్ణు కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో గాయపడిన విష్ణు బెంగళూరులోని మాల్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ కేసులో మాల్యా ఆస్పత్రి వ్యవస్థాపక డైరెక్టర్ అయిన విష్ణు తల్లి డాక్టర్ తేజశ్వరి, తండ్రి శ్రీనివాసమూర్తిని పోలీసులు విచారించారు. విష్ణు తన అక్క చేతనతో కలిసి శనివారం హైదరాబాద్‌లో ఉన్నట్లు పక్కాసమాచారం అందిందని, అక్కడికి పోలీసులు వెళ్లేలోపు ఇద్దరూ పారిపోయారని, సాధ్యమైనంత త్వరగా విష్ణును అరెస్ట్ చేస్తామని దక్షిణ వలయ డీసీపీ శరణప్ప తెలిపారు. విష్ణు కుటుంబసభ్యులు, అతని స్నేహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో గాలింపు చేపట్టినట్లు ఆయన తెలిపారు. విష్ణు కారులో గంజాయి లభించిన నేపథ్యంలో ఎన్డీపీఎస్ కేసుతోపాటు పోలీసుల అదుపులోనుంచి తప్పించుకున్న ఘటనకు సంబంధించి ఐపీఎస్ సెక్షన్ 224, 225 కింద కేసు నమోదుచే శామని శరణప్ప తెలిపారు. విష్ణు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందిందని, రేపటిలోగా విష్ణు జాడను కనిపెట్టి అరెస్ట్ చేస్తామన్నారు. పథకం ప్రకారమే పరారీ విష్ణు పథకం ప్రకార పరారీ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. విష్ణు కారులో లభించిన గంజాయి విషయంపై విచారణ చేపట్టేందుకు పోలీసులు గత నెల 28న మధ్యాహ్నం మాల్యా ఆస్పత్రికి వెళ్లారు. అయితే విష్ణుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చామని, పది గంటల విశ్రాంతి అవసరమని విష్ణు తల్లి తేజేశ్వరి, ఇతర వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అదే రోజు అర్ధరాత్రి 12.30గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లగా విష్ణుకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో ఒక హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను బందోబస్తుగా ఉంచారు. అయితే 29వ తేదీ ఉదయం 6.15గంటల సమయంలో విష్ణు అత్యవసర ద్వారం నుంచి ఉడాయించాడు. -
వీధినపడ్డ కేబీడీ షుగర్స్ కార్మికులు
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా పట్టించుకోని వైనం ఆందోళనలో రైతాంగం ఇరవై రెండు సంవత్సరాలుగా నడుస్తున్న కేబీడీ చక్కెరఫ్యాక్టరీ ఒక్కసారిగా లేఆఫ్ ప్రకటించడంతో ఇటు కార్మికులు, అటు రైతులు అయోమయంలో పడ్డారు. చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్‌గా ఉన్న దివంగత డీకే.ఆదికేశవులునాయుడు సతీమణి డీకే.సత్యప్రభ ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యేగా అధికార టీడీపీ తరపున గెలుపొందారు. అధికార పార్టీలో ఉండి కూడా కార్మికులు, రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పుంగనూరు: పుంగనూరు మండలం ముడిబాపనపల్లె వద్ద ఉన్న కేబీడీ చక్కెర ఫ్యాక్టరీని 1992లో మాజీ ప్రధాని పివి.నరసింహారావు కుటుంబీకులు శ్రీవాణి షుగర్స్ పేరుతో నిర్మించారు. రెండేళ్ల పాటు ఫ్యాక్టరీని నడిపారు. నష్టాలు రావడంతో 1994లో ప్రముఖ పారి శ్రామికవేత్త, దివంగత ఆదికేశవులునాయుడుకు విక్రయించారు. జిల్లాతో పాటు పుంగనూరు ప్రజలతో ఉన్న సంబంధాలతో ఆదికేశవుల నాయుడు ఫ్యాక్టరీలో నష్టాలు వచ్చినా కార్మికులు, రైతుల కోసం నడుపుతూ వచ్చారు. గత సంవత్సరం ఆయన మృతి చెందడంతో ఫ్యాక్టరీ నిర్వహణ కష్టతరంగా మారింది. నష్టాలను భరించలేని స్థితిలో ఫ్యాక్టరీని మూసివేసి, లేఆఫ్ ప్రకటించేందుకు డికె కుటుంబం సిద్ధమైంది. ఈ మేరకు చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్ డిఏ.శ్రీనివాస్ 468 మంది కార్మికులకు మార్చి 22న లేఆఫ్ నోటీసులను జారీ చేసి, పనుల్లో నిలిపివేశారు. కార్మికులు వీధినపడ్డారు. ఆందోళనలకు దిగారు. కాని ఫలితం లేకపోయింది. ఐదు నెలలుగా కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. ఫలితం లేకపోగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో.. పుంగనూరు కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలోకి ఆరు నియోజకవర్గాల రైతులను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో పీలేరు, తంబళప ల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చెందిన 36 మండలాల రైతులు ప్రతిఏటా చక్కెర ఫ్యాక్టరీకి సుమారు లక్ష టన్నుల చెరకును సరఫరా చేసేవారు. ఫ్యాక్టరీ వారు సుమారు 50 వేల టన్నుల చెరుకును తమిళనాడు నుంచి కొనుగో లు చేసేవారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు లేని సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేవారు. ఫ్యాక్టరీ మూసివేయడం తో 438 మంది కార్మికులు, 36 మండలాల రైతులు వీధినపడ్డారు. లేఆఫ్ నిబంధనలకు తిలోదకాలు ఫ్యాక్టరీని మూసివేసే సమయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు కార్మికులందరికీ వ్యక్తిగత నోటీసులు జారీ చేయాలి. లేఆఫ్‌ను 45 రోజులు మాత్రమే కొనసాగించాలి. లేఆఫ్ ప్రకటించిన వెంటనే కార్మికశాఖ దీనిని ధృవపరుస్తూ, కార్మికులకు నోటీసులు జారీచేసి, 50 శాతం బేసిక్ జీతం ఇవ్వాలి. కాని యాజమాన్యం 40 శాతం మాత్రం జీతాలు పంపిణీ చేస్తోంది. యాజమాన్యం మార్చి 27, మే 1, జూలై 16న మూడు నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులను నిబంధనల మేరకు జారీ చేయలేదు. అలాగే జూలై 16న జారీ చేసిన నోటీసులో కార్మికులందరూ ప్రతి రోజు 10 గంటలకు ఫ్యాక్టరీలో హాజరై, సంతకాలు చేయాలని పేర్కొంది. అలా చేస్తే 40 శాతం జీతం చెల్లిస్తామని మెలిక పెట్టింది. ఫ్యాక్టరీ నిబంధనల మేరకు లేఆఫ్ ప్రకటించిన తరువాత కార్మికులు ఎక్కడ విధుల్లో ఉన్నా వారికి 50 శాతం జీతం చెల్లించాలి. కేబీడీ షుగర్స్ యాజమాన్యం మాత్రం తమకున్న అధికార బలంతో కార్మికుల కడుపుకొడుతూ 40 శాతం జీతం ఇవ్వడం, ప్రతి రోజు కార్మికులను ఇతర పనులకు వెళ్లనివ్వకుండా సంతకాలు చేసేందుకు ఫ్యాక్టరీకి రావాలని నిబంధనలు పెట్టడంతో కార్మికులు మండి పడుతున్నారు. ఈ విషయాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ మూసివేసి సుమారు ఐదు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆరోపణలకు దారి తీస్తోంది. జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ వెం టనే చర్యలు తీసుకుని ఫ్యాక్టరీని తెరి పించాలని ఇటు కార్మికులు, అటు రైతు లు కోరుతున్నారు. మూడునెలల్లోపు సమస్య పరిష్కారం కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ లేఆఫ్‌ను చట్ట ప్రకారం ప్రకటించాం. కార్మికుల డిమాండ్ మేరకు చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడం కష్టతరం. చెరకు పంట పండించలేని స్థితిలో రైతులు అవస్థలు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఫ్యాక్టరీని నడపాలంటే వీలుకాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు యాజమాన్యం మూడు నెలల్లోపు స్పష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోను కార్మికులను నష్టపరిచేది లేదు. యాజమాన్యం అన్ని రకాలుగా ఆలోచించి సముచితమైన ప్రకటన వెలువరిస్తుంది. - డీజే ఇంద్రప్రకాష్, ఉపాధ్యక్షుడు, కేబీడీ షుగర్స్, పుంగనూరు. -
బోస్ ఆశలపై నీళ్లు
పలమనేరు అభ్యర్థిత్వంపై టీడీపీలో మారుతున్న సమీకరణలు తాజాగా తెరపైకి డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్ పేరు పరిశీలనలో మాజీ మంత్రి అరుణ కుమారి పేరు సాక్షి, తిరుపతి : పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో కొత్త సమీకరణలు చోటుచేసుకుంటున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన సుభాష్‌చంద్రబోస్ పేరు దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో తాజాగా కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రధానంగా చిత్తూరు మాజీ ఎంపీ డీకే.ఆదికేశవులునాయుడు కుమారుడు డీఏ.శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన మాజీ మంత్రి టీజీ.వెంకటేష్‌కు కర్నూలు అసెంబ్లీ టికెట్టు ఖరారైంది. ఈయన కూడా వైశ్య సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో రాయలసీమలోనే వైశ్య సామాజికవర్గం నుంచి ఇద్దరికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేనందున పలమనేరు నుంచి వేరే సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇం దులో భాగంగా సుభాష్‌చంద్రబోస్ అభ్యర్థిత్వంపై నీలి నీడలు కమ్ముకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా అధిష్టానం నుంచి బోస్‌కు కచ్చితమైన హామీ రావడంతో ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు రావడంతో బోస్ కుటుంబానికి పలమనేరు మున్సిపల్ చైర్మన్ పదవిని ఇస్తామని జిల్లా ముఖ్యనేతల నుంచి సంకేతాలు పంపా రు. బోస్ మాత్రం ఆసక్తి చూపలేదు. మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ దాఖలుకు శుక్రవారంతో గడువు ముగిసింది. అయితే ఆయన కుటుంబం నుంచి మహిళలు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో జిల్లా పార్టీ చేసిన సూచనల పట్ల బోస్ సుముఖంగా లేరనేది స్పష్టమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే అసెంబ్లీ టికెట్టు డుమ్మా కొడతారనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. పలమనేరు నుంచి డీఏ.శ్రీనివాస్‌ను బరిలోకి తెచ్చేందుకు కూడా ముమ్మరంగా రాయబారాలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గానికి సంబంధించి సుమారు 25 వేల ఓట్లు ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో ఆ సామాజికవర్గానికి టికెట్టు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. చంద్రగిరి నుంచి ఆమెకు టికెట్టు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏ కారణం చేతనైనా ఆమెను అక్కడి నుంచి పోటీ చేయించలేని పరిస్థితి వస్తే పలమనేరు ఖాయంగా చెబుతున్నారు. మొత్తానికి తాజాగా జరుగుతున్న పరిణామాలు బోస్ ఆశలపై నీళ్లు చల్లేవిగా ఉన్నాయి. కుల సమీకరణ ల్లో చివరి నిమిషం వరకు పలమనేరు టీడీపీ టికెట్టుపై ఉత్కంఠ కొనసాగేలా ఉంది.