- అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా
- పట్టించుకోని వైనం ఆందోళనలో రైతాంగం
ఇరవై రెండు సంవత్సరాలుగా నడుస్తున్న కేబీడీ చక్కెరఫ్యాక్టరీ ఒక్కసారిగా లేఆఫ్ ప్రకటించడంతో ఇటు కార్మికులు, అటు రైతులు అయోమయంలో పడ్డారు. చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్‌గా ఉన్న దివంగత డీకే.ఆదికేశవులునాయుడు సతీమణి డీకే.సత్యప్రభ ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యేగా అధికార టీడీపీ తరపున గెలుపొందారు. అధికార పార్టీలో ఉండి కూడా కార్మికులు, రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
పుంగనూరు: పుంగనూరు మండలం ముడిబాపనపల్లె వద్ద ఉన్న కేబీడీ చక్కెర ఫ్యాక్టరీని 1992లో మాజీ ప్రధాని పివి.నరసింహారావు కుటుంబీకులు శ్రీవాణి షుగర్స్ పేరుతో నిర్మించారు. రెండేళ్ల పాటు ఫ్యాక్టరీని నడిపారు. నష్టాలు రావడంతో 1994లో ప్రముఖ పారి శ్రామికవేత్త, దివంగత ఆదికేశవులునాయుడుకు విక్రయించారు. జిల్లాతో పాటు పుంగనూరు ప్రజలతో ఉన్న సంబంధాలతో ఆదికేశవుల నాయుడు ఫ్యాక్టరీలో నష్టాలు వచ్చినా కార్మికులు, రైతుల కోసం నడుపుతూ వచ్చారు.
గత సంవత్సరం ఆయన మృతి చెందడంతో ఫ్యాక్టరీ నిర్వహణ కష్టతరంగా మారింది. నష్టాలను భరించలేని స్థితిలో ఫ్యాక్టరీని మూసివేసి, లేఆఫ్ ప్రకటించేందుకు డికె కుటుంబం సిద్ధమైంది. ఈ మేరకు చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్ డిఏ.శ్రీనివాస్ 468 మంది కార్మికులకు మార్చి 22న లేఆఫ్ నోటీసులను జారీ చేసి, పనుల్లో నిలిపివేశారు. కార్మికులు వీధినపడ్డారు. ఆందోళనలకు దిగారు. కాని ఫలితం లేకపోయింది. ఐదు నెలలుగా కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. ఫలితం లేకపోగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు.
కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో..
పుంగనూరు కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలోకి ఆరు నియోజకవర్గాల రైతులను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో పీలేరు, తంబళప ల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చెందిన 36 మండలాల రైతులు ప్రతిఏటా చక్కెర ఫ్యాక్టరీకి సుమారు లక్ష టన్నుల చెరకును సరఫరా చేసేవారు. ఫ్యాక్టరీ వారు సుమారు 50 వేల టన్నుల చెరుకును తమిళనాడు నుంచి కొనుగో లు చేసేవారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు లేని సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేవారు. ఫ్యాక్టరీ మూసివేయడం తో 438 మంది కార్మికులు, 36 మండలాల రైతులు వీధినపడ్డారు.
లేఆఫ్ నిబంధనలకు తిలోదకాలు
ఫ్యాక్టరీని మూసివేసే సమయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు కార్మికులందరికీ వ్యక్తిగత నోటీసులు జారీ చేయాలి. లేఆఫ్‌ను 45 రోజులు మాత్రమే కొనసాగించాలి. లేఆఫ్ ప్రకటించిన వెంటనే కార్మికశాఖ దీనిని ధృవపరుస్తూ, కార్మికులకు నోటీసులు జారీచేసి, 50 శాతం బేసిక్ జీతం ఇవ్వాలి. కాని యాజమాన్యం 40 శాతం మాత్రం జీతాలు పంపిణీ చేస్తోంది. యాజమాన్యం మార్చి 27, మే 1, జూలై 16న మూడు నోటీసులు జారీ చేసింది.
అయితే నోటీసులను నిబంధనల మేరకు జారీ చేయలేదు. అలాగే జూలై 16న జారీ చేసిన నోటీసులో కార్మికులందరూ ప్రతి రోజు 10 గంటలకు ఫ్యాక్టరీలో హాజరై, సంతకాలు చేయాలని పేర్కొంది. అలా చేస్తే 40 శాతం జీతం చెల్లిస్తామని మెలిక పెట్టింది. ఫ్యాక్టరీ నిబంధనల మేరకు లేఆఫ్ ప్రకటించిన తరువాత కార్మికులు ఎక్కడ విధుల్లో ఉన్నా వారికి 50 శాతం జీతం చెల్లించాలి. కేబీడీ షుగర్స్ యాజమాన్యం మాత్రం తమకున్న అధికార బలంతో కార్మికుల కడుపుకొడుతూ 40 శాతం జీతం ఇవ్వడం, ప్రతి రోజు కార్మికులను ఇతర పనులకు వెళ్లనివ్వకుండా సంతకాలు చేసేందుకు ఫ్యాక్టరీకి రావాలని నిబంధనలు పెట్టడంతో కార్మికులు మండి పడుతున్నారు.
ఈ విషయాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ మూసివేసి సుమారు ఐదు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆరోపణలకు దారి తీస్తోంది. జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ వెం టనే చర్యలు తీసుకుని ఫ్యాక్టరీని తెరి పించాలని ఇటు కార్మికులు, అటు రైతు లు కోరుతున్నారు.
మూడునెలల్లోపు సమస్య పరిష్కారం
కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ లేఆఫ్‌ను చట్ట ప్రకారం ప్రకటించాం. కార్మికుల డిమాండ్ మేరకు చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడం కష్టతరం. చెరకు పంట పండించలేని స్థితిలో రైతులు అవస్థలు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఫ్యాక్టరీని నడపాలంటే వీలుకాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు యాజమాన్యం మూడు నెలల్లోపు స్పష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోను కార్మికులను నష్టపరిచేది లేదు. యాజమాన్యం అన్ని రకాలుగా ఆలోచించి సముచితమైన ప్రకటన వెలువరిస్తుంది.
- డీజే ఇంద్రప్రకాష్, ఉపాధ్యక్షుడు, కేబీడీ షుగర్స్, పుంగనూరు.