ఉన్న ఊరొదిలి..
పనుల్లేక పల్నాడు నుంచి తరలుతున్న కూలీలు, కార్మికులు
వైకుంఠపురం నుంచి వంద కుటుంబాలు
తీవ్రమవుతున్న కరువు పరిస్థితి
పట్టించుకోని {పభుత్వం
పొలం ఉంది.. కానీ పంటల్లేవు.. చేద్దామన్నా పనుల్లేవు. దీంతో వందలమంది రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు వలసబాట పడుతున్నారు.ఇళ్లకు తాళాలు వేసి గ్రామం విడిచి పొట్టచేత పట్టుకుని మరోఊరికి తరలుతున్నారు. అక్కడ ఏదో ఒక పని దొరక్క పోతుందా అని ఆశతో వయోవృద్ధులనుఊర్లోనే వదిలి పనులకోసం వెళుతున్నారు. పల్నాడు ప్రాంతంలో ఈ దుస్థితి ప్రస్తుత కరువు పరిస్థితులకు అద్దం పడుతోంది.
కారంపూడి వ ర్షాలు లేవు.. బోర్లలో నీరు రావు.. కరువు విలయతాండవం చేస్తోంది. అరకొరా వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పల్నాడు ప్రాంతంలోని వ్యవసాయ కూలీలు వలస బాట పడుతున్నారు. రైతులు ఆర్థికంగా చితికిపోవడంతో పరోక్షంగా వీరిపై ఆధారపడిని కార్మికులు ఆ బాటలోనే వెళుతున్నారు. వలస వెళుతున్నవారిలో గిరిజన రైతులు కూడా ఉండడం దుర్భర పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇరవై రోజల కిందట కారంపూడి మండలం శివారు వైకుంఠపురం గ్రామం నుంచి వంద కుటుంబాలు వలస వెళ్లాయి. అదేవిధంగా గ్రామంలో పనులు దొరక్క చినగార్లపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ నుంచి 18 కుటుంబాలు వలస వెళ్లాయి. పంటలు లేకపోవడంతో వ్యవసాయ కూలీలకు వారానికోసారి పనులు దొరకడం గగనమైంది. వీరితో పాటు భవన నిర్మాణ, క్వారీ, కంకరరాయి పనులు చేసే కార్మికులు పనుల వెతుకులాటలో వున్నారు. వీరంతా మంగళగిరి దగ్గర కృష్ణాయపాలెం, గుంటూరు దగ్గర నల్లపాడు, అచ్చెంపేట, అమరావతి, కృష్ణా జిల్లా చందర్లపాడు, తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రభుత్వం గ్రామాల్లో పనులు కల్పించకపోవడంతో వలస వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది.
అప్పులు తీర్చాలని..
వైకుంఠపురం నుంచి వలస వెళ్లిన వంద కుటుంబాల్లో ఎక్కువశాతం ఎకరం రెండెకరాలు భూమి వున్న వారే. వీరంతా భూములకు పాసుపుస్తకాలు లేక, బ్యాంకుల ద్వారా అప్పుల పొందలేక, విధి లేక మైక్రో ఫైనాన్సియర్ల వద్ద, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశారు. పొలం సాగు చేసుకుంటూనే, కూలి పనులు చేసి వారి అప్పులు తీర్చాలని యత్నించారు. కాని పనులు దొరకలేదు. వేసిన పంటలు కూడా ఎండిపోవడంతో చేసిన అప్పులు తీర్చ లేక వలస వెళ్లారు. చినగార్లపాడులో బోర్ల క్రింద వేసిన పత్తి, మిర్చి పొలాల్లో కొద్దిగా పనులు దొరుకుతున్నాయి. ఇప్పటికే పత్తిలో పనులు తగ్గిపోయాయి. భవిష్యత్‌లో మరింత గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని అంతా ఆందోళన చెందుతున్నారు.