నిరసనల హోరు
వరుస ధర్నాలతో కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక, పదోన్నతులు కల్పించాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లాజిస్టిక్ హబ్ భూసాగుదార్లు పెద్దఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ఇంకా అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ, ఈశ్వరపార్వతి రజక సంఘం, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు వివిధ సమస్యలపై నిరసన ధ్వనులు వినిపించారు.
- మహారాణిపేట
ఉద్యోగాలు భర్తీ చేయాలి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 42 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వందలాదిమంది విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరి ఉద్యోగాలు భర్తీ చేయాలని కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు లగుడు గోవిందరావు మాట్లాడుతూ 2400 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేస్తామని తరచుగా చెప్పే మంత్రి అయ్యన్నపాత్రుడు తక్షణమే నోటిఫికేషన్ విడుదలయ్యేలా చూడాలని, కాంటాక్ట్ పద్ధతిలో కార్యదర్శులను నియమిస్తామన్న ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకోవాలన్నారు. నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని అమలు చేయాలని, ఏపీపీఎస్సీని పునరుద్ధరించాలని కోరారు. డిమాండ్ల సాధనకు ఈ నెల 30వ తేదీన విజయవాడలో గల సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని గోవింద్ తెలిపారు.
లాజిస్టిక్ హబ్ రైతుల సమస్యలు పరిష్కరించాలి
మునగపాక, అనకాపల్లి, పరవాడ మండలాల్లో నిర్మిస్తున్న లాజిస్టిక్ హబ్ వల్ల ఆ చుట్టుపక్కల 8 గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లాజిస్టిక్ హబ్ భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం కలెకటరేట్ వద్ద ధర్నా చేపట్టింది. బలవంతంగా భూములు సేకరించరాదని, నష్టపరిహారం లెక్కింపులో వివక్ష ఉండరాదని, అనకాపల్లి మండలం సర్వే నెంబర్ 159లో రైతులకిచ్చే నష్టపరిహారం విలువను పెంచాలని డిమాండ్ చేశారు. మునగపాక మండలం సర్వే నెంబర్ 138లో నష్టపరిహారం అందుకునే రైతులు, లబ్ధిదారుల జాబితాను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, లాజిస్టిక్ హబ్ భూనిర్వాసితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్ష్యుడు గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గోవాడ సుగర్స్‌లో అక్రమాలపై కన్నెర్ర
గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని రైతుకూలీ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పంచదార అమ్మకాల కుంభకోణంతోపాటు గతంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు, కార్మికులకు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 350 పర్మినెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి ఝాన్సీ, రాష్ట్ర సహాయక కార్యదర్శి గణేశ్ పండా, జిల్లా అధ్యక్షుడు ఐతిరెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.