మాచర్ల ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
రామకృష్ణారెడ్డి తదితరుల అరెస్ట్‌పై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: సరస్వతి పవర్, ఇండస్ట్రీస్ భూముల వ్యవహారంలో మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సరస్వతి పవర్ డెరైక్టర్ ఆదిరాజు వేణుగోపాలరాజు, మరో ఏడుగురికి హైకోర్టులో ఊరట లభించింది. వీరి అరెస్ట్‌పై హైకోర్టు గురువారం స్టే విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సరస్వతి ఇండస్ట్రీస్ భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన వారిపై కాకుండా వారిని అడ్డుకున్న తమపై మాచవరం పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రామకృష్ణారెడ్డి, వేణుగోపాలరాజు తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, మార్కెట్ ధర కన్నా అధిక మొత్తం చెల్లించి సరస్వతి యాజమాన్యం భూములు కొనుగోలు చేసిందని, ఇప్పుడు ఆ భూములను అధికార పార్టీ నేతల సహకారంతో కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని తెలిపారు. పోలీసులు పిటిషనర్లపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ కక్షసాధింపు తోనేఈ కేసు నమోదు చేశారని ఆయన వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ పిటిషనర్ల అరెస్ట్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.