కెరీర్లో మంచి మలుపు తెచ్చింది
న్యూఢిల్లీ: బాలీవుడ్లోకి అడుగిడిన ఆదిత్యరాయ్ కపూర్ కెరీర్ ‘ఆషికి-2’ సినిమాతో భారీ మలుపు తిరిగింది. తొలినాళ్లలో 28 ఏళ్ల ఆదిత్య ‘లండన్ డ్రీమ్స్’, యాక్షన్ రీ ప్లే’, ‘గుజారిష్’ తదితర సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ‘ఏదో ఒకరోజు కెరీర్లో మంచి మలుపు వ స్తుందనే నమ్మకం నాకు మొదటినుంచీ ఉంది. అయితే ‘యే జవానీ దివానీ’సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. మోహిత్ సూరి నేతృత్వంలో రూపొందించిన ‘ఆషికి-2’సినిమాలో ప్రధాన భూమిక నాదే. సోలో హీరో సినిమా అవకాశాలు రాలేదని నేను ఏనాడూ బాధపడలేదు. ఏ నిర్మాత అయినా వాణిజ్యపరంగా ఇబ్బందులు లేని కథానాయకుడు ఉండాలని కోరుకుంటాడు.
అందువల్ల ఈ విషయంలో నేను ఎవరినీ నిందించదలుచుకోలేదు. అయితే అదృష్టం ‘ఆషికి-2’సినిమా రూపంలో వరించింది. చిన్న చిన్న పాత్రలు చేసే రోజుల్లో ఏనాడూ నిరాశకు గురికాలేదు. ఏదో ఒకరోజు మంచి అవకాశం లభిస్తుంద నే నమ్మకం మాత్రం ఉండేది. 2013లో విడుదలైన సినిమాల్లో ‘ఆషికి-2’ రికార్డు సృష్టించింది’ అని అన్నాడు. ఈ సినిమాలో ఆదిత్య... మద్యానికి అలవాటుపడిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. ‘ఈ సినిమాతో అప్పటిదాకా ప్రేక్షకులకు నాపై అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.
ఈ సినిమాలో అత్యంత విభిన్నంగా కనిపించా. అందులోనూ సోలో హీరోగా నటించా. హీరోగా నన్ను చూడాలనుకునేవారంతా ఈ సినిమాను వీక్షించాలి. ఈ సినిమా తరువాత బాలీవుడ్లో నాకు అవకాశాలు వెల్లువెత్తాయి. నా సత్తా ఏమిటో ఈ సినిమాతో బయటపడింది. తగినంత గుర్తింపు వచ్చింది’అని అన్నాడు. ప్రస్తుతం ఆదిత్య.... ‘దావత్ ఎ ఇష్క్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో పరిణీతిచోప్రా కథానాయిక. ఈ సినిమాలోనూ ఆదిత్య ప్రధాన పాత్రలోనే కనిపించనున్నాడు.