గిన్నిస్‌లో ఆదియోగి విగ్రహం
టీనగర్(చెన్నై): కోయంబత్తూరు, వెల్లియంగిరిలో ఏర్పాటైన 112 అడుగుల ఎల్తైన ఆదియోగి విగ్రహం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఈ మేరకు ఈషా ఫౌండేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. వెల్లియంగిరి కొండ దిగువన 112 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 81 అడుగులు 11.8 అంగుళాల వెడల్పు, 147 అడుగుల 3.7 అంగుళాల పొడవు ఉన్న ఆదియోగి విగ్రహాన్ని తయారు చేసేందుకు రెండున్నర ఏళ్లు, ఏర్పాటుకు ఎనిమిది నెలలు పట్టిందన్నారు.
ఇంత ఎల్తైన బెస్ట్ సైజ్ విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. గిన్నిస్ బుక్‌లో విగ్రహం చోటు సంపాదించుకోవడం తమకు సంతోషాన్ని కలిగించిందన్నారు. విగ్రహాన్ని రోజూ అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వేల సంఖ్యలో వచ్చి సందర్శిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరో మూడు ప్రాంతాల్లో ఇదే విధంగా 112 అడుగుల ఎత్తులో విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆదియోగి విగ్రహాన్ని 24 ఫిబ్రవరి 2017లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం విదితమే.