ఖాళీ చేస్తారా.. చేయించమంటారా..!
⇒ గుడిసె వాసులకు ఏడీఎం హెచ్చరిక
⇒ రెండు రోజుల్లో నోటీసులు జారీ చేస్తాం: జోగిపేట తహశీల్దార్
⇒ సాక్షి కథనంతో కదిలిన అధికారులు
జోగిపేట: మార్కెట్ కార్యాలయ ఆవరణను ఖాళీ చేస్తారా..ఖాళీ చేయించమంటారా.. అంటూ జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీఎం హమీద్ బుధవారం గుడిసె వాసులను హెచ్చరించారు.
ఈనెల 23న ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘మార్కెట్ దుకాణాలకు మోక్షమెప్పుడో’ అన్న శీర్షికన వార్త ప్రచురితం కావడంతో జిల్లా మార్కెటింగ్ అధికారులు బుధవారం జోగిపేటకు పరుగులు తీశారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఉన్న గుడిసె వాసుల వద్దకు అధికారులు వెళ్లి ఇంటి యజమాని పేర్లు రాసుకొని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వారు 40 ఏళ్లకుపైగా తాము ఇక్కడే నివాసముంటున్నామని, ప్రభుత్వం తమకు ఇప్పటి వరకు ఎలాంటి స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా హెచ్చరికలు జారీ చేశారు.
స్థానిక తహశీల్దార్ నాగేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్ ప్రభాకర్, మార్కెట్ కార్యదర్శి నాగేశ్వరరావు, జహీరాబాద్ మార్కెట్ కార్యదర్శి శివరామశాస్త్రితో కలిసి ఏడీఎం సమావేశమయ్యారు. టెండర్లు నిర్వహించిన ఏడాది పూర్తయినా గుడిసెలను తొలగించకపోవడంపై మంత్రి తమను పలుమార్లు ప్రశ్నించారన్నారు. ఈ విషయమై స్పందించిన తహశీల్దార్ నాగేశ్వరరావు తాను గుడిసెల్లో నివాసముంటున్న వారందరికి నోటీసులు జారీ చేస్తానని సూచించారు. సకాలంలో ఖాళీ చేయనట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు.