చెమటలు కక్కిస్తున్నకోతలు
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : మునుపెన్నడూ లేని విధంగా విధిస్తున్న విద్యుత్ కోతలు అన్ని వర్గాల ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. విద్యుత్‌కోతలతో అంద రూ విసిగెత్తిపోతున్నారు. విద్యుత్ శాఖ సిబ్బందిపై గతంలో ఎన్నడూ లేని విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నా కోతలను తగ్గించే దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.
వాస్తవానికి జిల్లాకు 5.326 ఎంయూ (మిలియన్ యూనిట్లు) విద్యుత్ అవసరం కాగా, ప్రస్తుతం 4.901 ఎంయూ మాత్రమే కేటాయిస్తున్నారు. కేటాయింపుల్లో వ్యత్యాసం కారణంగానే కోతలు అమలుచేస్తున్న అధికారులు పేర్కొంటున్నారు.ప్రభుత్వాల అసమర్థ నిర్ణయాల కారణంగా అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తోంది.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. ప్రగతి కుంటుపడుతోంది. ఇప్పటికే వెనుకబడిన జిల్లాగా పేరొందిన విజయనగరం ప్రగతి మరింత దిగజారిపోతోంది.
జిల్లా కేంద్రంలో అధికారికంగా రోజుకు రెండు గంటలు మాత్రమే కోతలు విధిస్తామని ప్రకటించినప్పటికీ అందుకు విరుద్ధంగా కోతలు విధిస్తున్నారు. ఈఎల్ఆర్ పేరుతో ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు మరల సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు మొత్తం ఆరు గంటలకు పైగానే అనధికారికంగా జిల్లా కేంద్రంలో కోతలు విధిస్తున్నారు.
ఇక మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రోజులో ఎనిమిది గంటలకు పైగానే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎ-గ్రూప్ కేటగిరికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, బి-గ్రూప్ కేటగిరికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 8 గంటల పాటు సరఫరా నిలిపివేస్తారు. ఇవి కాకుండా అత్యవసర సమయాల్లో ఈఎల్ఆర్ (ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్) పేరుతో రాత్రి, పగలు తేడా లేకుండా గంటల కొద్దీ కోతలు అమలు చేస్తున్నారు.
గత వారం రోజుల పాటు పరిశీలిస్తే రూరల్ ఫీడర్పై ఉన్న గృహావసర విద్యుత్ కనెక్షన్లకు రాత్రీ, పగలు తేడా లేకుండా కోత విధిస్తున్నారు. రాత్రి వేళల్లో కనీసం 4 నుంచి 6 గంటల పాటు సరఫరా నిలిపివేస్తుండడంతో పల్లె ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక పట్టణాల్లో విధించే కోతలతో చిరువ్యాపారులు తీవ్రంగా నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
వ్యవసాయానికి 7 గంటల సరఫరా ఏదీ...?.
జిల్లాలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రోజుకు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అధికారుల ప్రకటన ప్రకారం ఎ-గ్రూప్ కనె క్షన్లకు రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు మళ్లీ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తారు. అదేవిధంగా బి-గ్రూప్ కనెక్షన్లకు రాత్రి 1 గంట నుంచి వేకువజామున 4 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా చేస్తారు.
అయితే ఈ సరఫరా వేళలు కేవలం అధికారుల కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ ప్రాంతంలోనూ కనీసం 3 నుంచి 4 గంటలైనా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా కావడం లేదని రైతన్నలు వాపోతున్నారు.