క్యాట్‌లో కేంద్రం కేవియట్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన క్యాడర్ కేటాయింపులపై వుుసారుుదా నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లపై తమ వాదన వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీచేయరాదని కోరుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)లో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. క్యాడర్ కేటాయింపులను సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా క్యాడర్ కేటాయింపులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తే పాలనాపరమైన సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
మరోసారి ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది సమావేశం త్వరలోనే ఉంటుందని తెలిసింది. ఢిల్లీలో మంగళవారం ఈ కమిటీ సమావేశం అయినప్పటికీ.. గతనెల 22న జరిగిన సమావేశంలో తాత్కాలిక కేటాయింపు జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవని సమావేశం అనంతరం సమాచారం ఇచ్చారు. అయితే తాజాగా ఈ తాత్కాలిక జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇచ్చిన అధికారులకు సంబంధించి మార్పులు ఉంటాయా.? లేక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు అధికారులు కావాలంటూ పట్టుపడుతున్న నేపథ్యంలో ఆ మార్పులు మాత్రమే ఉంటాయా? అనేదానిపై స్పష్టత లేదు. కాగా, కమిటీ తుది సమావేశం ఈనెల 15 తరువాత జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.