Adulthood
-
రెండు ముళ్ల పెళ్లి
పెళ్లికి మూడు ముళ్లు అవసరం. యవ్వనంలో.. వృద్ధాప్యంలో.. మరోజన్మలో కూడా కలిసి ఉండటానికే ఈ ముడులు. కానీ ఈ చెల్లికి మాత్రం రెండుసార్లూ.. పెళ్లి ముల్లైంది. విధి మొదటి ముల్లు. అందం రెండో ముల్లు. ఈ రెండు ముళ్ల పెళ్లి.. రెండో భర్త రూపంలో ఆమెకు నరకం చూపించింది! ఆమె అంతరంగమిది. నిన్నటి జీవితం నేడు అనుకుని.. నేటి జీవితమే నేను అనుకుని కొత్తగా మొదలుపెడదామంటే నీడను గుచ్చుకున్న ముల్లుకంటే నేటిని గుచ్చుతున్న ముల్లే ఎక్కువగా బాధిస్తోంది! ‘వన్స్ బిటెన్.. ట్వైస్ షై’ అంటారు. ఒకసారి జరిగిన నష్టం రెండోసారి జరక్కుండా చూసుకోవాలని! ఇది ముందే తెలిసుంటే ఎంత బాగుండేది! నాకు పాతికేళ్ల వయసులో పెళై్లంది. ఏడాదికే ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. యుక్త వయసులోనే నా జీవితం రోడ్డు పాలైంది. ఇది చూసి మా అమ్మా నాన్న తట్టుకోలేక మళ్లీ పెళ్లి సంబంధాలు చూశారు. అదే సమయంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఆయన.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం, మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం, నేను నచ్చడం, ఇద్దరికీ పునర్వివాహం.. చకచకా జరిగిపోయాయి. పాత బాధలన్నీ మర్చిపోయి కొత్త జీవితం వైపు అడుగులు వేసేందుకు మెట్టినింట్లో కాలు పెట్టాను. పెళై్లన పది రోజుల వరకూ జీవితం సాఫీగానే సాగింది. ఎప్పుడూ నా వెంటే ఉండే వారు. నేను ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో జాబ్ చేస్తుండటంతో ఆయనే స్వయంగా నన్ను బ్యాంక్‌కు డ్రాప్ చేసే వారు. సాయంత్రం అరగంట ముందుగానే వచ్చి బ్యాంకులో నా ఎదురుగా కూర్చొని.. నన్ను చూస్తూ ఉండేవారు. కొన్నిసార్లు ఆలస్యమైనా కోపగించుకునేవారు కాదు. ఇవన్నీ చూసి నా అంత అదృష్టవంతురాలు లేదని అనుకున్నాను. ఎంతో ప్రేమగా చూసుకునే భర్త దొరికాడని సంబర పడిపోయాను. కానీ.. ఆ ఆనందమంతా కేవలం గాలి బుడగలేనని తెలుసుకోడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకే ఒక్క సంఘటన నా జీవితంలో ఎన్నో మర్చిపోలేని కాళరాత్రుల్ని పరిచయం చేసింది. ఇంతసేపు ఎక్కడికెళ్లావ్?! ఒక రోజు సాయంత్రం బ్యాంకు పని త్వరగా అయిపోయింది. ఆయనకు ఫోన్ చేశాను. లైన్ బిజీ అని రావడంతో నేనే ఆటోలో వెళ్లిపోయాను. దారిలో మార్కెట్‌కి వెళ్లి ఇంటికి కావలసిన సరకులు కొన్ని తీసుకున్నాను. స్వీట్స్ తీసుకున్నాను. ఓ బట్టల షాప్‌లో చీర నచ్చింది. ఆఫర్లో తక్కువ ధరకు వచ్చిందని తీసుకున్నాను. రాత్రి 8 గంటలు గడిచింది. ఇంటికి వెళ్లేసరికి ఆయన సోఫాలో గంభీరంగా కూర్చొని ఉన్నారు. ఎక్కడికి వెళ్లావంటూ గద్దించారు. విషయమంతా చెప్పినా విసుక్కున్నారు. కాల్ చేశానని చెప్పినా కసురుకున్నారు. ‘‘ఇన్ని రోజులూ నీ వెంట వస్తోంది నువ్వంటే ఇష్టమని కాదు. నా మొదటి పెళ్లాంలా వేరే సంబంధం పెట్టుకోవని. కానీ ఇంతలా కాపలా కాస్తున్నా తప్పించుకున్నావ్! చెప్పు.. నీకు చీర ఎవరు కొనిచ్చారు?’’ అంటూ అనుమానపు పిశాచిలా నన్ను ఆ రాత్రంతా చిత్రహింసలకు గురిచేశాడు. ఉదయం లేచేసరికి మామూలుగానే ప్రవర్తించారు! ఆ నవ్వు వెనుక విషం! ‘‘నువ్వు కనిపించలేదనే ఎమోషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడేశాను’’ అంటూ బుజ్జగించారు. నువ్వు చాలా అందంగా ఉంటావ్. అందుకే నిన్ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నానంటూ నవ్వుకుంటూ చెప్పడంతో నేనూ హ్యాపీ ఫీలయ్యాను. కానీ.. ఆ నవ్వుల వెనుక విషం అలాగే ఉందని గమనించలేకపోయాను. పాప పుట్టినా మారలేదు నేను అందంగా ఉన్నానని ఆయన చెప్పడంతో ఆయన కోసం మరింత అందంగా కనిపించాలని భావించేదాన్ని. మొదటి రెండు రోజులు గమనించిన ఆయన మూడో రోజునుంచి టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు. ఎవరి కోసం ఇలా రెడీ అవుతున్నావంటూ అప్పటి నుంచి మనోవేదనకు గురి చేస్తున్నారు. రెండేళ్ల వరకూ రోజూ నరకం చూశాను. గర్భవతిని అయినా విడిచిపెట్టలేదు. ఆడపిల్ల ప్రసవించింది. పోనీ పాప పుట్టిన తర్వాత అయినా మారతారని అనుకున్నాను. కానీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా ఆడపిల్ల పుట్టిందంటూ నానా గొడవా చేశారు. ఆ పిల్లను చంపేస్తానంటూ బెదిరించారు. చిత్రహింసలు ఎక్కువయ్యాయి విషయం తెలిసిన మా అమ్మా నాన్న కేసు పెడదామంటూ నన్ను తీసుకొచ్చారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఆయనలో మార్పు వస్తుందన్నాను. కానీ హింస మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బ్యాంకులో ఉన్న నా సహచరురాలు మహిళా శక్తి గురించి చెప్పింది. ఆ బృందంతో మాట్లాడాను. వారు మా ఆయనను పిలిపించారు. విషయం తెలుసుకున్నారు. ‘‘నా మొదటి భార్య ఇలాగే చేసి నన్ను మోసం చేసింది. ఆమె కంటే ఈమె అందంగా ఉంది. అలాంటప్పుడు ఈమె కూడా ఆమెలాగే తనని మోసం చేయకుండా ఉంటుందా అని అనుమానపడ్డాను’’ అని చెప్పారు. ఆ తర్వాత వాళ్లు మా ఇద్దరికీ వేర్వేరుగానూ, ఇద్దరినీ కలిపి కౌన్సిలింగ్ చేశారు. అయినా.. ఈ మూడేళ్లు పడిన కష్టాలు జీవితంలో మర్చిపోలేను. – కనకదుర్గ (పేరుమార్చాం), గాజువాక ఇంటర్వ్యూ: కరుకోల గోపి కిశోర్ రాజా, విశాఖ సిటీ -
తరగని యౌవనం కోసం
చిలగడదుంపకు ప్రాంతాలను బట్టి గెణుసుగడ్డ, మోరంగడ్డ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో 77 శాతం నీరు, 20.1శాతం కార్బోహైడ్రేట్లు, 1.6 శాతం ప్రొటీన్లు, 3 శాతం పీచుపదార్థాలు ఉంటాయి. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. ∙చిలగడదుంపలో కార్బోహైడ్రేట్ల పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తక్షణ శక్తి వనరుగా ఉపయోగించుకోవచ్చు ∙బీటా–కెరొటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి. చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తికి విటమిన్–సి దోహదపడుతుంది. అందుకే విటమిన్–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుంది. అలాగే విటమిన్–ఏ మేనికి ఒక మెరుపు, నిగారింపు ఇస్తుంది. అందుకే చిలగడదుంపల్ని తినేవారి చర్మం ఏజింగ్ దుష్ప్రభావాలకు అంత తొందరగా గురికాదు. ఈ కారణంగానే దీన్ని తినేవారిలో ఏజింగ్ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడం, తద్వారా దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యపడుతుంది ∙చిలగడదుంపలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. పొటాషియమ్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారు దీన్ని తింటే... బీపీ అదుపులో పాటు గుండె ఆరోగ్యమూ పదిలంగా ఉంటుంది ∙ చిలగడదుంప వల్ల అనేక గుండెజబ్బులు నివారితమవు తాయని పరిశోధనల్లో తేలింది. -
సలహా సంఘాలేవి?
►మూడేళ్లుగా ఆహార సలహా సంఘం కమిటీలు వేయని ప్రభుత్వం ► పెరుగుతున్న కల్తీ మోసాలు ► నష్టపోతున్న వినియోగదారులు జిల్లాలో ఆహార సలహా సంఘం కమిటీలు లేకపోవడంతో కల్తీ మోసాలు ఎక్కువయ్యాయి. వినియోగదారుల్లో చైతన్యంతోపాటు కల్తీలను అరికట్టేందుకు గత ప్రభుత్వం ఆహార సలహా సంఘం కమిటీలను వేసింది. ఇవి మూడు నెలలకోసారి సమావేశమై వినియోగదారుడి రక్షణకు పలు నిర్ణయాలు తీసుకునేవి. కానీ గత మూడేళ్లుగా ఈ కమిటీలు లేకపోవడంతో మోసాలు పెరిగిపోయాయి. కెరమెరి(ఆసిఫాబాద్): వినియోగదారుడు ఏదో విధంగా మోసపోతూనే ఉన్నాడు. కొనే పదార్థాల్లో కల్తీ, నిత్యావసర సరుకుల తూనికల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తెలియకుండానే వినియోగదారుడు నష్టపోతున్నాడు. అయితే వినియోదారుడి రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈ క్ర మంలో వినియోగదారుల్లో చైతన్యంతోపాటు పలు సూచనలు సలహాలు తీసుకొని వారి సమస్యలు పరిష్కరించాల్సిన ఆహార సలహా సంఘం కమిటీలు జిల్లాలో ఎక్కడా కాన రావడం లేదు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతీ మూడు మాసాలకోసారి సమావేశం నిర్వహించి అందులో వినియోగదారుడి రక్షణకు పలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్లుగా ఈ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయి.కుమురం భీం జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. రెండు డివిజన్లు, వాటిలో 173 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఏ స్థాయిలోనూ ఆహార సలహా సంఘం కమిటీలు లేకపోవడంతో వినియోగదారుడు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నాడు. నాణ్యమైన ఆహారం అందక ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల కల్తీ రాయుళ్లు రెచ్చిపోయి దేన్నీ విడిచిపెట్టకుండా కల్తీ చేస్తుండడంతో ఆ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. అయితే ఈ కల్తీలపై ప్రజలను చైతన్య వంతుల్సి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి తగు నిర్ణయం, సూచనలు, సలహాలు తీసుకునేందుకు గతంలో ప్రభుత్వం ఆహార సలహా సంఘాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కల్తీ మోసాలపై ప్రతీ మూడు మాసాలకోసారి తగిన నిర్ణయాలు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం ఆహార సలహా సంఘాలు పత్తా లేకుండా పోవడం గమనార్హం! చౌకధరల దుకాణాలపై కొరవడిన నిఘా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో జరుగుతున్న మోసాలపై ఈ కమిటీలు గతంలో ఆరా తీసేవి. లోపాలుంటే కమిటీ సమావేశం దృష్టికి తెచ్చిం ది. దీంతో అధికారులు చర్యలు తీసుకునే వారు. ఇప్పుడు సలహా సంఘాలు లేకపోవడంతో చౌకధరల దుకాణాల్లో ఇష్టారాజ్యం నడుస్తోంది. ఆహార పదార్థాలు కల్తీ ప్రజలు వినియోగించే నిత్యావసర సరుకులు సైతం కల్తీ అవుతున్నాయి. కాగజ్‌నగర్‌తోపాటు తదితర ప్రాంతాల్లో గతంలో కల్తీ నూనెతోపాటు ఇతర ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉండడంతో అధికారులు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. కొన్ని శాంపిళ్లను ల్యాబ్‌కు కూడా పంపించారు. ఇలాంటి కల్తీ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం వినియోగదారుల రక్షణకు అనేక చట్టాలు తెచ్చినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. వీటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత సలహా సంఘాలకు ఉండేది. సంఘాలే నామమాత్రంగా మారడంతో చట్టాల అమలును ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఇందులో ఆహార కల్తీ నిరోధక చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం, నీటి కాలుష్య నివారణ చట్టం, వ్యవసాయ ఉత్పత్తుల చట్టం వంటి అనేకంగానే ఉన్నాయి. వీటిపై అవగాహన కల్పిస్తే వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు.. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ఆహార సలహా సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, వినియోగదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వర్గాల నుంచి సభ్యులు ఉంటారు. ఈ కమిటీ ప్రతీ మూడు మాసాలకు ఒకసారి సమావేశమై వినియోగదారుల సమస్యలపై చర్చించేది. సమవేశంలో సంబంధిత ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరించేంది. ప్రభుత్వ అధికారులు సమస్యలను పరిష్కరించే వారు. తిరిగి మూడు మాసాలకోసారి జరిగే సమీక్షలు ప్రగతిని వివరించాల్సి ఉంటుంది. దీని వల్ల వినియోగదారుడి సమస్య కొంతైన పరిష్కారమవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. -
స్పాండిలైటిస్‌కు...
సర్వైకల్ ఏరియాలో సి1 నుంచి సి7 మధ్యలో ఉన్న డిస్క్ బల్జ్ హెర్నియేటెడ్ డిస్క్, డిస్క్ అరుగుదల వంటివి ఒకప్పుడు వయసు పెరిగిన తర్వాత మాత్రమే వచ్చే సమస్యలు. అయితే ప్రస్తుత జీవనశైలి కారణంగా ఈ తరహా నొప్పులు యుక్తవయసుల్లోనూ సర్వసాధారణంగా మారాయి. నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఒత్తిడితో కూడిన ఉద్యోగాల వల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ డిపాజిట్ కావడం దీనికో ప్రధాన కారణం. మెడ భుజాలు గుంజడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. దీనికి పని చేసే మధ్యలో తరచుగా విరామాలు తీసుకోవడం, అటూ ఇటూ నడవడం కొన్ని రిలాక్సింగ్ వ్యాయామాలు చేయడం అవసరం. 1. బ్రహ్మముద్రలు శ్వాస తీసుకుంటూ తలను నెమ్మదిగా పైకి ఎత్తి శ్వాస వదులుతూ తలను కిందకు, గడ్డాన్ని ఛాతీ మీదకు (ఊర్థ్వ అథో ముద్రలు) తీసుకురావాలి. అదే విధంగా శ్వాస తీసుకుంటూ కుడి చెవి కుడి భుజం మీద శ్వాస వదులుతూ మధ్యలోకి, మళ్లీ శ్వాస తీసుకుంటూ ఎడమ చెవి ఎడమ భుజం మీదకు శ్వాస వదులుతూ మధ్యలోకి (వామ దక్షిణ)... తేవాలి. అలాగే గడ్డం కుడి భుజం మీద మళ్లీ నెమ్మదిగా ఎడమ భుజం మీదకు తీసుకురావాలి. తర్వాత తలను గుండ్రంగా వీలైనంత పెద్ద వృత్తంలో తిప్పాలి. గడ్డం ఛాతీ మీద ఆనించి గడ్డం కుడి భుజం మీదకు తలను వెనుకకు వాలుస్తూ ఎడమ భుజం మీదకు గడ్డం తీసుకువచ్చి తిరిగి ఛాతీ మీదకు తీసుకురావాలి. వీటిని వీలైనంత నిదానంగా కనీసం 3 సార్లు చేయాలి. కళ్లు తిరుగుతున్నట్టు అనిపిస్తే లో సుగర్, లో బీపీ లేదా స్పాండిలైటిస్ వలన కనుక ఒక రౌండ్ క్లాక్ వైజ్ గడియారం దిశలో మరో రౌండ్ యాంటి క్లాక్ వైజ్ చేయాలి. 2.ఊర్థ్వ నమనాసన దీనిని నుంచుని లేదా కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ఇంటర్‌లాక్ చేసి బాగా పైకి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ చేతులు రిలాక్స్ చేయాలి. ఇలా 5 నుంచి 6 రిపిటీషన్లు చేయాలి. 3.ఊర్థ్వనమనాసన చాలన చేతులు రెండూ ఇంటర్ లాక్ చేసి పైకి స్ట్రెచ్ చేసి శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు వదులుతూ మళ్లీ మధ్యలోకి తేవాలి. ఇలా 5 నుంచి 10 రిపిటీషన్లు. ఇలాగే కుడివైపు కూడా చేయాలి. 4. తాలాసన (ఎడమ, కుడి) సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ కుడిచెయ్యి పైకి (పక్క నుంచి) నెమ్మదిగా తీసుకువెళ్లి కుడి భుజం కుడి చెవికి దగ్గరగా ఉంచి చెయ్యి పైకి స్ట్రెచ్ చేస్తూ ఎడమ చెయ్యి నడుం పక్కన కిందకు అరచేయి కిందకు తీసుకువెళుతూ శ్వాస వదులుతూ వీలైనంతగా ఎడమవైపుకి బెండ్ అవ్వాలి. మళ్లీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ కుడి చేయి కిందకు.. ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. 5. తాలాసన చాలన శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకువెళ్లి శ్వాస వదులుతూ చేతులు కిందకు డయాగ్నల్‌గా తీసుకురావాలి. మళ్లీ కాలి మడమ తిప్పుతూ వెనుకకు తిరుగుతూ పైకి తీసుకెళ్లాలి. ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. 6. కటి చక్రాసన చాలన వేరియంట్ ఎ: కాళ్ల మధ్య రెండు అడుగుల దూరం ఉంచి ఫ్రీగా వదిలేసిన చేతులను స్వింగ్ చేస్తూ 360డిగ్రీల కోణంలో ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రొటేట్ చేయాలి. వేరియంట్ బి: అదే విధంగా చేతులను మధ్యలో ఉంచి కుడిచేయి ఎడమ భుజం మీదకు, ఎడమ చేయి వెనుక నడుం మీదకు ఉంచుతూ ఎడమ వైపునకు తిరగాలి. ఇదే విధంగా కుడి వైపునకు ఇలా కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఒక కాలి మడమను పైకి లేపి రెండవ పాదం డైరెక్షన్‌ను మారుస్తూ చేయాలి. వేరియంట్ సి: ఇదే విధంగా పైనుంచి చేయాలి. పైన పేర్కొన్న ఆసనాలు అన్నీ నిలబడి చేయవచ్చు కనుక ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. ఈ ఆసనాలు నిదానంగా, చేతులు, శరీరాన్ని ఫ్రీగా వదిలేసి మనస్సుని రిలాక్స్డ్గా ఉంచి చేయాలి. శ్వాస పూర్తిగా తీసుకుంటూ పూర్తిగా వదులుతూ చేయడం, చేతుల కదలిక వలన తలలోని భాగాలకు 12 జతల క్రేనియన్ నాడీ వ్యవస్థకు ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. ఈ వ్యాయామాలు అన్నీ మెదడుకు సంబంధించిన బ్రెయిన్ ఎటెక్సియా, అల్జీమర్స్, సీజర్స్ వంటి సమస్యల పరిష్కారానికి కూడా బాగా ఉపకరిస్తాయి. ఈ ఆసనాలతో పాటు రెగ్యులర్‌గా ఈ క్రింద పేర్కొన్న ఆసనాలు కూడా సాధన చేయడం అవసరం. నిలబడి: త్రికోణాసన, పార్శ్వకోణాసన, కూర్చుని: మార్జాలాసన, అర్థ అథోముఖ శ్వానాసన, బాలాసన/శశాంకాసన, వక్రాసన, మరీచాసన, భరధ్వాజాసన, అర్ధ మచ్చేంద్రాసన, అథోముఖ శ్వానాసన, ఉష్ట్రాసన వెల్లకిలా పడుకుని: మత్సా్యసన, సేతు బంధాసన, శవాసన బోర్లా పడుకుని: నిరాలంబాసన, స్వాలంబ భుజంగాసన, భుజంగాసన, ఊర్థ్వముఖ శ్వానాసన, మకరాసన ఈ ఆసనాలు చేయడంలో అవసరమైతే గోడ, కుర్చీ, ఇటుకరాయి... వంటి వాటి సపోర్ట్ తీసుకుని కూడా చేయవచ్చు. అలాగే తేలికపాటి ప్రాణాయామాలు కూడా నొప్పుల నివారణలో ఉపకరిస్తాయి. – సమన్వయం: ఎస్. సత్యబాబు, సాక్షి ప్రతినిధి -
నిద్రలో మాట్లాడే జబ్బు...!
మెడి క్షనరీ నిద్రలో మాట్లాడే జబ్బు చిన్నపిల్లల్లో చాలా సాధారణం. దీన్ని ‘సామ్నిలాక్వి’ అని అంటారు. నిద్ర సబంధమైన రుగ్మతలు... అంటే నిద్రలో పీడకలల వంటి భయాలకు గురై అరుస్తూ నిద్రలేవడం (నైట్ ట్సై), నిద్రలో నడవడం (స్లీప్ వాకింగ్) లాంటి కోవకు చెందినదే ఈ నిద్రలో మాట్లాడే జబ్బు. దీనితో బాధపడేవారు నిద్రలో మాట్లాడే సమయంలో అస్పష్టంగా గొణగడం మొదలుకొని, పెద్దగా అరవడం కూడా చేస్తుంటారు. ఇదేమీ ప్రమాదకరమైన రుగ్మత కాదు. కాస్త పెద్ద పిల్లల్లో కౌమార ప్రాయం (అడాలసెన్స్)లో కనిపించే ఈ రుగ్మత... వాళ్లు పెరిగి పెద్దవుతున్న కొద్దీ (అడల్ట్హుడ్కు దగ్గరవుతున్న కొద్దీ) దానంతట అదే తగ్గిపోతుంది. -
బెడ్రూమ్లో కూడా టార్గెట్స్ గుర్తొస్తున్నాయ్...
ప్రైవేట్ కౌన్సెలింగ్ పురుషుల సందేహాలకు సమాధానాలు యుక్తవయసు వచ్చిన తర్వాత సెక్స్ ప్రేరణలు, అంగస్తంభన కలిగి హస్తప్రయోగం చేసుకోవడం, ఆ ప్రక్రియతో తృప్తి పొందడం చాలా సాధారణం. హస్తప్రయోగం తర్వాత కలిగే తృప్తి, మానసిక, శారీరక రిలాక్సేషన్ వల్ల కాసేపు నీరసంగా అనిపించడం సహజం. అంతేగాని దీనివల్ల శరీరంలో బలం, బరువు తగ్గడానికి అవకాశమే లేదు. నా వయసు 42 ఏళ్లు. మా ఆవిడకు ఇబ్బంది వద్దని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నేనే చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకొని కూడా పదేళ్లు అవుతోంది. ఇప్పుడు నా వృషణాల్లో బరువుగా అనిపిస్తోంది. ఈమధ్య మెడ, తల నొప్పిగా ఉంటోంది. అలసట వస్తోంది. సెక్స్ కూడా చక్కగా చేయలేకపోతున్నాను. ఈ సమస్యలన్నీ వ్యాసెక్టమీ వల్లనేమో అని అనుమానంగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - కె.వి.ఎస్. ఒంగోలు మీరు చెప్పిన సమస్యలతో 39, 40 ఏళ్ల వయసులో చాలామంది మగవాళ్లు బాధపడుతూ ఉంటారు. మీలాగే అపోహ చెంది వాళ్ల సమస్యలను వాసెక్టమీకి ఆపాదిస్తుంటారు. వ్యాసెక్టమీ ఆపరేషన్ చాలా సులువైనది. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. దీర్ఘకాలిక సమస్యలేమీ రావు. వాసెక్టమీ అంటే... వీర్యకణాలు వచ్చే మార్గాన్ని బ్లాక్ చేయడం మాత్రమే. అంతేగాని... వృషణాలు బరువు అనిపించడానికీ, వ్యాసెక్టమీకీ ఎలాంటి సంబంధమూ ఉండదు. మీరు ఒకసారి యాండ్రాలజిస్ట్‌ను కలిసి మీ సమస్యలకు చికిత్స తీసుకోండి. మీ సమస్యలన్నీ మామూలు చికిత్స ప్రక్రియలతో చక్కదిద్దగలిగేవే. నా వయసు 23 ఏళ్లు. గత మూడేళ్ల నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను. ఇటీవల నా బరువు బాగా తగ్గినట్లు అనిపిస్తోంది. హస్తప్రయోగం తర్వాత విపరీతమైన నీరసంగా ఉంటోంది. హస్తప్రయోగం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందా? - డి.కె.ఆర్., కరీంనగర్ యుక్తవయసు వచ్చిన తర్వాత సెక్స్ ప్రేరణలు, అంగస్తంభన కలిగి హస్తప్రయోగం చేసుకోవడం, ఆ ప్రక్రియతో తృప్తి పొందడం చాలా సాధారణం. హస్తప్రయోగం తర్వాత కలిగే తృప్తి, మానసిక, శారీరక రిలాక్సేషన్ వల్ల కాసేపు నీరసంగా అనిపించడం సహజం. అంతేగాని దీనివల్ల శరీరంలో బలం, బరువు తగ్గడానికి అవకాశమే లేదు. మీలోని కోరికను బట్టి, మీలో కలిగే సెక్స్ ప్రేరేపణలను బట్టి హస్తప్రయోగం ఎన్నిసార్లు చేసినా దానివల్ల మీకు ఏమాత్రం హాని లేదు. అయితే బరువు తగ్గినట్లుగా అనిపించడం మీ అనుమానమైతే, హస్తప్రయోగం పట్ల మీకు ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నిజంగానే మీ బరువు తగ్గి ఉంటే దానికి అసలు సమస్య ఏమిటోతెలుసుకొని దానికి చికిత్స తీసుకుంటే మళ్లీ ఆరోగ్యంగా అవుతారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి. నా వయుసు 30 ఏళ్లు. నా వృషణాలు చిన్నవిగా వూరాయుని అనిపిస్తోంది. నాకు ఉన్న సవుస్య ఏమై ఉంటుంది? దయుచేసి నా సవుస్యకు సలహా ఇవ్వండి. - ఎస్.ఆర్.కె., కందుకూరు చాలామంది తమ వృషణాల సైజ్ గురించి, పురుషాంగం పరిమాణం గురించి ఆందోళన పడుతుంటారు. అలాంటి ఆందోళన ఉన్నప్పుడు అవి చిన్నగా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ అది వాళ్ల అపోహ మాత్రమే. కొందరిలో మాత్రం వేరికోసిల్ వల్ల వుుందు పెద్దవిగా ఉన్న వృషణాలు ఆ తర్వాత సైజ్ తగ్గవచ్చు. వాళ్లలో నొప్పి కూడా ఉండవచ్చు. మీరు ఒకసారి యాండ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకు డాప్లర్ అల్ట్రా సౌండ్ పరీక్ష చేరుుంచి, నిజంగానే సమస్య ఉందా అన్న విషయాన్ని యాండ్రాలజిస్ట్ నిర్ధారణ చేస్తారు. మీ సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. మా బాబుకు పదకొండేళ్లు. ఒకరోజు రాత్రి అతడికి అకస్మాత్తుగా వృషణంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే వృషణం పూర్తిగా డ్యామేజీ అయ్యిందని, దాన్ని వెంటనే తొలగించాలని అన్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు మా అబ్బాయి పెద్దయ్యాక పెళ్లిచేస్తే ఈ ఆపరేషన్ వల్ల పిల్లలు పుట్టడానికి ఏమైనా సమస్య వస్తుందా? - వై.కె.ఆర్., విజయవాడ మీరు చెప్పిన సమస్యను టెస్టిక్యులార్ టార్షన్ (వృషణం తిరగబడటం) అంటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆరు గంటలలోపు ఆపరేషన్ చేస్తే తిరగబడ్డ వృషణాన్ని సాధారణ స్థితిలోకి పెట్టవచ్చు. అలా చేస్తే వృషణాన్ని తొలగించాల్సిన అవసరం ఉండదు. మీరు చెప్పినట్లుగా ఇది వైద్యపరంగా అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషనే. ఒక్క వృషణమే ఉన్నప్పటికీ మీ బాబుకు భవిష్యత్తులో పిల్లలు పుట్టడానికి ఆ అంశం ఏమీ సమస్య కాబోదు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా వయసు 47 ఏళ్లు. ఒక ప్రైవేటు కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్నందువల్ల తీవ్రమైన ఒత్తిడితో ఉంటాను. పైగా అధిగమించాల్సిన టార్గెట్స్ కూడా ఉంటాయి. ఇటీవల కొంతకాలం నుంచి సెక్స్‌లో పాల్గొనలేకపోతు న్నాను. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. - జీ.వి.ఎమ్., హైదరాబాద్ సాధారణంగా నలభై ఏళ్లకు పైబడ్డ పురుషుల్లో వృత్తిరమైన, సామాజిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. దాంతో వారు సెక్స్‌లో అనుకున్నట్లుగా పెర్ఫార్మ్ చేయలేకపోవడం చాలా సాధారణమైన సమస్య. సాధారణంగా ఈ వయసులో వారు వారానికి రెండుమూడు సార్లు మాత్రమే సెక్స్‌లో పాల్గొంటుంటారు. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. మీరు ప్రతిరోజూ యోగా, ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ చేయండి. దాంతో ఒత్తిడి తొలగిపోవడంతో పాటు ఫిట్సెస్ చేకూరుతుంది. మీ సెక్స్ పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యం. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కొన్నాళ్లు మందులు వాడటం ద్వారా మీ సమస్యను అధిగమించవచ్చు. నాకు 39 ఏళ్లు. మూత్రవిసర్జన సమయంలో, సెక్స్ చేస్తున్నప్పుడు విపరీతంగా మంట వస్తోంది. స్కానింగ్ చేయించుకుంటే మూత్రాశయంలో 4 సెం.మీ. రాయి ఉందని చెప్పారు. నాకు మంట మినహా ఇతర ఏ సమస్యా లేదు. దీనికి ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే ఏవైనా సెక్స్ సమస్యలు వస్తాయా? నాకు ఇప్పుడు సెక్స్ సామర్థ్యం బాగానే ఉంది. ఆపరేషన్ తర్వాత సామర్థ్యం తగ్గుతుందేమోనని భయంగా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. - ఎమ్.ఆర్., ఖమ్మం మూత్రాశయంలో రాళ్లు ఉండటం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చి మంటగా అనిపించడం మామూలే. ఈ రాళ్లను ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఈ ప్రక్రియలో అంగస్తంభన కలిగించే నరాలకు ఎంతమాత్రమూ నష్టం జరగదు. పైగా అవి చాలా దూరంగా ఉంటాయి కూడా. కాబట్టి ఎండోస్కోపీకీ, అంగస్తంభన సామర్థ్యం తగ్గడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇన్ఫెక్షన్ను ఇలాగే వదిలేస్తే అది కీడ్నీకి కూడా పాకడానికి అవకాశం ఉంది కాబట్టి. మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించి వెంటనే ఎండోస్కోపీ చేయించుకోండి. -
తలరంగు జాగ్రత్తలు : హెయిర్ డై... హౌ అండ్ వై!
యౌవనం చాలాకాలం పాలు అలా నిలిచి ఉండేలా చేయడానికి చాలా మార్గాలున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి. ఇవన్నీ దీర్ఘకాలం తర్వాత యౌవనాన్ని ఇచ్చి... దాన్ని అలా కొనసాగిస్తాయేమోగానీ... జుట్టుకు రంగేయడం అనే ఒక ప్రక్రియ తర్వాత యౌవనం షార్ట్‌కట్ లో మనకు దక్కేస్తుంది. షార్ట్‌కట్ కాబట్టి కొన్ని ప్రమాదాలూ ఉంటాయి కాబట్టి వాటిని నివారించడం ఎలాగో తెలుసుకుందాం. ఒకప్పుడు జుట్టుకు రంగేసుకోవడం ఏ నలభై ఐదూ, యాభై ఏళ్లు దాటినవారో చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. త్వరగా జుట్టు నెరిసిపోవడంతో చిన్న వయసులోనే రంగు వేసుకోవాల్సిన పరిస్థితి కొందరిది. మరికొందరిదేమో మంచి లుక్స్ కోసం, మాడ్రన్‌గా కనిపించడం కోసమూ జుట్టుకు రంగేసుకోవడంపరిపాటి అయిపోయింది. మీకు అనువైన హెయిర్‌డై ఏదో ఎంపిక చేసుకోవడం ఎలా? ⇒ ఈ ఎంపిక అన్నది మీరు ఎందుకు హెయిర్ డై ఉపయోగిస్తున్నారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ జుట్టు తెల్లబడినందువల్ల దాన్ని నల్లగా కనిపించేలా చేసుకోవడం కోసం రంగేసుకుంటున్నారా లేక మీ జుట్టు నల్లగానే ఉన్నా... ఫ్యాషన్ కోసం జుట్టు చివర్లు (ఒంబ్రే పాట్రన్) కోసం వేసుకుంటున్నారా లాంటి అంశాలు మీ హెయిర్‌డై ఎంపికను నిర్ణయిస్తాయి. ⇒ సాధారణంగా భారతీయులు స్వాభావికమైన నల్ల రంగు నుంచి కొందరు తమ అభిరుచిని బట్టి బ్రౌన్ లాంటి రంగు వేసుకుంటారు. ⇒ ఏ బ్రాండ్ కొనాలన్న విషయం మీరు దానిపై ఖర్చు పెట్టదలచుకున్న అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ ధర మొదలుకొని చాలా ఎక్కువ ధర వరకు అనేక బ్రాండ్లు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. హెయిర్ డైతో ప్రమాదాలిలా... ⇒ హెయిర్ డైలో ఉండే అనేక రసాయనాలలో కొన్ని మీ చర్మానికి సరిపడకపోవచ్చు. ఇప్పుడు చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిగా వాపు వంటివి కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో తలకు రంగు పెట్టినా కళ్లు, పెదవులు లేదా మొత్తం శరీరం వాచిపోవడం వంటి దుష్ర్పభావాలు కనిపించవచ్చు. అలాంటప్పుడు వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ను సంప్రదించండి. ఈ రసాయనాల్లో ఉండే వాయువులు కళ్లను మండించడం, కళ్ల నుంచి నీరుకారేలా చేయడం, గొంతులో ఇబ్బంది కలిగించడం, తుమ్ములు వచ్చేలా చేయడం, ఒక్కోసారి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలిగించి, ఆస్తమాకు దారితీయడం జరగవచ్చు. ఎన్నో ఏళ్లు వాడాక కూడా ఇలాంటి పరిణామాలు ఒక్కోసారి అకస్మాత్తుగా కనిపించవచ్చు. అందుకే మనకు ఏది సరిపడదో ముందే తెలుసుకొని, దానికి దూరంగా ఉండటం మేలు. ⇒ హెయిర్ డై ఒకవేళ గోళ్లకు అంటుకుంటే, గోరు పెరుగుతున్న కొద్దీ, క్రమంగా మనం కట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఒకనాటికి పూర్తిగా తొలగిపోతుంది తప్ప చర్మంపైన తొలగిపోయినట్లుగా ఇది పోదు. ఎందుకంటే మన గోరూ, హెయిరూ... ఈ రెండూ ఒకే రకమైన పదార్థంతో (కెరొటిన్)తో తయారవుతాయి. కాబట్టి గోళ్లకు రంగు అంటనివ్వకండి. ⇒ హెయిర్ డైను కొద్ది కొద్ది మోతాదుల్లో తీసుకుంటూ జుట్టుకు రాయండి. బ్రష్ మీద పెద్దమొత్తంలో తీసుకోకండి. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకుంటే అది కంటిలోకి కారే ప్రమాదం ఉంది. హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేస్తాయి. హెయిర్‌డై కళ్లలోకి స్రవిస్తే... కళ్లు మండటం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడం కూడా జరగవచ్చు. ఒక్కోసారి అంధత్వానికీ దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంటి విషయంలో మరింత అదనపు జాగ్రత్త అవసరం. ⇒ హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. దాంతో ఆ రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలా చేస్తాయి. ఫలితంగా చాలాకాలం రంగువేసుకుంటూ ఉన్నవారిలో వెంట్రుక కాస్త రఫ్‌గానూ, తేలిగ్గా చిట్లిపోయేదిగానూ (బ్రిటిల్గానూ) మారుతుంది. ఇక మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవారిలో ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది. ⇒ కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ తారు (కోల్తార్), పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్- ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటికి బదులు స్వాభావికమైన కాలీ మెహందీ, అప్పటికప్పుడు కలుపుకున్న హెన్నా వంటివి సురక్షితం (అయితే ఇందులోని చాలా కొద్దిపాళ్లలో పీపీడీ ఉండే అవకాశాలున్నాయి). ⇒ హెయిర్‌డై వల్ల యౌవనంగా కనిపించడమన్నది తక్షణం ఒనగూరే ప్రయోజనమే. అయితే అది ప్రమాదకరం కాకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. కాబట్టి పైన పేర్కొన్న సురక్షిత చర్యలు అవలంబిస్తూ... యూత్‌ఫుల్‌గా కనిపించండి. జాయ్‌ఫుల్‌గా జీవించండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే... ♦ మీరు తొలిసారిగా తలకు రంగు వేసుకుంటున్నారా? మొదటిసారి ఇంటి వద్ద కాకుండా పార్లర్లో ప్రొఫెషనల్స్ దగ్గర ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోండి ♦ రంగు వేసుకునే ముందుగా చెవి వెనక ఒక పాయకు రంగు వేసి, 48 గంటల పాటు పరిశీలించి చూసుకోండి. ఆ సమయంలో ఎలాంటి అనర్థమూ, దుష్ర్పభావమూ (సైడ్ ఎఫెక్ట్) కనిపించపోతే... ఇక రంగేసే ప్రక్రియను కొనసాగించండి. ♦ మీకు సురక్షితమని తేలిన బ్రాండ్‌నే ఎప్పుడూ కొనసాగించండి ♦ మీరు రంగు అంటకూడదని అనుకుంటున్న శరీర భాగాలపై పెట్రోలియం జెల్లీని పూయండి ♦ రంగు అంటకూడదని భావించే మెడ వెనక భాగంపై పాత టవల్‌ను చుట్టండి ♦ రంగును ఒకే తరహాలో (యూనీఫామ్గా) అంటేలా బ్రష్‌ను ఉపయోగించండి. అంతే తప్ప ఒకచోట ఎక్కువ, మరోచోట తక్కువ పూయకండి. దీంతో తెరపలు తెరపలుగా రంగు కనిపించే ఆస్కారం ఉంది ♦ రంగు పూసే సమయంలో చేతులకు గ్లౌవ్స్ తప్పక ధరించండి ♦ వెంట్రుక పెరుగుతున్న కొద్దీ కుదుళ్ల వద్ద తెల్లగా కనిపించే చోట మాత్రమే రంగు పూయదలచినప్పుడు, మిగతా నల్లగా ఉన్న వెంట్రుకల వరకు కండిషనర్ పూసి, తెల్లని చోట టచప్ చేయండి ♦ మీరు ఎంపిక చేసుకున్న షేడ్ ఏదో అదే వేసుకోండి. అంతేగానీ... రెండు షేడ్ల రంగులు తీసుకొని ఈ రెండింటినీ కలపకండి రంగు వేసే సమయంలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకండి. ఈ జాగ్రత్తను తప్పక పాటించండి ♦ రంగు వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం లేదా ఆయాసం రావడం జరుగుతుంటే వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోండి ♦ హెయిర్‌డై అన్నది కేవలం తలకు మాత్రమే వేసుకోండి. కనుబొమలకూ, కనురెప్పలకూ ఉన్న వెంట్రుకలకు ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్‌డై వాడకూడదు ♦ మీరు కొన్ని బ్రాండ్‌లోని జాగ్రత్తలను, అందులో ఉపయోగించిన పదార్థాలను ఒకసారి చదవండి. అందులో కోల్తార్, లెడ్ ఎసిటేట్, రెసార్సినాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు రాసి ఉంటే దాన్ని వాడకండి ♦ అమోనియా వంటి రసాయనాలు ఉన్న బ్రాండ్స్ ఉపయోగించడం వల్ల మీకు ఏవైనా దుష్ర్పభావాలు కనిపిస్తే... అమోనియా లేని బ్రాండ్లలో మోనో ఈథేనొలమైన్ (ఎమ్ఈఏ) వంటి సురక్షితమైన ఏజెంట్స్ ఉన్న బ్రాండ్స్ వాడుకోండి ♦ గర్భిణులు... తాము ప్రెగ్నెన్నీతో ఉన్న టైమ్‌లో హెయిర్‌డై ఉపయోగించకపోవడమే మంచిది. డాక్టర్ రాధా షా కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ -
యవ్వనంలో తప్పులు చేస్తే...
యవ్వనంలో చేసే తప్పులు... పెళ్లి తర్వాత ఎలా గుదిబండలుగా మారతాయో, అప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి వారు ఎలాంటి పాట్లు పడతారో తెలియాలంటే తమ సినిమా చూడాలంటున్నారు దర్శక, నిర్మాత ప్రసాద్ నీలమ్. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం‘యవ్వనం ఒక ఫ్యాంటసీ’. అరవింద్‌కృష్ణ, శుభ్ర అయ్యప్ప జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలాఖరులో పాటలు విడుదల కానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: జీవన్ థామస్.