
చిలగడదుంప
చిలగడదుంపకు ప్రాంతాలను బట్టి గెణుసుగడ్డ, మోరంగడ్డ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో 77 శాతం నీరు, 20.1శాతం కార్బోహైడ్రేట్లు, 1.6 శాతం ప్రొటీన్లు, 3 శాతం పీచుపదార్థాలు ఉంటాయి. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. ∙చిలగడదుంపలో కార్బోహైడ్రేట్ల పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తక్షణ శక్తి వనరుగా ఉపయోగించుకోవచ్చు ∙బీటా–కెరొటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి. చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తికి విటమిన్–సి దోహదపడుతుంది. అందుకే విటమిన్–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుంది.
అలాగే విటమిన్–ఏ మేనికి ఒక మెరుపు, నిగారింపు ఇస్తుంది. అందుకే చిలగడదుంపల్ని తినేవారి చర్మం ఏజింగ్ దుష్ప్రభావాలకు అంత తొందరగా గురికాదు. ఈ కారణంగానే దీన్ని తినేవారిలో ఏజింగ్ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడం, తద్వారా దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యపడుతుంది ∙చిలగడదుంపలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. పొటాషియమ్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారు దీన్ని తింటే... బీపీ అదుపులో పాటు గుండె ఆరోగ్యమూ పదిలంగా ఉంటుంది ∙ చిలగడదుంప వల్ల అనేక గుండెజబ్బులు నివారితమవు తాయని పరిశోధనల్లో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment