పెరగాల్సింది బలం...బరువు కాదు!
రోజంతా పని చేయాలంటే శక్తి ఉండాలి. అందుకోసం కడుపు నిండా తినాలి. కంటినిండా నిద్ర΄ోవాలి. ఈ రొటీన్‌లో ఏం తింటున్నామో తెలియకపోతే స్లిమ్‌గా ఉండడం కష్టం. ఆహారం బలాన్ని పెంచాలి కానీ బరువును పెంచకూడదు.
నాజూగ్గా ఉండే జాన్వి కపూర్... అంత స్లిమ్ గా, ఎనర్జిటిక్‌గా ఉండడానికి ఏం తింటుంది? డిన్నర్‌లో రాగి – చిలగడ దుంప (స్వీట్ పొటాటో) పరాఠా తింటానని చెప్పింది. ఆమె షెఫ్ ఎలా వండుతున్నారో చూద్దాం.
రాగి–చిలగడ దుంప పరాఠా
కావలసినవి: చిలగడ దుంప – ఒకటి (పెద్దది); రాగి పిండి – 250 గ్రాములు; నువ్వులు– టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్‌లు; అల్లం తురుము – అర టీ స్పూన్; పచ్చిమిర్చి– 2 (సన్నగా తరగాలి); ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరగాలి); జీలకర్ర పొడి– అర టీ స్పూన్; మిరప పొడి– అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మిరియాల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్;
తయారీ
∙ఒక పాత్రలో పావు లీటరు నీటిని పోసి వేడి చేయాలి. అందులో నెయ్యి (సగం మాత్రమే), నువ్వులు, కొద్దిగా ఉప్పు, రాగి పిండి వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేత్తో అదుముతూ పూరీల పిండిలా కలిపి పాత్ర మీద మూత పెట్టి పక్కన పెట్టాలి.
ఈ లోపు ప్రెషర్ కుక్కర్‌లో నీటిని పోసి గెణుసుగడ్డను ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్కు వలిచి మరొక పాత్రలో వేసి చిదమాలి. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర పొడి, మిరప పొడి, ఉప్పు, మిరియాల పొడి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు చేయాలి.
రాగి పిండి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని చపాతీల పీట మీద వేసి కొద్దిగా వత్తి అందులో గెనుసు గడ్డ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. ఆ తరవాత జాగ్రత్తగా (లోపలి మిశ్రమం బయటకు రాకుండా) పరాఠా చేసి వేడి పెనం మీద వేసి నెయ్యి రాస్తూ కాల్చాలి.
Comments
Please login to add a commentAdd a comment