ప్రతీకాత్మక చిత్రం
పెళ్లికి మూడు ముళ్లు అవసరం. యవ్వనంలో.. వృద్ధాప్యంలో.. మరోజన్మలో కూడా కలిసి ఉండటానికే ఈ ముడులు. కానీ ఈ చెల్లికి మాత్రం రెండుసార్లూ.. పెళ్లి ముల్లైంది. విధి మొదటి ముల్లు. అందం రెండో ముల్లు. ఈ రెండు ముళ్ల పెళ్లి.. రెండో భర్త రూపంలో ఆమెకు నరకం చూపించింది! ఆమె అంతరంగమిది.
నిన్నటి జీవితం నేడు అనుకుని.. నేటి జీవితమే నేను అనుకుని కొత్తగా మొదలుపెడదామంటే నీడను గుచ్చుకున్న ముల్లుకంటే నేటిని గుచ్చుతున్న ముల్లే ఎక్కువగా బాధిస్తోంది! ‘వన్స్ బిటెన్.. ట్వైస్ షై’ అంటారు. ఒకసారి జరిగిన నష్టం రెండోసారి జరక్కుండా చూసుకోవాలని! ఇది ముందే తెలిసుంటే ఎంత బాగుండేది!
నాకు పాతికేళ్ల వయసులో పెళై్లంది. ఏడాదికే ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. యుక్త వయసులోనే నా జీవితం రోడ్డు పాలైంది. ఇది చూసి మా అమ్మా నాన్న తట్టుకోలేక మళ్లీ పెళ్లి సంబంధాలు చూశారు. అదే సమయంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఆయన.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం, మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం, నేను నచ్చడం, ఇద్దరికీ పునర్వివాహం.. చకచకా జరిగిపోయాయి.
పాత బాధలన్నీ మర్చిపోయి కొత్త జీవితం వైపు అడుగులు వేసేందుకు మెట్టినింట్లో కాలు పెట్టాను. పెళై్లన పది రోజుల వరకూ జీవితం సాఫీగానే సాగింది. ఎప్పుడూ నా వెంటే ఉండే వారు. నేను ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో జాబ్ చేస్తుండటంతో ఆయనే స్వయంగా నన్ను బ్యాంక్‌కు డ్రాప్ చేసే వారు. సాయంత్రం అరగంట ముందుగానే వచ్చి బ్యాంకులో నా ఎదురుగా కూర్చొని.. నన్ను చూస్తూ ఉండేవారు. కొన్నిసార్లు ఆలస్యమైనా కోపగించుకునేవారు కాదు. ఇవన్నీ చూసి నా అంత అదృష్టవంతురాలు లేదని అనుకున్నాను. ఎంతో ప్రేమగా చూసుకునే భర్త దొరికాడని సంబర పడిపోయాను. కానీ.. ఆ ఆనందమంతా కేవలం గాలి బుడగలేనని తెలుసుకోడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకే ఒక్క సంఘటన నా జీవితంలో ఎన్నో మర్చిపోలేని కాళరాత్రుల్ని పరిచయం చేసింది.
ఇంతసేపు ఎక్కడికెళ్లావ్?!
ఒక రోజు సాయంత్రం బ్యాంకు పని త్వరగా అయిపోయింది. ఆయనకు ఫోన్ చేశాను. లైన్ బిజీ అని రావడంతో నేనే ఆటోలో వెళ్లిపోయాను. దారిలో మార్కెట్‌కి వెళ్లి ఇంటికి కావలసిన సరకులు కొన్ని తీసుకున్నాను. స్వీట్స్ తీసుకున్నాను. ఓ బట్టల షాప్‌లో చీర నచ్చింది. ఆఫర్‌లో తక్కువ ధరకు వచ్చిందని తీసుకున్నాను. రాత్రి 8 గంటలు గడిచింది. ఇంటికి వెళ్లేసరికి ఆయన సోఫాలో గంభీరంగా కూర్చొని ఉన్నారు. ఎక్కడికి వెళ్లావంటూ గద్దించారు. విషయమంతా చెప్పినా విసుక్కున్నారు. కాల్ చేశానని చెప్పినా కసురుకున్నారు. ‘‘ఇన్ని రోజులూ నీ వెంట వస్తోంది నువ్వంటే ఇష్టమని కాదు. నా మొదటి పెళ్లాంలా వేరే సంబంధం పెట్టుకోవని. కానీ ఇంతలా కాపలా కాస్తున్నా తప్పించుకున్నావ్! చెప్పు.. నీకు చీర ఎవరు కొనిచ్చారు?’’ అంటూ అనుమానపు పిశాచిలా నన్ను ఆ రాత్రంతా చిత్రహింసలకు గురిచేశాడు. ఉదయం లేచేసరికి మామూలుగానే ప్రవర్తించారు!
ఆ నవ్వు వెనుక విషం!
‘‘నువ్వు కనిపించలేదనే ఎమోషన్‌లో నోటికొచ్చినట్లు మాట్లాడేశాను’’ అంటూ బుజ్జగించారు. నువ్వు చాలా అందంగా ఉంటావ్. అందుకే నిన్ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నానంటూ నవ్వుకుంటూ చెప్పడంతో నేనూ హ్యాపీ ఫీలయ్యాను. కానీ.. ఆ నవ్వుల వెనుక విషం అలాగే ఉందని గమనించలేకపోయాను.
పాప పుట్టినా మారలేదు
నేను అందంగా ఉన్నానని ఆయన చెప్పడంతో ఆయన కోసం మరింత అందంగా కనిపించాలని భావించేదాన్ని. మొదటి రెండు రోజులు గమనించిన ఆయన మూడో రోజునుంచి టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు. ఎవరి కోసం ఇలా రెడీ అవుతున్నావంటూ అప్పటి నుంచి మనోవేదనకు గురి చేస్తున్నారు. రెండేళ్ల వరకూ రోజూ నరకం చూశాను. గర్భవతిని అయినా విడిచిపెట్టలేదు. ఆడపిల్ల ప్రసవించింది. పోనీ పాప పుట్టిన తర్వాత అయినా మారతారని అనుకున్నాను. కానీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా ఆడపిల్ల పుట్టిందంటూ నానా గొడవా చేశారు. ఆ పిల్లను చంపేస్తానంటూ బెదిరించారు.
చిత్రహింసలు ఎక్కువయ్యాయి
విషయం తెలిసిన మా అమ్మా నాన్న కేసు పెడదామంటూ నన్ను తీసుకొచ్చారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఆయనలో మార్పు వస్తుందన్నాను. కానీ హింస మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బ్యాంకులో ఉన్న నా సహచరురాలు మహిళా శక్తి గురించి చెప్పింది. ఆ బృందంతో మాట్లాడాను. వారు మా ఆయనను పిలిపించారు. విషయం తెలుసుకున్నారు. ‘‘నా మొదటి భార్య ఇలాగే చేసి నన్ను మోసం చేసింది. ఆమె కంటే ఈమె అందంగా ఉంది. అలాంటప్పుడు ఈమె కూడా ఆమెలాగే తనని మోసం చేయకుండా ఉంటుందా అని అనుమానపడ్డాను’’ అని చెప్పారు. ఆ తర్వాత వాళ్లు మా ఇద్దరికీ వేర్వేరుగానూ, ఇద్దరినీ కలిపి కౌన్సిలింగ్ చేశారు. అయినా.. ఈ మూడేళ్లు పడిన కష్టాలు జీవితంలో మర్చిపోలేను.
– కనకదుర్గ (పేరుమార్చాం), గాజువాక
ఇంటర్వ్యూ: కరుకోల గోపి కిశోర్ రాజా, విశాఖ సిటీ
Comments
Please login to add a commentAdd a comment