‘అగ్ని’ని ఆపేందుకు అమెరికా ఒత్తిడి
చివరి పుస్తకం ‘అడ్వాంటేజ్ ఇండియా’లో వెల్లడించిన కలాం
న్యూఢిల్లీ: అది మే 22, 1989. భారత్ ‘అగ్ని’ క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతోంది. కొన్నిగంటల్లో ప్రయోగం జరుగుతుందనగా.. ఆరోజు వేకువజామున 3 గంటలకు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఇండియన్ మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కేబినెట్ సెక్రటరీ టీఎన్ శేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ‘ప్రయోగం ఎంతవరకు వచ్చింది? దాన్ని ఆపాలని అమెరికా, నాటో కూటమినుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది’ అని కాల్ సారాంశం. కలాం మదిలో ప్రశ్నలు మెదిలాయి.
అయినా.. అప్పడిక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నిర్ణయించుకుని ‘ప్రయోగాన్ని ఆపే స్థితి దాటిపోయింది. ఇప్పుడేమీ చేయలేం’ అని చెప్పారు. ఆరోజు తెల్లవారాక ఒడిశాలోని చాందీపూర్ నుంచి అగ్నిని విజయవంతంగా పరీక్షించారు. ఈ విషయాలు త్వరలో విడుదలకానున్న కలాం చిరి పుస్తకం ‘అడ్వాంటేజ్ ఇండియా’ పుస్తకంలో ఉన్నాయి.