తీపి జ్ఞాపకమే...
వైమానిక సాహస ప్రదర్శన వీక్షకులకు తీపి జ్ఞాపకంగా మారింది. తాము చూసిన విన్యాసాలను వీక్షకులు మరో రెండేళ్ల పాటు మననం చేసుకోక తప్పలేదు. ఐదు రోజుల పాటు అలరించిన ఏరో ఇండియా-15 ప్రదర్శన ఆదివారం ముగిసింది. లక్షలాది మంది గగనతలంలో లోహ విహంగాల సయ్యాటలను చూసి మైమరిచిపోయారు. కొద్దిపాటి ఘటనలు మినహా ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ వైమానిక ప్రదర్శన యలహంకలోని ఎయిర్‌బేస్‌లో ఈ నెల 18న ప్రారంభమైన విషయం విదితమే.
ప్రదర్శనలో భాగంగా దేశ విదేశాలకు చెందిన వైమానిక దళాలు తమ సత్తాను చాటాయి. హెచ్ఏఎల్, బెల్... రక్షణ దళానికి చెందిన సంస్థలతోపాటు వివిధ దేశాలకు చెందిన సుమారు 650 పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచాయి. ఇదే సందర్భంగా రూ. వేల కోట్ల విలువ చేసే వ్యాపార ఒప్పందాలు వివిధ కంపెనీల మధ్య కుదిరినట్లు అధికారులు చెబుతున్నారు. - సాక్షి, బెంగళూరు