అ‘పూర్వ’ సమ్మేళనం
- ఏఈఎస్ 1991 బ్యాచ్
- విద్యార్థుల కలయిక
- 25 మంది టీచర్లకు సన్మానం
- ఆ‘పాత’ మధురాలను
- నెమరేసుకున్న నిర్వాహకులు
సాక్షి, ముంబై: ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ (ఏఈఎస్) 1991 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం అద్వితీయంగా జరిగింది. పాఠశాల విద్య పూర్తయ్యి 25 ఏళ్లు గడిచిన సందర్భంగా వారు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని దాదర్‌లోని కోహినూర్ హాల్లో నిర్వహించారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన 25 మంది గురువులను సుమారు 150 మంది ఏఈఎస్ పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
పూర్వ ఉపాధ్యాయులు దశరథ్ సుబ్బలక్ష్మి, శాలినీలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ‘జయతు దేవి జన్మభూమి’ అనే దేశభక్తి గీతాలాపన చేశారు. పూర్వ విద్యార్థి డాక్టర్ అనిత ప్రసంగిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తాము ఈ స్థితికి చేరుకోవడానికి ఉపాధ్యాయులు నింపిన స్ఫూర్తి, నేర్పిన విద్య కారణమని పేర్కొన్నారు.
తర్వాత పూర్వ విద్యార్థులంతా ప్రస్తుతం ఏయే రంగాల్లో పనిచేస్తున్నారో వివరిస్తూ ఒక స్లయిడ్ షో నిర్వహించారు. పూర్వ ఉపాధ్యాయులు దశరథ్, సుబ్బలక్ష్మి, శాలిని, మచ్చ ప్రభాకర్, కే.సుజాత, సోమల్ జ్యోతి, జయంతి తదితరులను విద్యార్థులు సన్మానించారు. విద్యార్థులు ఇలాంటి మంచి స్థితికి ఎదిగాక కూడా తమను గుర్తుంచుకుని సన్మానించడం చాలా ఆనందంగా ఉందని సన్మానం అనంతరం ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు.
విద్యార్థులందరూ వివిధ రంగాల్లో స్థిరపడి సమాజానికి, దేశానికి ఉపయోగపడేలా పని చేస్తుండడం తమకు అసలైన గురుదక్షిణ అని వారన్నారు. వీరంతా భవిష్యత్తులో మరింత వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో డీజే డ్యాన్స్, ఫ్యాషన్ షో, ఆటపాటలతో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు సరదాగా గడిపారు. ఈ సమ్మేళనాన్ని చింతకింది శ్రీనివాస్ పర్యవేక్షించారు. వ్యాఖ్యాతగా కాచర్ల మోహన్, వందన సమర్పణ బాలె శివ, బోగ అరుణ్ చేశారు.
ఏఈఎస్ మేనేజ్మెంట్కు సన్మానం..
1991 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లి మేనేజ్మెంట్ను కూడా సన్మానించారు. తాము ఒకప్పుడు కూర్చొని చదువుకున్న తరగతి గదులను సందర్శించి మరోసారి పాత విద్యార్థులుగా మారిపోయారు. చిన్నతనంలో తినుబండారాలు ఆరగించిన క్యాంటీన్‌కు వెళ్లి మరోసారి అక్కడి స్నాక్స్ తిని సరదాగా గడిపారు. సాయంత్రం వరకు తమ చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.