‘నోట్ల రద్దు’పై సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అనంతర పరిణామాలపై గతంలో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా దాఖలైన పిటిషన్లను ఓకే చోట విచారిస్తున్నది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులోనే వాదనలు ప్రారంభం అయ్యాయి. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ నోట్ల రద్దు అనంతరం నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది వివరించారు. నోట్ల కొరత నెలకొందన్న వార్తలపైనా వివరణ ఇచ్చారు.
‘ప్రభుత్వం కరెన్సీ నోట్ల కొరత ను ఎదుర్కొంటుదన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వ ముద్రణాలయాల ద్వారా కావాల్సినన్ని కొత్త కరెన్సీ ని ముద్రిస్తున్నారు. అయితే ఆ నోట్లను బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులకు రవాణా చేయడంలో తీవ్ర జాప్యం తలెత్తుతోంది, వీలైనంత వేగంగా కొత్త నోట్లను తరలించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంలో ప్రజలు గాభరా పడాల్సిన అవసరం లేదు’అని ముకుల్ రోహత్గీ కోర్టుకు వివరించారు. (‘నోట్ల రద్దు’ కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు)
నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత నవంబర్ 10న బ్యాంకులు పునఃప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటివరకు(మంగళవారం రాత్రి వరకు) రూ.6 లక్షల కోట్ల రూపాయలు ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయయని రోహత్గీ కోర్లుకు తెలిపారు. నోట్ల మార్పిడి ప్రక్రియ ద్వారా మొత్తం రూ.15 లక్షల కోట్లు డిపాజిట్ అవుతాయని ప్రభుత్వం అంచనావేస్తున్నట్లు చెప్పారు. (ఆరు రోజుల్లోనే కొత్త కరెన్సీ తరలింపు..)