మూడు దేశాల ముద్దుబిడ్డ
బాల్యంలో తల్లి చెప్పే రామాయణ భారత గాథలు విన్నారు ఆనందాదేవి..
పెద్దయ్యాక కూడా వాటిని మర్చిపోలేదు...వాటినుంచి ఎంతో జ్ఞానం సంపాదించుకున్నారు...ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, తన జ్ఞానపరిధిని పెంచుకున్నారు...
మనిషికి మనసుకు మధ్య జరిగే సంఘర్షణలను తన కథలకు ప్రధానాంశంగా చేసుకున్నారు... రచనలలో భిన్న సంస్కృతులను చూపారు... భావవ్యక్తీకరణలో కొత్తకోణం ఆవిష్కరించారు...విమర్శకుల ప్రశంసలనందుకుంటూనే అనేక అవార్డులను గెలుచుకున్న ఆనందాదేవిమారిషస్లో పుట్టి, ఫ్రెంచ్‌లో రచనలు చేసిన అచ్చ తెలుగింటి అమ్మాయి అంటే ఆశ్చర్యమే!
మారిషస్‌లోని ఆనందాదేవి ఇల్లు, చెరుకుతోట మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆమె ఇంకా ఆహ్లాదకరమైన పుస్తకాలెన్నో చదివారు. ఆడుకోవడానికి చెల్లి తప్ప ఆ రోజుల్లో రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు లేవు. అయితే ఆ ఇంటి లైబ్రరీలో ఆర్థర్ కోనన్డోయ్లే, అగాథా క్రిస్టీ వంటి రచయితల రచనలు, 1001 నైట్స్ అండ్ బౌడేలైర్... వంటి ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె తల్లితండ్రులకు పుస్తకాలే ప్రాణం! బహుశ పుస్తకాలు చదివే అలవాటు వారి దగ్గర నుంచే అబ్బి ఉంటుంది.
మనసుతోనే ప్రయాణం...
భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో పెరిగిన ఆనందాదేవి, తన ఏడవ ఏటనే కవిత్వం రాయడం ప్రారంభించారు. 15 వ ఏట రచించిన చిన్న కథకు, ‘రేడియో ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ అవార్డు’ అందుకున్నారు. ‘‘ప్రపంచంలో ఏయే ప్రాంతాలకు ఎలా వెళ్లాలో తెలుసుకోవడానికి టైమ్ అట్లాస్ చూసేదానిని. నేను రాసే కథలలో అట్లాస్ చూస్తూ ఆయా ప్రాంతాలకు నా మనసుతో ప్రయాణిస్తుంటాను. నేను ఫ్రెంచ్‌లో రాస్తున్నప్పటికీ నాలో, నా రచనలలో భారతీయత ఉంటుంది. ఇప్పటికే నా రచనలు అనేక ఇతర భాషలలోకి అనువాదమయ్యాయి... ’’ అంటారు.
భాషల మాటకారి...
దేవి రచనలు ఫ్రెంచిభాషలో ఉంటాయి కాని, ఆమె పలు భాషలు మాట్లాడగలరు. ‘‘నాకు తెలుగు, క్రియోల్, ఫ్రెంచ్, భోజ్‌పురి, హిందీ భాషలు వచ్చు. ఎవరైనా నన్ను ‘మీరు ఏ భాషలో ఆలోచిస్తారు?’ అని ప్రశ్నిస్తే, ‘‘ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో ఆలోచిస్తాను. ’’ అంటారు ఆమె.
రచనలు...
ఆనందాదేవి రచనలలో అనేక సామాజిక అంశాలు ప్రతిబింబిస్తాయి. స్త్రీల గురించి, అనేక సామాజిక రుగ్మతల గురించి, అంగవైకల్యం, వ్యభిచారం, వృద్ధాప్యం, స్వలింగ సంపర్కం... వంటి ఎన్నో అంశాల మీద అనేక వ్యాసాలు రచించారు. ఇంకా... చిన్నకథలు, నవలలు రాస్తూ, అనువాదాలు చేస్తూ, పుస్తకాలు ప్రచురిస్తున్నారు. సాహిత్యం అనేది భాషాభేదం లేకుండా, తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అనువైనదనే విషయాన్ని ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
కలకత్తాలో...
కలకత్తాలో ఉన్నప్పుడు కొన్నిరోజులపాటు కొందరు వేశ్యలను దగ్గరగా గమనించారు ఆనంద. ఈ విషయం చెబుతూ, ‘‘వారు ఎటువంటి దుస్తులు ధరించాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? వంటి అంశాల మీద వారికి స్వేచ్ఛ ఉండదనిపించింది. ఈ విషయంలో ఆడపిల్లల కంటె మగపిల్లలను బాగా ఎడ్యుకేట్ చేయాలనిపించింది. వారికి స్త్రీలను గౌరవించడం నేర్పాలని నేను చెప్పినప్పుడు, చాలామంది న్యాయమూర్తులు, రాజకీయనాయకులు నన్ను విమర్శించారు’’ అని గుర్తు చేసుకున్నారు ఆనందాదేవి.
ముగింపు పాఠకులకే!
‘‘రచయిత పురుషుడైతే, ఇంటికి వెళ్లగానే, తనను డిస్టర్బ్ చేయవద్దని, తాను రాసుకోవాలని చెప్పగలుగుతాడు. స్త్రీకి అలా కుదరదు. ఇంటికి వెళ్లి అన్ని పనులూ చేసుకుని, పిల్లలకు కావలసినవన్నీ చూసి, ఆ తరువాత సమయం, ఓపిక... ఉంటేనే రాసుకుంటారు. అంతేగాని, ‘నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను రాసుకుంటున్నాను’ అనే అర్హత ఆమెకు ఉండదు కదా!’’ అంటారు ఆనంద. ఇంకా... ‘‘రచనలు చేయడమంటే పాఠకులను చాలెంజ్ చేయడమే. ఒక రచన చేస్తే, అందులోకి పాఠకుడు ప్రవేశించాలి. పాఠకులతో సున్నితంగా ఆడుకోవడమంటే నాకు ఇష్టం. అందుకే ముగింపు ఒక్కోసారి పాఠకులకే వదిలేస్తుంటాను. నా తాజా నవల ‘లెస్ జోర్స్ వివంత్స్ (ద లివింగ్ డేస్), నవల ముగింపును పాఠకులకే వదిలేశాను’’ అన్నారు, ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న ఆనందాదేవి. అయితే సమస్యలను మాత్రం ఆమె అలా గాలికి వదిలేయలేదు. తనకు చేతనైన పరిష్కారాలను సూచిస్తుంటారు. బహుశ ఆ అలవాటే ఆమె పురస్కారాలు అందుకోవడానికి అర్హురాలిని చేసి ఉండవచ్చు!
గుర్తింపు లేకపోవడమే మంచిది...
నన్నొక ప్రత్యేక వ్యక్తిగా నిలిపింది మారిషస్. అయినప్పటికీ నేను నా రచనలు చేసేటప్పుడు నేను మారిషస్ స్త్రీని అనుకోను. నేను కంప్యూటర్ ముందు కూర్చునే ఒక ప్రాణిని. ఒక్కోసారి పెన్ పేపరు పుచ్చుకునే ప్రాణిని. కథలు రాస్తూ, నాకు తెలియని ప్రదేశాలకు ప్రయాణిస్తుంటాను. రచయితగా నాకొక గుర్తింపు లేకపోవడాన్ని, లేదనుకోవడాన్ని నేను ఇష్టపడతాను. కొత్తకొత్త వ్యక్తుల మస్తిష్కంలో నన్ను నేను ఆవిష్కరించుకోగలను... వారిలాగ ఆలోచిస్తూ, వారిలాగ ఉంటూ...
- ఆనందాదేవి