ఏఓబీలో భారీగా కూంబింగ్
వై.రామవరం:
ఆంధ్రా– ఒడిశా సరిహద్దు (ఏఓబీ) అయిన తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల అటవీ ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వై.రామవరం మండలం నుంచి భారీగా పోలీసు బలగాలు అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి. తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్ర అటవీ ప్రాంతంలో బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి చెందిన సంగతి తెలిసిందే. వై.రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన చింతూరు మండలంలో పోలీసు ఇన్ఫార్మర్లు అనే నెపంతో మంగళవారం నలుగురు గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. గత నెలలో అదే మండలంలో పాస్టర్ మారయ్యను హతమార్చడం, రెండు నెలల క్రితం వై.రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా ,కొయ్యూరు మండలం మర్రిపాకల గ్రామ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టునేతలు ఆజాద్, ఆనంద్లతోపాటు ఒక మహిళ మృతి చెందారు. ఈ వరుస సంఘటనలతో తూర్పు గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. చింతూరు మండలంలో కిడ్నాప్ చేసిన నలుగురు గిరిజనులను తీసుకుని మావోయిస్టులు ఏఓబీలోకి ప్రవేశించారన్న సమాచారంతో ఒక పక్క తూర్పు, మరోపక్క విశాఖ జిల్లాల పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ప్రధాన రహదారుల్లోను, అనుమానాస్పద ప్రదేశాల్లోను తనిఖీలు నిర్వహిస్తూ అపరిచితులు,అనుమానాస్పద వ్యక్తులపై గట్టి నిఘా ఉంచారు. ఏఎన్ఎస్, గ్రే హౌండ్స్, సీఆర్పీఎఫ్ పోలీసులు కూంబింగు నిర్వహిస్తున్నారు.