అతివకు అభయమేదీ?
ఆగని అఘాయిత్యాలు
మొన్న ఫామ్‌హౌస్‌లో స్నేక్‌గ్యాంగ్ అకృత్యం
నిన్న మేడిపల్లిలో ఆటోగ్యాంగ్ దారుణం
శనివారం అర్ధరాత్రి కూకట్‌పల్లిలో ఘోరం
ఆందోళనరేకెత్తిస్తున్న ఘటనలు
నేరాల అదుపులో పోలీస్ వైఫల్యం
మూడేళ్లలో లైంగిక దాడులు 521
శిక్షలు పడింది నలుగురికే...
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో నేరగాళ్లు విజృంభిస్తున్నారు. అఘాయిత్యాలు, అకృత్యాలను నిరాటంకంగా కొనసాగిస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఫలి తంగా మహిళలకు రక్షణ కరువైంది. గ్రేటర్ పరిధిలో నిత్యం చోటుచేసుకుంటున్న ఘటనలు జలదరింప చేస్తున్నాయి. పాలకులు హైదరాబాద్‌కు విశ్వఖ్యాతిని తీసుకొస్తామని.. నేరరహిత నగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నా అకృత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది.
ఇటీవల పహాడీషరీఫ్ ఫామ్‌హౌస్‌లో ఓ యువతిపై... రెండు రోజుల క్రితం మేడిపల్లి అటవీ ప్రాంతంలో గిరిజన యువతిపై గ్యాంగ్ రేప్.. ఈ ఘటనలను మరువక ముందే శనివారం అర్ధరాత్రి కూకట్పల్లి ప్రాంతంలో ఓ మహిళపై కూడా సామూహిక అత్యాచారం జరిగింది. అంతటితో ఆగకుండా దారుణంగా హత్య చేశారు. కఠిన శిక్షలు పడకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
2011 నుంచి 2013 వరకు జంట పోలీసు కమిషనరేట్లలో మహిళలపై జరిగిన దారుణాలకు సంబంధించి 10,557 కేసులు నమోదయ్యాయి. ఇందులో లైంగిక దాడికేసులు 521 ఉన్నాయి. మరోవైపు చోరీలు, చైన్ స్నాచింగ్‌లూ సర్వసాధారణంగా మారాయి. యువతులు, మహిళలు బయటకు వెళ్తే వారి ఒంటిపై ఉండే ఆభరణాలకే కాదు వారి ప్రాణాలకూ భద్రత లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నా నివారించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. నగరంలో 504 మంది మహిళా పోలీసులు అవసరం ఉండగా కేవలం 273 మంది మాత్రమే ఉన్నారు.
సాగని కేసుల దర్యాప్తు..
నిర్భయ వంటి కఠిన చట్టాన్ని రూపొందించినా మృ గాళ్లలో మార్పు రావడం లేదు. అత్యాచారాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అదే సమయంలో కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దుండగులకు సకాలంలో శిక్షలు పడకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు.
గత మూడేళ్లలో లైంగిక దాడులకు సంబంధించి 521 కేసులు నమోదు కాగా, కేవలం నలుగురికి మాత్రమే శిక్ష పడింది. పోలీసుల దర్యాప్తు తీరు సరిగా లేనందునే ఈ పరిస్థితి ఎదుర వుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరస్తులకు తగిన శిక్ష పడితే నేరాల శాతం తగ్గుతుందని వివిధ వర్గాల వారు అభిప్రాయ పడుతున్నారు. సంఘటన జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేయడం, ఆ తరువాత సాక్ష్యాధారాలను సేకరించడంలో విఫలమవుతుండడంతో నిందితులు కేసుల నుంచి సులువుగా బయటపడుతున్నారనే వాదన ఉంది.