ఆఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి: ముగ్గురు మృతి
ఆఫ్ఘానిస్థాన్‌లోని జలాలాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారి కార్యాలయం వద్ద ఆత్మహుతి దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారని నంగర్హర్ ప్రొవెన్షియల్ ప్రతినిధి అహ్మద్ జియ అబ్దుల్జయ్ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులతోపాటు పౌరుడు కూడా ఉన్నారని తెలిపారు. పోలీసు కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కారులో ఉండి తీవ్రవాది తనను తాను పేల్చుకొని ఆ ఘాతుకానికి ఒడిగట్టాడని చెప్పారు.
ఆ ఘటనలో ఐదుగురు గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. అఫ్ఘాన్‌లో మోహరించిన విదేశీ దళాలను వెనక్కి పంపించాలని చాలా కాలంగా తీవ్రవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించక పోవడంతో తీవ్రవాదులు ఆ దాడులకు పాల్పడుతున్నారని పోలీసు ఉన్నతాధికారి వివరించారు.