దావూద్‌పై మోదీ మాస్టర్ స్ట్రోక్ ఉత్తిదే
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం దాడులు నిర్వహించిందని వచ్చిన వార్తలను ఆ దేశ ప్రతినిధి అహ్మద్ అల్ బనా కొట్టిపారేశారు. అలాంటిదేమీ ఇంతవరకు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. రూ.15,000కోట్ల దావూద్ ఆస్తులను సీజ్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇలాంటివి జరగాలంటే యూఏఈ న్యాయవ్యవస్థ ద్వారా మాత్రమే జరుగుతుందని, కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ మొదలే కాలేదని చెప్పారు.
చదవండి..(దావూద్‌కు మోదీ మాస్టర్ స్ట్రోక్!!)
దావూద్ ఇబ్రహీంకు ప్రధాని మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని, గతంలో యూఏఈ పర్యటనకు వెళ్లిన ఆయన దావూద్ అక్రమాలపై రుజువులను యూఏఈ ప్రభుత్వానికి చూపించారని ఆ మేరకే తాజాగా దావూద్ ఆస్తులను సీజ్ చేశారని వార్తలు వచ్చాయి. వీటిని హైలెట్ చేస్తూ బీజేపీ కూడా ప్రధాని మోదీ మరో మాస్టర్ స్ట్రోక్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. అయితే, తాజాగా అవేవి వాస్తవాలు కావని బనా తెలిపారు. తొలుత రాజకీయ పరంగా చర్చించి నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థ ద్వారా మాత్రమే యూఏఈలో ఇలాంటి విషయాల్లో ముందుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.