బీఎన్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ
భివండీ, న్యూస్‌లైన్: భివండీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా అహ్మద్ సిద్ధికి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పది రోజుల కిందటే ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉండగా, ఇంతవరకు శివసేనకు చెందిన మేయర్ తుషార్ చౌదరి పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఆయన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే రాక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. భివండీ కార్పొరేషన్లో మొదటిసారి శివసేనకు చెందిన తుషార్ చౌదరి మేయర్‌గా ఎన్నికయ్యారు.
దీంతో ఉద్ధవ్ నుంచి అపాయింట్మెంట్ దొరగ్గానే ముహూర్తం ఖరారు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, భివండీ మున్సిపల్ కార్పొరేషన్లో శివసేన, కాంగ్రెస్ కూటమి ఉంది. అయినప్పటికి కోనార్క్ వికాస్ ఆగాడికి పోటీ ఇవ్వలేక పోయింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో శివసేన, బీజేపీల కూటమి ఉన్నందున స్థానిక శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే బీజేపీ, శివసేన సీనియర్ నాయకుల నుంచి విప్ తెచ్చారు. దీంతో శివసేన పార్టీకి ఆఖరు నిమిషంలో బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలుపడంతో శివసేనను మేయర్ పీఠం వరించింది. దీంతో భివండీ కార్పొరేషన్లో మొదటిసారి మేయర్ పదవి శివసేన దక్కించుకున్నట్లయ్యింది.