AIGF
-
రాబోయే వ్యాధులకు ముందే చెక్!
సాక్షి, హైదరాబాద్: మానవ కణజాల నమూనాల సంరక్షణ, విశ్లేషణ కోసం అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన అత్యాధునిక బయోబ్యాంక్‌ను ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది. 3 లక్షలకుపైగా జీవ నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ చేసేందుకు వీలుగా ఈ బయోబ్యాంక్‌లో మైనస్ 80 డిగ్రీల ఫ్రీజర్లు పదిహేను, మైనస్ 20 డిగ్రీల ఫ్రీజర్లు ఐదు, మైనస్ 160 డిగ్రీలతో కూడిన మూడు లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులు ఉన్నాయి. ఈ తరహా నిల్వ కేంద్రం ఏర్పాటు దక్షిణాదిలోనే మొదటిదిగా పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ ఈ బయోబ్యాంక్‌ను మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ బయో బ్యాంక్ అర్థవంతమైన పరిశోధనలకు, వ్యాధుల నివారణకు వీలు కల్పిస్తుందని.. అంతిమంగా అత్యాధునిక వైద్య విధానాల అభివృద్ధికి దోహదపడుతుందని హుడ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్, బిగ్ డేటా టూల్స్, మెషీన్ లెర్నింగ్ అల్గా రిథమ్‌ల మేళవింపుతో ఈ బయోబ్యాంక్ పనిచేస్తుందన్నారు. కేన్సర్, డయాబెటిస్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు బయటపడక ముందే కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని సంతరించుకొనే క్రమంలో బయోబ్యాంక్ ఏర్పాటును మేలిమలుపుగా లెరోయ్ హుడ్ అభివర్ణించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ ప్రెసిడెంట్, కో–ఫౌండర్ అయిన హుడ్... హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసిన ఆటోమేటెడ్ జీన్ సీక్వెన్సర్ను గతంలో కనుగొన్నారు. ఇదో మైలురాయి: ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి వైద్య పరిజ్ఞానాన్ని, ఆరోగ్య సంరక్షణలో పురోగతిని పెంపొందించే దిశగా బయోబ్యాంక్ ఓ మైలురాయి కాగలదని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశోధకులు, వైద్యులు, శాస్త్రవేత్తలకు కీలక వనరుగా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తమ బయోబ్యాంక్‌కు 3 లక్షల కంటే ఎక్కువ నమూనాలను నిల్వ చేయగల సామర్థ్యం ఉందని వివరించారు. వ్యాధుల నివారణకు తోడ్పడే ఔషధ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి బయోబ్యాంక్ ఏర్పాటు సహకరిస్తుందని చెప్పారు. దీనిద్వారా వచ్చే 5–10 ఏళ్ల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది రోగులతోపాటు ఆరోగ్యకరమైన వ్యక్తుల వివరాలను సేకరించి వారి జీవ నమూనాలను విశ్లేషిస్తామని వివరించారు. వ్యాధుల నిర్ధారణ, నివారణలో విప్లవం... బయోబ్యాంక్ అనేది ఒక రకమైన నిల్వ సౌకర్యం. ఇది 3 లక్షల కంటే ఎక్కువ మానవ కణజాల నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ ఉంచగలదు. మానవ కణజాల నమూనాల నిల్వ, విశ్లేషణ ద్వారా ఇది జన్యు పరిశోధనలో సహాయ పడుతుంది. సంక్లిష్ట వ్యాధుల చికిత్స రానురానూ కష్టతరంగా మారుతున్న పరిస్థితుల్లో వ్యాధుల రాకను ముందే పసిగట్టే అద్భుతమైన అవకాశాన్ని ఇది అందిస్తుంది. దీనికోసం వ్యక్తుల కణజాల నమూనాలను సేకరిస్తారు. వాటిని నిల్వ చేసి పదేళ్లపాటు వారి ఆరోగ్య స్థితిగతుల్ని నిశితంగా పర్యవేక్షిస్తారు. ఆ సమయంలో ఆయా వ్యక్తుల్లో ఆరోగ్యపరంగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్ని, వ్యాధుల దాడిని, వాటికి కారణాలను పసిగట్టడం ద్వారా వారసుల ఆరోగ్య స్థితిగతుల్ని అంచనా వేస్తారు. అలాగే దాదాపుగా అదే కణజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తులందరికీ భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా పసిగట్టే అవకాశం లభిస్తుంది. తద్వారా వ్యాధి రావడానికి ముందే నివారణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలవుతుంది. -
రాష్ట్రాల్ని ఊరిస్తున్న గేమింగ్!
బెట్టింగ్‌కూ చట్టబద్ధత కల్పిస్తున్న చిన్న రాష్ట్రాలు • ముందు వరుసలో సిక్కిం, దానివెంటే నాగాలాండ్ • త్వరలో పాండిచ్చేరిలో అనుమతులు: ఏఐజీఎఫ్ • 2010కే దేశీ బెట్టింగ్ పరిశ్రమ రూ.4 లక్షల కోట్లు: కేపీఎంజీ • ప్రస్తుతం దాని విలువ రూ.10 లక్షల కోట్లు: ఐసీఎస్ఎస్ • అంతా చట్ట విరుద్ధంగానే: సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా • చట్టబద్ధం చేస్తే ఆర్థిక వ్యవస్థకూ మంచిదని సూచన సాక్షి ప్రతినిధి కొత్త ఆదాయ వనరులు వెతుక్కుంటున్న రాష్ట్రాలనిపుడు గేమింగ్, బెట్టింగ్ పరిశ్రమ ఊరిస్తోంది. కొన్ని నైతిక అంశాలు ఇమిడి ఉండటంతో పాటు... ప్రతిపక్షాలు, ఇతర వర్గాల నుంచి గట్టిగా వ్యతిరేకత వచ్చే అవకాశాలుండటంతో పెద్ద రాష్ట్రాలు ముందుకెళ్లటానికి వెనకంజ వేస్తున్నాయి. పెద్దగా ఆదాయ వనరులు లేని, బలమైన నాయకత్వం ఉన్న చిన్న రాష్ట్రాలు మాత్రం గేమింగ్, బెట్టింగ్ పరిశ్రమకు గేట్లు తెరిచేస్తున్నాయి. 2010 నాటికే దేశంలో ఈ పరిశ్రమ విలువ దాదాపు 60 బిలియన్ డాలర్లున్నట్లు (రూ.4 లక్షల కోట్లు) కేపీఎంజీ తన నివేదికలో అంచనా వేసింది. ఇదంతా సంఘటితంగా లేదని, దీన్లో చట్టవిరుద్ధంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్, గాంబ్లింగ్ కూడా ఇమిడి ఉన్నాయని సంస్థ వెల్లడించింది. అయితే అంతర్జాతీయ స్పోర్ట్స్ సెక్యూరిటీ సెంటర్ (ఐసీఎస్ఎస్) తాజా నివేదికలో మాత్రం ప్రస్తుతం దేశంలో 150 బిలియన్ డాలర్ల చట్ట విరుద్ధ బెట్టింగ్ జరుగుతోంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.10 లక్షల కోట్లు. ఈ మార్కెట్ పరిమాణం అంతర్జాతీయంగానైతే ఏకంగా 4 లక్షల కోట్ల డాలర్లు!!. సిక్కింతో మొదలు... ఆదార్లో మరిన్ని!! దేశంలో క్యాసినోలంటే మొదట గుర్తొచ్చేది గోవానే. కాకపోతే అక్కడ క్యాసినోలకు సముద్రంపై ఏర్పాటు చేయటానికి మాత్రమే అనుమతి ఉంది. ఈ క్యాసినోల వల్ల ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పర్యాటకులు కూడావెళుతున్నారు. ఇదంతా చూసిన ఈశాన్య రాష్ట్రం సిక్కిం... 2009లో కొత్త గేమింగ్ చట్టం తీసుకొచ్చింది. ఆన్లైన్ గేమ్స్‌కు అనుమతిచ్చింది. అయితే అవి ఇంట్రానెట్ ద్వారా ఆ రాష్ట్రంలో మాత్రమే అందుబాటులోఉంటాయి. జీ ఎంటర్టైన్ మెంట్‌కు చెందిన ఎస్సెల్ గ్రూపు దీన్ని అందిపుచ్చుకుని... తన సంస్థ ‘ఈజీటీ’ ద్వారా ఫ్రాంచైజీ పద్ధతిన ఆన్లైన్ గేమింగ్ సేవల్ని ఆరంభించి... ఇప్పుడక్కడ 120 ఔట్లెట్ల ద్వారాకార్యకలాపాలు సాగిస్తోంది. ఇక స్థానిక సంస్థ గోల్డెన్ గేమింగ్ కూడా ఇదే పద్ధతిలో 140 ఔట్లెట్లను తెరిచింది. గోవాలో క్యాసినోలున్న డెల్టా కార్ప్... గాంగ్టక్లోనూ క్యాసినో ఏర్పాటు చేస్తోంది. తాజాగా సిక్కిం... క్రికెట్బెట్టింగ్కు కూడా చట్టబద్ధమైన అనుమతులివ్వటం గమనార్హం.ఏటా రూ.100 కోట్ల ఆదాయంగేమింగ్, బెట్టింగ్‌కు అనుమతులివ్వటం వల్ల సిక్కింకు ఏటా రూ.100 కోట్లకు పైగా లైసెన్సు ఫీజుల రూపంలో ఆదాయం వస్తోంది. దీనికోసం సిక్కింలో డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ఓ విభాగం కూడా పనిచేస్తోంది.క్యాసినోలు టూరిస్టుల్ని తప్ప స్థానికుల్ని అనుమతించకుండా... గేమింగ్‌లో నిబంధనల్ని పాటించేలా చూడటం దీని విధి. ఇది లాటరీలనూ పర్యవేక్షిస్తుంది. నాగాలాండ్, పాండిచ్చేరి కూడా!! మరో ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో ఇప్పటికే లాటరీలకు అనుమతి ఉంది. ఇక్కడ కూడా గేమింగ్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్) సీఈఓ రోలాండ్ల్యాండర్స్ చెప్పారు. ‘‘చిన్న, పెద్ద రాష్ట్రాలు చాలావాటితో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. చట్టవిరుద్ధంగా సాగుతున్న బెట్టింగ్, గేమింగ్‌ను చట్టబద్ధం చేస్తే కనీసం ఆయా సంస్థలు ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి.మో సాలు జరగకుండా ఉంటాయి. ప్రభుత్వాలకూ ఆదాయం వస్తుం ది. ఈ విషయంలో పాండిచ్చేరి ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. త్వరలో అక్కడ గేమింగ్ చట్టం రాబోతోంది. ఇక క్యాసినోల ఏర్పాటుపై తెలంగాణప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. అక్కడి ప్రభుత్వ ముఖ్యులతో ప్రతింపులు జరుపుతున్నాం. పర్యాటకుల్ని ఆకర్షించడానికిది ఉపకరిస్తుందన్న భావనతో వాళ్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు’’ అని సాక్షి ప్రతినిధితో ల్యాండర్స్ చెప్పారు. గట్టి నియంత్రణలు తప్పనిసరి! నిజానికి స్కిల్ ఆధారిత గేమ్స్‌కు ఇప్పటికీ ఒరిస్సా, అస్సాం తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ అనుమతి ఉంది. ఈ ముసుగులో ఆన్లైన్ రమ్మీ వంటివి విజృంభిస్తున్నాయి కూడా. వీటివల్ల రాష్ట్రాలకు పన్నులు మాత్రం రావటంలేదు. ‘‘చట్టబద్ధం చేస్తే ఈ రంగం వృద్ధి చెందుతుంది. పకడ్బందీ నియంత్రణలతోనే ఇది చెయ్యాలి. విదేశాల్లో ఇప్పటికే ఈ పరిస్థితి ఉంది. చట్టబద్ధం చేస్తే ఉద్యోగాల కల్పనతో పాటు ఆర్థిక వ్యవస్థకూ మంచిదే’’ అని సీబీఐమాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఇటీవల సిక్కింలో నిర్వహించిన ఏఐజీఎఫ్ సదస్సులో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. హార్స్ రేసింగ్‌ను స్కిల్ గేమ్ ముసుగులో అనుమతిస్తున్నారని, మరి దానిపై బెట్టింగ్స్కిల్ ఎలా అవుతుందని ఫిక్కీ డైరెక్టర్ రాజ్‌పాల్ సింగ్ ప్రశ్నించారు. అలాంటపుడు క్రికెట్ ఎందుకు కాదని కూడా అడిగారాయన. ‘‘రూ.3 లక్షల కోట్ల మేర చట్టవిరుద్ధ బెట్టింగ్ జరుగుతోంది. ఒకవేళ వారిని పట్టుకున్నాశిక్షించడానికి సరైన చట్టాల్లేవు. అందుకే దీన్ని చట్ట బద్ధం చేసి, తగిన చట్టాలు తీసుకొస్తే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది’’ అని చెప్పారాయన. జనం ఫిక్సింగ్కే వ్యతిరేకమని, బెట్టింగ్‌కు కాదని... రెండిటినీ విడదీసి చూడాలనిచెప్పారు. ఈ సందర్భంగా రంజిత్ సిన్హా నోట్ల రద్దుపైనా విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానాలిచ్చారు. దేశంలో బ్లాక్‌మనీని పూర్తిగా నిర్మూలించటం కష్టమన్నారు. కాకపోతే ఇది ఆ దిశగా నిజాయితీతో వేసిన ఓ అడుగు’’అని వ్యాఖ్యానించారు.